Friday, April 19, 2024

ధర్మం – మర్మం : స న్మిత్రుడు (ఇ)


మహాభారత సంకలనం సుభాషిత సుధానిధిలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

యెయోశ్చిత్తేన వా చిత్తం నైభృత్యేన చనై భృతమ్‌
సమేతి ప్ర జ్ఞయా ప్రజ్ఞా తస్య మైత్రీ న జీర్యతే

చిత్తముతో చిత్తము, విశ్వాసముతో వి శ్వాసము, బుద్ధి కుశలతతో బుద్ధికుశలత ఇద్దరికీ సమానముగా ఉన్నచో వారి మైత్రి ఎన్నడూ అంతరించదు.

అనగా మనస్సుతో మనస్సు ఇద్దరికి కలవాలి. కలిసిన మనసులు కలవారు దూరంగా ఉన్నా ఒకే విషయాన్ని ఒకే విధంగా తలుస్తారు. ఎంత దూరాన ఉన్నా మిత్రునికి ఆపద వస్తే మనస్సు బాధకు గురై వెంటనే వారి క్షేమసమాచారాలు తెలుసుకొంటారు.

ఉత్తర రామాయణంలో వేయి మందితో కూడిన సభలో ఉన్న రామునికి సీత గోరువెచ్చని పాలు అందిస్తే అక్కడే ఉన్న మహర్షి రాముడు పాలు అడగకనే ఎందుకిచ్చావని సీతను ప్రశ్నించగా భర్త మనసెరిగి మెలిగేది భార్య అని తన స్వామి గోరువెచ్చని పాలు తాగాలని మనసున తలచినందునే పాలు తెచ్చానని సమాధానమిచ్చెను. అలాగే ఇద్దరి విశ్వాసాలు ఒకటై యుండి ఎవరెన్ని చెప్పినా ఒకరిపై ఒకరికి నమ్మకం తరగకుండా ఉండాలి. రాముడిపై సీతకు, సీతపై రామునికి ఉన్న అపారమైన వి శ్వాసము వలన ఎవరు ఏమి చెప్పినా నమ్మలేదు. అదేవిధంగా ఇద్దరి ప్రజ్ఞా ఒకే తీరుగా ఉండాలి. సముద్రం ఆవలి ఒడ్డున ఉన్న రాముడు లంకలోని సీతను తలచి సీతపై వీచి తనను తాకమని వాయుదేవుడిని ప్రార్థించెను. దాని వలన తమ ఇద్దరి తనువులు తాకినట్టవునని తలచెను. చంద్రుడిని ఇచట నుంచి తాను అచట నుంచి సీత చూస్తున్నాము కావున తమ చూపులు కూడా కలుస్తున్నాయని రాముడు భావన చెందెను. ఇటువంటి అద్వైత భావం కలవారందరి మైత్రి ఎన్నటికీ తరుగదు.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement