Saturday, March 23, 2024

భారతావని – విజ్ఞాన ప్రదాయిని

విశ్వ మానవ సంక్షేమాన్ని కాంక్షించే ప్రేమైక స్వరూపిణి… విజ్ఞాన ప్రదాయిని మన భారతావని. ఈ సువిశాల భారతదేశంలో వివిధ సంస్కృతులూ, సంప్రదాయాలు వున్నా వాటిలో నుండే ఒక సమైక్యతా భావాన్ని పెంపొందించే ప్రయత్నం గావించారు మన పూర్వీకులు. లోకంలోని ప్రతి ఒక్కరూ ప్రయోజనాత్మకమైన ప్రశాంత జీవితాన్ని గడపాలని వారికి ఆవిధమైన సామర్ధ్యాన్ని చేకూర్చాలన్నదే వారి ఆకాంక్ష.

ప్రజల్లో ఆధ్యాత్మిక దృష్టి, సేవా దృక్పథం పెంపొం దింప జేయాలన్న ఉద్దేశ్యంతోనే ఎందరో ఎన్నో విధాలుగా తమ ప్రయత్నాలు కొనసాగించారు. క్షణ క్షణం మారుతున్న సమాజ వైఖరి, జనుల మనస్తత్వాలు, విద్రోహచర్యలు, దౌర్జన్య కాండలో రోజురోజుకే పెరిగిపోతు న్న ఈ రోజుల్లో నాగరికత వెల్లువలో పడి దిక్కుతోచక, ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనావళికి వెలుగుబాట చూపాలనే పర మార్థంతో, జ్ఞాన కాంతులు వెదజల్లుతూ వారిలో ధర్మాసక్తిని పెంచి కర్మవీరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం గావిస్తున్నవారు ఎందరో ఈ నవనాగరిక సమాజంలోనూ ఉన్నారు.
ప్లేటో మహాశయుడు అప్పుడెప్పడో చెప్పాడు. “A nation cannot be strong unless it believes in god” భగవంతుడి మీద విశ్వాసం వుంటేనేగాని ఏ దేశమూ పటిష్టం కాలేదు. అందుకు ఆత్మ జ్ఞానంతోడు కావాలి. వారికి జీవిత విలువల్ని గుర్తు చేయాలి. మానవుల్లో గూడుకట్టుకున్న సంకుచిత తత్వాన్ని తుడిచి పారెయ్యాలి. వినయం, వివేకం, క్రమశిక్షణ, సత్యవర్తనం చిన్నారులకు నేర్పించాలి. మత వైషమ్యాలు వైదొలగాలి. మతమంటే అనుభూతే. మంచి ని పెంచే మతం. (మంచితనం, మనిషికులం, మానవ సేవా వ్రతం, దైవానికి ప్రీతికరం) మానవుడు నడుచుకోవాల్సిన విధానమే విధి. వాన్నే రుషులు ధర్మం అన్నారు. యతో ధర్మ స్తతో జయ: అనేవిధంగా ధర్మాన్ని రక్షించే వారిని ధర్మం రక్షి స్తుంది. భగవద్గీత కూడా ధర్మం శబ్దంతోనే ప్రారంభమవు తుంది. ధర్మానికి హాని సంభవించినప్పుడల్లా తాను అవతరిం చి ధర్మోద్ధరణ చేస్తానని- ”ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే” అంటూ అభయమిచ్చాడు కదా! అలాంటి ధర్మాచరణకు ముఖ్యంగా కావాల్సింది చిత్తశుద్ధి. అదెలా సాధ్యపడుతుందంటే సత్సాంగత్యం వలన. సత్పురుషుల సాంగత్యం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అట్టి సత్సాంగత్యం లేనివారు పుట్టంధులు. పుట్టుకతోనే చెవిటి వారు, జన్మత: మూగవారి కిందే జమ అని అంటారు మహా త్ములు. చిత్తశుద్ధిలేని శివ పూజ ఏలరా అన్నారు వేమన యోగి. మనిషిలో భక్తి, జ్ఞాన వైరాగ్యాలు రావాలంటే చిత్తశుద్ధి ఉండా లి. మాయలో పడకుండా, అజ్ఞానంలో చిక్కకూడదు.
మానవునిలో సహజమైన భగవనిక్షిప్తాలైన శక్తి సామ ర్ధ్యాలున్నాయి. వివేకముంది. వివేకం అన్నది అలౌకిక శక్తి. ఆ శక్తిని వికసింపజేసుకోవడంలోనే ఉంది మానవుడి ప్రతిభ. అట్టి ప్రతిభను సంపాదించుకుంటేనే జ్ఞాన వైరా గ్యాలు కుదురుకుంటాయి. నిర్మలమైన మనస్సే మోక్ష కార కంగా ఉంటుంది. ”మోక్షోహి చేతో విమలం అని. కొందరు మోక్షం అనగానే మరణం అనుకుని గతుక్కుంటారు. పురాణ శ్రవణం, గీతాపారాయణం వయోవృద్ధులకే పరిమిత మని కొందరు అనుకోవడం కద్దు. అది పొరపాటు. గీతా పారాయ ణాదులు చిత్తశుద్ధినీ, శీల నైర్మణ్యాన్ని కలుగజేస్తాయి. కర్తవ్యా న్ని బోధిస్తాయి. మోక్షం అంటే విడుదల అని అర్థం. అనగా మోహం, అహంకార మమకారాలు, రాగద్వేషాలు, భయ భ్రాంతులు, అసూయ, పగ నుండి మనస్సుకు విడుదల.
”శునయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్ష యో:’ బంధ మోక్షాలకి మనస్సే కారణం. ఆ మనస్సును అదుపులో ఉంచడాన్నే ఆత్మ నిగ్రహం” అంటారు.
” బ్రహ్మ సత్యం- జగన్మిధ్య’ అనే సిద్దాంత బలంతో సత్య పదార్థాన్ని చూడటమే ఆత్మ జ్ఞానం. ‘జ్ఞానం సమగ్య వేక్షణ మ్‌’ ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు చూడగలగడమే జ్ఞానం. క్షణికమైన వాటికోసం ఆరాటం, ఆవేదన పడటం అజ్ఞానం. ‘ఆత్మేపరమాత్మ’-జీవుడే దేవుడు’ అన్న సత్యాన్ని తెలుసుకోవ డం ముఖ్యం. ఆ ఎరుకే దైవ కృప. సత్సాంగత్యంతోనే సాధిం చుకోవల్సి ఉంది. అందుకు కావాల్సింది శ్రద్ధ. ”శ్రద్ధవాన్‌ లభతే జ్ఞానం” అన్నారు. ఏకాగ్రత, సాధన, ఇంద్రియ నిగ్ర హం, మనోబలం ఉన్నప్పుడే అది సాధ్యం. ఆత్మ విశ్వాసమే ఆత్మోన్నతికి కారణం. అందువలన అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనండి. ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు జాగరూకు లు కండి. మహనీయుల ప్రబోధాల్ని ఆలకించండి అంటూ ఉపనిషత్తులు జనాలను జాగృతం చేస్తున్నాయి.
‘తత్వ మసి’ ఆ పరమాత్మయే నీవు అని ఒక్క వాక్యంలో సందేశమిస్తున్నాయి. ఇది ప్రబోధం. ఈ తత్వమసి అన్న వాక్యాన్ని జీర్ణం చేసుకుని, ‘అహం బ్రహ్మస్మి’ అనే ఉపనిషత్‌ ఘోషను ఆలకించి క్రమ శిక్షణతో అనుష్టించినప్పుడే ఆత్మ జ్ఞాన సంపన్ను లయ్యే అవకాశం ఉంది. మానవునికి శాంతిని, క్షేమాన్ని కలి గించి భవ సాగరం నుండి ఒడ్డుకు చేరగలిగేదే ఆత్మ జ్ఞానం. పారమార్ణిక విద్యే. ఈ విద్య ద్వారా శాంతి, దాని పరిణామా వినియోగం పరోపకారం. ఆ ఉపకారమిచ్చు ప్రతి ఫలం జన్మ సాఫల్యం.
– డాక్టర్‌ పులివర్తి కృష్ణమూర్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement