Thursday, March 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 1

ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవ: |
మామకా: పాండవాశ్చైవ
కిమకుర్వత సంజయ ||

గీతా మహాత్మ్యములో తెలుపబడినట్లు భగవద్గీత అత్యంత ప్రాచుర్యము పొందిన భగవద్‌ విజ్ఞాన శాస్త్రము. అందున స్వలాభాపేక్ష లేని ప్రామాణికుడైన కృష్ణభక్తుడి నుండి ఈ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనము చేయవలెనని తెలుపబడినది. భగవంతుడి నుండి స్వయముగా విన్న అర్జునుడు పొందిన అవగాహననే మనము కూడా పొందవలసి ఉంటుంది. ఆ విధముగా గురుపరంపరోని నిస్వార్థమైన ఆచార్యుడి నుండి నేర్చినట్లయితే మనము సకల శాస్త్రాలను, వేదాధ్యనములను అధిగమించిన వారలమవుతాము. ఇతర శాస్త్రాలలోని విషయాలనేకాక వాటిలో లేనివాటిని కూడా మనము నేర్వవచ్చును. స్వయముగా దేవాదిదేవుడైన శ్రీ కృష్ణునిచే బోధింపబడిన భగవద్‌ విజ్ఞానమగుటచే భగవద్గీత ఇంతటి ప్రత్యేకతను కలిగి ఉన్నది.

తాత్పర్యము : ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను : ఓ సంజయా ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి ?

భాష్యము : మహాభారతము నందలి ధృతరాష్ట్ర, సంజయుల సంభాషణ ప్రకారము, ఈ భగవద్గీత అనునది పుణ్యక్షేత్రమైన కురుక్షేత్ర సంగ్రామము నందు భగవంతుడు మానవాళికి మార్గదర్శకత్వమునిచ్చుట కొరకు బోధింపబడిన సందేశము. వ్యాసదేవుని కృప వలన సంజయుడు, ధృతరాష్ట్ర నిగ్రహము నందుండి కురుక్షేత్ర సంగ్రామమును దర్శించగలిగెను. అందువలన ధృతరాష్ట్రుడు సంజయుడిని ”వారు ఏమి చేయుచున్నారు” అని ప్రశ్నించెను. కురుక్షేత్రము ధర్మక్షేత్రము కనుక ధర్మరాజు మరియు పాండవులకు అనుకూలతనిచ్చునేమోనని కలవరపడి ఈ ప్రశ్నను అడిగెను. అంతేకాక ఒకే కుటుంబమునకు చెందిన పాండవులను, తన పుత్రులను వేరు చేసి సంభోదించుట వలన ఇచ్చట ధృతరాష్ట్రుని నిమనోగతము వెల్లడి అగుచున్నది. పొలములో కలుపు మొక్కలను తీసివేసినట్లు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు ధర్మరక్షకుడైన కృష్ణుడు కలుపుమొక్కలైన దుర్యోధనాదులను తొలగించి ధర్మరాజును రాజుగా చేయునని తొలి పలుకుల నుండే స్పష్టమగుచున్నది.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement