Wednesday, March 27, 2024

అంతా…భగవన్మయం…

”ఇందుగలడందు లేడని
సందేహమ్ము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే గలడు దానవాగ్రణి! వింటే.”

నీహరి ఎక్కడున్నాడురా? అనే తండ్రి హర ణ్యకశిపుని ప్రశ్నకు పైవిధంగా సమాధాన మిచ్చాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో నీ హరిని చూపించమని కొడుకుని అడిగిన హిరణ్య కశిపునికి సమాధానంగా, ఉగ్రనరసింహమూర్తిగా స్తంభం లోంచి శ్రీహరి దూసుకుని రావడానికి ప్రహ్లా దుడు కారకుడయ్యాడు.
అవును. దేవుడు యిక్కడ, అక్కడ, ఎక్కడైనా ఉంటాడు. భగవంతుడు సర్వాంతర్యామి. అన్నిం టా ఉంటాడు. అంతటా ఉంటాడు. అంతా తానై ఉం టాడు. పువ్వులో, నవ్వులో, నేలలో, నింగిలో, రాయి లో, రప్పలో, చెట్టులో, చేమలో, గుట్టలో, పుట్టలో, ఆకులో అలములో దేవుడుంటాడు. జీవం నిర్జీవం అనే తేడా లేకుండా, ప్రతిచోటా ప్రతి పదా ర్ధంలోను పరమాత్ముడుంటాడు. పదార్ధమై ఉం టాడు. పర అర్థమై నిలిచి ఉంటాడు. అయితే ఓ రాయిని చూపిం చి ఆ రాతిలో దేవుడ్ని చూపించమంటే మనం చూపించగలమా? చూ పే ధైర్యం మనం చేయ గలమా? అసలు విషయం వదిలిపెట్టి వేదాంత ధోరణి లోనికి వెళ్లిపోయి, అవతలి వ్యక్తిని, అయో మయానికి గురిచేయడానికి ప్రయత్నిస్తాం. తర్కా నికి నిలబడని ఏవేవే మాటలు చెబుతాం.
మరి ప్రహ్లాదుడు తండ్రి అడగగానే స్థంభంలో శ్రీహరిని చూపించగలిగాడు. ఎక్కడుంది తేడా?
కొంచెం ఆలోచన చేయాలి. ఇక్కడ, అక్కడ, ప్రతిచోటా భగవంతుడు ఉంటాడని చెప్పి ప్రహ్లా దుడు ఊరుకోలేదు. ప్రతిచోటా భగవంతుడు ఉం టాడని చెబుతూనే, ఏమి చేస్తే ప్రతి చోటా భగ వంతుడు మనకి కనిపిస్తాడో అనేది కూడా పైన చెప్పుకున్న పద్యంలోనే ప్రహ్లాదుని చేత బమ్మెర పోతన చెప్పిస్తారు. అంతటి ఔచిత్యం, విజ్ఞత పోత నామాత్యుడిది. దేవుడు ఎక్కడైనా ఉంటాడు. కానీ మనకు కనిపించాలి అంటే మనం వెతకాలి. వెతక గలగాలి. వెతుక్కోగలగాలి. అందుకే ”ఎందెందు వెతికి చూచిన.” అని చెప్పి, అందులో దాగున్న ఆధ్యాత్మిక రహస్య ముడిని విప్పాడు ప్రహ్లాదుడు.
ఇక్కడ మళ్ళీ మనకు మరో సందేహం వస్తుం ది. వెతకాలి అనుకున్నాం. ఎలా వెతకాలి? ఏ రకం గా వెతకాలి? దేనితో వెతకాలి? అనేదే ఆ సందేహం. అవును. ఆధ్యాత్మికంలో సందేహాలు రావడం సహ జం. అందుకే ”దేహంలో నువ్వున్నంత కాలం సం దేహాలు తప్పవు.” అని అన్నారో మహనీయుడు.
అయితే భగవంతుడ్ని ఎలా వెతకాలి అనే ప్రశ్న కు సమాధానం చూద్దాం.
భగవంతుడ్ని భక్తితో వెతకాలి. ఆర్తితో వెత కాలి. ఆరాటంతో వెదకాలి. సాధనతో వెదకాలి. అ చంచలమైన విశ్వాసంతో వెతకగలగాలి. సర్వస్వ శరణాగతితో వెతక గలగాలి. ఇవన్నిటినీ కలుపుకు ంటూ, సమన్వయం చేసుకుంటూ వెతకాలి. వెతు క్కో గలగాలి. అప్పుడు భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ మనకి కనబడతాడు. సర్వం సర్వేశ్వర మయమై సమస్త విశ్వం దైవమయం అవుతుంది.
మరికొంచెం లోతుకు వెళ్లి విచారణ చేద్దాం. భక్తితో వెతకాలి అనుకున్నాం కదా! భక్తి అంటే ఏమి టో తెలుసుకుందాం. భక్తి అంటే దేవుడ్ని ప్రేమించ టం. దేవుడి కోసం ఏడవటం. ఏడవ గలగటం. భక్తి అంటే దేవునికి మన సర్వస్వాన్ని అర్పించుకోవటం. మనకి ”మనం” దేవునికి అర్పణ కావటం. భక్తి అం టే దేవుని కోసం మనం గిజగిజ గింజుకోవటం. భక్తి అంటే దేవుని కోసం వేగి పోవటం. ఆ పరంధాముని కోసం వేదన పడటం. ఇక సాధన. భక్తి మనకు అనుభవం లోనికి రావ టానికి మనం చేసే ప్రయత్న మే సాధన. పూజలు, వ్రతాలు, నోములు, అర్చనలు, అభిషేకాలు, భజన లు, సత్సంగం, సేవ వగైరా కర్మ మార్గాలన్నీ సాధనకు ఉపకరించే సాధనాలు.
ఇక యిప్పుడు చెప్పుకోవలసింది ‘ఆర్తి’. మొస లిబారిన పడిన గజేంద్రుడు తన శక్తిమేర పోరాడి, యిక తనవల్ల కాదని తెలుసుకుని గజేంద్రుడు
”నీవే తప్ప నిత:పరంబెరుగ,
మన్నింపందగున్‌ దీనునిన్‌
రావే యీశ్వర! కావవే వరద!
సంరక్షింపు భద్రాత్మకా!”

అని గుండె లోతులలోంచి భగవంతుడ్ని ఎలుగెత్తి పిలిచేడు. కదా అదీ ఆర్తితో పిలవడమంటే. ఇక ఆరా టం. ఆ భగవంతుని కోసం భౌతిక కాంక్షలు, సుఖా లు అన్నీ త్యజించి, అనుక్షణం భగవంతుని కోసం తహతహలాడటం, తపన పడటం, ఆదుర్దాపడ టమే ఆరాటమంటే. తర్వాతది అచంచల విశ్వాసం. అచంచల విశ్వాసానికి ప్రహ్లాదుని వృత్తాంతమే ఉదా హరణ. ప్రహ్లాదుడు ఎన్ని ఆపదలు వచ్చినా చెదరలే దు. బెదరలేదు. సముద్రం ఒడ్డున మనం కూర్చుం టాం. అక్కడ ఉన్న నిలువెత్తు రాయికి సముద్రపు అలలు అతి కర్కశంగా చెల్లున తగులుతుంటాయి. అలలెంతగా తనని కొడుతున్నా ఆ రాయి సడలదు. కదలదు. వంగదు. కుంగదు.
ఏమాత్రం కలతచెందదు. నిశ్చలంగా నిర్మలం గా ఉంటుంది. ఇదీ అచంచల విశ్వాసమంటే! ఎన్ని కష్టనష్టాలు వచ్చినా, ఎంతటి కల్లోలమొచ్చినా అం తా భగవదేచ్ఛ అని, అన్నింటికీ భగవంతుడు ఉన్నా డనుకుంటూ, ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటా డనే నిశ్చలమైన నమ్మకమే అచంచల విశ్వా సం.
చివరగా సర్వస్య శరణాగతి. నిండు సభలో వస్త్రాపహరణం సమయంలో, వలువలు ఒక్కొక్క టీ ఊడుతుంటే, ద్రౌపది మొదట తన శక్తిమేర ప్రతిఘటించింది. ఎంత పెనుగులాడాలో అంత పెనుగులాడింది. ఆఖరుకి అలసిపోయి చేతులెత్తే సింది. ఆక్రందనతో క్రిష్ణ పరమాత్మను పిలిచింది. నీట ముంచినా, పాల ముంచినా, ఏదిఏమైనా నువ్వే దిక్కని భారమంతా ద్రౌపది శ్రీకృష్ణునిపైనే వేసింది. ఇదే సర్వస్య శరణాగతి అంటే.
పైన చెప్పుకున్న లక్షణాలతోపాటు సత్యనిష్ట, కార్యదీక్ష ఋజువర్తనం, అంకిత భావం, దృఢ సంకల్పం, పాపభీతి, సేవాతత్పరతలతో మనం జీవనం కొనసాగించాలి.వీటన్నింటినీ మిళితం చేసుకుంటూ, తగుపాళ్ళలో ఈ లక్షణాలను సమన్వ యం చేసుకుంటూ, సమతుల్యతతో మనం దేవుణ్ణి వెతికిననాడు, వెతకగలిగిననాడు, అణువణువులో ను మనకు భగవంతుడు దర్శనమిస్తాడు. అంతటా అన్నింటా భగవంతుడు అవధరిస్తాడు.
ఇదీ… ప్రహ్లాదుడు చెప్పిన ”ఇందుగలడందు లేడని సందేహమ్ము వలదు…” అనే పరమ సత్యం వెనుక దాగున్న అంతరార్ధం. ఆధ్యాత్మిక అంతరా ర్ధం. ఆధ్యాత్మిక పధ ప్రస్థానాన మనం తెలుసుకొ వలసిన, ఆచరించాల్సిన మార్గ నిర్దేశనం.
ఇందుకోసం మన సనాతన మార్గం మనకం దించిన సూత్రాలను, ధర్మాలను, విధి విధానాలను, చిలకల్లా వల్లెవేయడం, బట్టీపట్టడం కాదు మనం యిప్పుడు చేయవలసింది. అలాగే మనకుండే మిడి మిడి జ్ఞానంతో, హస్వ దృష్టితో అవగాహన లేకుం డా, యివన్నీ కాకమ్మ కథలు, ఒట్టి కల్పిత కథలని కొ ట్టిపారేయటం కాదు యిప్పుడు మనక్కావల్సింది.
నిజానికి మనం యిప్పుడు ఏంచేయాలి? మన కు ఏం కావాలి? వేదాలు, వేదాంతాలు, బ్రహ్మసూ త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు చెప్పిన, మన ఋషులు, మునిపుంగవులు, మహనీయులు, ప్రబో ధించిన ఆధ్యాత్మిక అమతృతత్త్వాన్ని సాధనతో మనం శోధించాలి.
ఆ సాధనకూ, శోధనకూ అవసరమయ్యే జ్ఞానాన్ని, మనం సంపాదించుకోవాలి. సంపాదించుకున్న ఆ జ్ఞానాగ్నిలో మనల్ని మనం పండించుకోవాలి.
మన సనాతనత్వాన్ని, సాంప్రదాయ సంస్కృ తీ సంపదను అనుభవానికి తెచ్చుకోవాలి. పరమా త్మ తత్త్వాలుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి.

  • రమాప్రసాద్‌ ఆదిభట్ల
    93480 06669
Advertisement

తాజా వార్తలు

Advertisement