Friday, May 26, 2023

ధర్మం మర్మం

ఉగాది అర్థము, విధి, శోభకృత్‌ నామ సంవత్సరం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

యుగాది అనగా యుగము, జంట. జంట అనగా ప్రకృతి, పురుషుడు. ఆ రెండింటి కలయిక అయిన రోజు యుగాది. జీవుడు ప్రకృతితో కలవగానే సృష్టి అంటారు. పరమాత ్మ జీవుడిని ప్రకృతితో చేర్చిన రోజు యుగాది. దీనినే తెలుగులో ఉగాది అని అంటున్నాము. జోతిష్యశాస్త్రం ప్రకారం సంవత్సరము, పరివత్సరము, ఇదువత్సరము, ఇదావత్సరము, ఇద్వత్సరము ఈ ఐదింటికి యుగము అని పేరు. సంవత్సర చక్రంలో 12 యుగములు కలవు. ఇది 60 సంవత్సరాల కాలచక్రము. ఈ విధంగా సంవత్సరాదిని యుగాది అని అంటారు. ఈ ఉగాదికి శోభకృత్‌ నామ సంవత్సరం అని పేరు.

- Advertisement -
   

ఉగాది ఈరోజు సూర్యోదయ పూర్వము లేచి అభ్యంగన స్నానం ఆచరించవలెను. యుగాది నాడు అభ్యంగన స్నానం ఆచరించని వారు 12 జన్మలు రాక్షసులుగా పుడతారని శాస్త్రం . నూతన వస్త్రధారణ, ఇష్ట దైవారాధన మరియు బంధుమిత్రులను ఆహ్వానించి పంచాంగశ్రవణము చేసి వేపపువ్వు, మామిడిపిందె ముక్కలు, చింతపండు, బెల్లం, ఇతర చూర్ణములు కలిపి చేసిన ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదన చేయవలెను. విభవముల కొలది పిండివంటలు భగవంతునికి నివేదన చేసి పదిమందికి పెట్టి మనం తినాలి. సాయంకాలము దేవాలయానికి వెళ్ళి దైవ దర్శినం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలి. బ్రహ్మాండ మార్కేండేయ పురాణాలానుసారం చైత్ర శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు నవరాత్రులు అని అంటారు.

కార్తీక ఆశ్వయుజో: మాసో: చైత్రే మాసిచ భారత
నవరాత్రి అర్చనం కార్యం మహాపూజా విశేషత:
రామస్య చార్చనం కార్యం దేవ్యాశ్చైవ విశేషత:

అనగా కార్తీక ఆశ్వయుజ, చైత్ర మాసములలో పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులు శ్రీరామ చంద్రునికి లేదా దేవికి మహాపూజ చేయాలి. ఈ మూడు మాసాలలో 9 తిథులు అనగా మొత్తం 27 రోజులు చాలా విశిష్టమైనవి. ఈ తిథులలో వ్రతము స్వీకరించిన వారు 9 రోజులు ఉపవాసం ఆచరించి దశమి నాడు పారణ అనగా భోజనం చేయాలి. శక్తి లేని వారు నక్త వ్రతమును ఆచరించాలి అనగా రాత్రి మాత్రమే భుజించాలి. ప్రతి రోజూ శిరస్నానం, శుభ్రమైన వస్త్రధారణ, బంధుమిత్రులతో కూడి భగవానుని ఆరాధన మరియు సంకీర్తన గావించాలి.

ఈ సంవత్సరం అంతా ఇళ్లలో, దేవాలయాలలో, క్షేత్రాలలో నిత్యాభిషేకాలు జరిపితే అన్ని రోగాలు శాంతించి కరువు కాటకాలు తొలగిపోయి కలహాలు, కలతలు నిర్మూలించబడి సుఖశాంతులతో తులతూగుతారు. ఈ సంవత్సరం విష జంతువులు, విష రోగాలు, విష స్వభావం ఉన్న వ్యక్తుల దౌర్జన్యాలు పెరుగుతాయి. దానికి భగవదారాధన, యజ్ఞయాగాదులు అభిషేకాలతో శాంతి జరుగుతుంది. దాన ధర్మాలు, నిత్యాభిషేకాలు, విశేషారాధనలు అన్ని ఉపద్రవాలను తొలగించి శుభాన్ని, సుఖాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. భగవదారాధనతో అందరూ అనందంగా ఉండాలని ఉంటారని ఆ పరమాత్మను స్మరిద్దాం.

సర్వేజనా సుఖినోభవంతు..

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement