Wednesday, April 17, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 25

25
దైవమేవాపరే యజ్ఞం
యోగిన: పర్యుపాసతే |
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం
యజ్ఞేనైవోపజుహ్వతి

తాత్పర్యము : కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను చక్కగా పూజింతురు. మరికొందరు పరబ్రహ్మమనెడి అగ్ని యందు హోమమును చేయుదురు.

భాష్యము : వివిధములైన యజ్ఞములను రెండు ప్రధాన వర్గాలుగా విభజించవచ్చును. ఒకటి లౌకిక సంపదలను త్యాగము చేయుట కాగా, రెండవది దివ్య జ్ఞాన ప్రాప్తి కొరకు చేయబడునదై ఉన్నది. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి తనకున్న సర్వస్వాన్నీ భగవంతుని ప్రీత్యర్ధము అర్పించును. ఇతరులు తాత్కాలికమైన సుఖము కొరకు దేవతలైన ఇంద్రుడు, చంద్రుడు వంటి వారిని పూజింతురు. ఇంకా ఇతరులు బ్రహ్మములో లీనమగుటకు తమ వ్యక్తిత్వాన్నే అర్పించుదురు. అయితే అర్జునుడు లాంటి భక్తులు మాత్రము సర్వాన్ని కృష్ణుని ప్రీత్యర్థమే చేయుదురు కనుక తనకున్న సంపదలే కాక, తనను తానుగా అన్నింటినీ కృష్ణునికే అర్పించిన వారగుదురు. కాబట్టి అటువంటి వారు ప్రధమ శ్రేణి యోగి అనబడుదురు. అయితే వారు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement