Sunday, October 6, 2024

ధర్మం – మర్మం : వినాయక రహస్యము (ఆడియోతో..)

శివాంతార్థనం, శివ సాక్షాత్కరం గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

గజాసుర వృత్తాంతము

గజాసురుడు శంకరుడు గూర్చి తపస్సు చేసి ప్రసన్నుడిని చేసుకుని తన కడుపులో నివసించమని ప్రార్థించి ఆ వరము పొంది లోకములకు శంకరుడి దృష్టి లేకుండా
చేసెను. భర్త జాడ తెలియని పార్వతి శ్రీమన్నారాయణుని ప్రార్థించగా తానే స్వయంగా వెళ్ళి తీసుకు వస్తానని స్వామి బయలుదేరగా, భర్త రాబోతున్న ఆనందంతో పార్వతి అభ్యంగన స్నానమునకు సిద్ధపడి పరధ్యానంగా నలుగు పిండితో ఒక బొమ్మను చేసి దానికి ప్రాణ ప్రతిష్ట చేసి తన స్నానశాలకు కావలిగా ఉంచి స్నానమునకు వెళ్లెను. అటు తరువాత శంకరుడు రావడం, అడ్డగించిన బాలుడి శిరస్సు ఖండించి లోపలికి వెళ్ళడం, పార్వతి ప్రార్ధనతో ఆ బాలునికి గజ శిరమును అతికించుట ఇదంతా గజానన అవతార వైభవమని అందరికీ తెలిసిందే.

జగన్మాతగా పేరొందిన పార్వతి అనుకోకుండా బొమ్మను చేసి ప్రాణ ప్రతిష్ట చేయడం, సర్వజ్ఞుడైన శంకరుడు ఆ పిల్లవాడు ఎవరో తెలియక శిరస్సును ఖండించడం, అమ్మ ప్రార్థిస్తే గజ శిరమును అనుసంధానం చేయడం ఇదంతా పార్వతీ పరమేశ్వరులు అనుకుని చేసిన కార్యక్రమంలాగా అనిపిస్తుంది. శంకరుడు అర్ధనారీశ్వరుడు కావున పార్వతీ చెంతనే ఉంటాడు. అదే విధ ంగా శంకరుడు ఏ పని చేసినా సగభాగం పార్వతే కావున పార్వతి బొమ్మ చేసినపుడు శంకరుడు ఉన్నాడు అలాగే శంకరుడు బాలుడు శిరస్సును ఖండించినపుడు పార్వతీ చెంతనే ఉన్నది. ఈ కథలోని పరమార్థం లోకానికి గజముఖుడైన గణపతి కావాలి మరియు ఆ గజం ఆసురతత్త్వం నిండిన దైవభక్తి
కలదై ఉండాలి. అనగా ప్రాకృత శక్తి, ఆసుర శక్తి, దైవ శక్తి ఈ మూడు సాత్విక, రాజస, తామస గుణముల పుట్టిల్లు. ఉదరమున శంకరున్ని కొలువుంచుకోవాలన్న కోరిక, భగవంతుడిని తాను మాత్రమే సేవించాలి, దర్శించాలి, తననే కాపాడాలి అనే స్వార్థం ఆసుర గుణం. అలాగే భగవంతుడిని దాచుకోవడం ప్రాకృత గుణం. అది భగవంతుని ధ్యానంగా పరిణమించడం సాత్విక గుణం. మంగళమును, శుభమును కలిగించు శంకరున్ని ఉదరమున దాచుకుని మరల తిరిగి ఇవ్వడంలోనే ఆంతర్యం దాగి ఉంది.

”ఉదరమంతరం కృతే అథతస్య భయం భవతి.” అనగా జగత్తును పరమాత్మకంటే వేరుగా ఏ కొంచెం చూచినా భయం కలుగును. బేధ దృష్టి భయకారకము అని భావం. మంత్రము వలన బేధము తొలగి పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడని గజాసుర సంహారంలోని ఆంతర్యం.

- Advertisement -

గజాసురుడు తాను చనిపోయినా తన శిరస్సును లోకపూజ్యం చేయమని ప్రార్థించాడు. భగవంతుడిని ఉదరమున దాచుకోవాలన్న తలంపు శిరస్సులో పుట్టింది కావున ఆ శిరస్సు లోకపూజ్యం అయ్యింది. ఉదరం అనగా బేధం, స్వార్ధం లేదా ఆశ. వీటిని వాక్కు బలంతో అనగా మంత్రోపాసనతో తొలగించి బుద్ధిలోని దైవత్వాన్ని ఆరాధించాలి కావున ఆ శిరస్సు సకల లోకారాజ్యం అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement