Monday, December 9, 2024

మనలో నైతికతకు శతక పద్యాలు

ఒకసారి కలిపురుషుడు ఒంటి కాలి మీద ఉన్న ధర్మాన్ని కాలుతో తన్నాడు. ధర్మం పడిపోయి, దిక్కు తోచక దు:ఖంతో ఉంటే, అక్కడికి భూమాత దు:ఖంతో వచ్చి, ”ధర్మమా! ఎందుకు దుఖిస్తున్నావు?” అని అడిగింది. కలియుగంలో ధర్మానికి స్థానం లేదని విచారిస్తున్నాను. అంటే, ధర్మం భూమాతను అదే ప్రశ్న వేస్తే, భూమాత బదులిస్తూ, ‘దేవాది దేవుడి పాదాలు ఇంతవరకు మోసాను. ఇప్పటి నుండి అధర్మపరులు, దుర్మార్గులు పాదాలు మోయవలసి వస్తోందని’ చెప్పింది. అంటే ఈ యుగంలోని మనుష్యుల తత్త్వాలు గురించి పంచభూతాలు అన్నీ విచారిస్తున్నాయి.
శతక పద్యాలు మనకు నైతికతను తెలుపుతున్నాయి. మన జీవితం సుఖమయం చేసుకోడానికి మార్గం చెపుతున్నాయి ధర్మమార్గాన్ని విశదీకరిస్తున్నాయి. సుమతీ శతకంలోని ఈ పద్యం చూడండి.
”అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీయని వేల్పు
మోహరము దా నెక్కిన బారని గుఱ్ఱము —
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!! అని.
అంటే… అవసరానికి సహాయానికి రాని చుట్టాలు, వేదనతో వేడుకొన్నప్పటికీ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధసమయంలో వేగంగా పరుగెత్తని గుఱ్ఱమును విడిచిపెట్టాలని భావం.
ఈ రోజుల్లో బంధాలను నిలబెట్టుకోవడం లేదు. తల్లి లేదు, తండ్రి లేడు. ఎవరితోనైనా సరే ఆర్థిక సంబంధాలు మాత్రమే కొలమానంగా ఉంటున్నాయి. మనలో అనైతిక, అనైక్యత స్వార్థ చింతన ఉంటే ఎవరూ అక్కర్లేదు. అదే వయసు ఉడికే సరికి తప్పని సరిగా చేదోడు ఉండాలి. అంటే బంధాలు కొనసాగాలి. నువ్వు ఎంతవేడుకొన్నా కరుణించని పరమాత్మను వేడుకోక, నీలోని దోషాలు సరిచేసుకొని ప్రార్థిస్తే, భగవంతుడే నీ వద్ద‌కు వస్తాడు. పుండరీకుడు దుర్వ్య‌స‌నాల‌కు అలవాటు పడి వృద్ధాప్యంలోని తల్లితండ్రులను కూడా వదిలేసి ఉండేవాడు. అటువంటివాడు తన తప్పును గ్ర‌హించి, మాతాపితురుల సేవ చేయడం, మొదలు పెట్టిన తరువాత, సాక్షాత్తు, విఠలుడే (పాండురంగడే) స్వయంగా ఇంటి ముందు వేచి ఉన్న సంగతి మనకు తెలిసిందే. కాబట్టి, మనలోని అనైతికను వదిలి, బంధాలు నిలుపుకొనే విధంగా ముందుకు సాగడం ధర్మం. అదే నైతికత.

  • అనంతాత్మకుల రంగారావు
Advertisement

తాజా వార్తలు

Advertisement