Friday, April 19, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 3

జ్ఞేయ: స నిత్యసన్న్యాసీ
యో న ద్వేష్టి న కాంక్షతి |
నిర్ద్వంద్వో హి మహాబాహో
సుఖం బంధాత్‌ ప్రముచ్యతే ||

తాత్పర్యము : కర్మఫలముల ద్వేషించుట గాని , కోరుట గాని చేయనివాడు నిత్యసన్యాసిగా తెలియబడును. ఓ మహాబాహుడవైన అర్జునా! ద్వంద్వముల నుండి విడివడి యుండు వాడు లౌకిక బంధములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు.

భాష్యము : కృష్ణునితో తనకు గల సంబంధాన్ని తెలిసికొని ఆ విధముగా సేవించువాడు, నిజమైన జ్ఞానమును కలిగి ఉన్నవాడగును. ఆ విధముగా వ్యక్తి తన సహజస్థితిలో నున్నప్పుడు సంతృప్తుడై దేనినీ ఆశించడు, ఏదో వెలితిగా ఉందని దు:ఖించడు. మనము భగవంతుడిలో అంశ లేదా భాగము కాబట్టి మనము ఎప్పటికీ భగవంతులము కాలేము. ఇటువంటి సరైన జ్ఞానము కలిగియున్న వ్యక్తి తాను ఎటువంటి స్థితిలో ఉన్నా, భగవత్సేవ ను కొనసాగించగలుగుతాడు కాబట్టి అటువంటి వ్యక్తి ద్వంద్వాతీతుడై, జీవన్ముక్తుడగును. అతడే ఇక్కడ తెలుపబడినట్టి నిత్య సన్యాసి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement