Monday, September 25, 2023

అంత:పురానికే అంకితమైన మహాసాధ్విఊర్మిళాదేవి!

రామాయణ కథలో ప్రతి పాత్రా మహోన్నతమైనదే! కొన్ని పాత్రలు రామాయణ గమనాన్నే మార్చేశాయి. అవతార పురుషుడైన శ్రీరామ చంద్రుడి గుణ విశేషణాలకు ప్రభావితులై ఆయన సోదరుల నుంచి సకల పరివార జనం ఆదర్శమూర్తులుగా తరించారు. అలా త్యాగ నిరతిలో సీతమ్మ వారికి సాటిగా, లక్ష్మణుడి అర్ధాంగి ఊర్మిళాదేవి ఉదాత్త వ్యక్తిత్వాన్ని చాటు కుంది. ఆమె ఔన్నత్యం ఎన్నటికీ మరువరానిది! అందుకే గోస్వామి తులసీదాస్‌ తన ‘రామచరితమానస్‌’ లో ‘ఓ ఊర్మిళాదేవీ! నాకు నీ ఔదార్యాన్ని వర్ణించే శక్తి లేదు. నీకు వందనం మాత్రమే చేయగలను’ అంటాడు.
ఊర్మిళ రామాయణంలో జనక మహారాజు కూతురు, లక్ష్మణుని భార్య. వీరికి అంగద, చంద్రకేతు అని ఇద్దరు కుమారులు. ఊర్మిళ అంటే మంత్రముగ్ధురాలు.
సీతమ్మ రాముడి కోసం ఎలా త్యాగాలు చేసిందో, ఊర్మిళ కూడా లక్ష్మణుడి కోసం అలాగే త్యాగాలు చేసింది. సీతమ్మవారు రాముడి వెంట వనవాసం వెళ్లారు. వారి వెంట లక్ష్మణుడు కూడా వెళ్లాడు. అప్పుడు ఊర్మిళాదేవి కూడా తనతోపాటు వస్తానని చెప్పగా అందుకు లక్ష్మణుడు ఇక్కడే ఉండి యువరాణిగా, కోడలిగా తన తల్లిదండ్రులను చూసుకోవాలని, రాజ్య ప్రజల బాధ్యత తీసుకోవాలని వివరించాడు. తన తల్లిdతండ్రిగా భావించే సీతారాముల వెంటే అడవుల్లో ఉంటూ… వాళ్లతో 14 ఏళ్లు గడుపుతానని వివ రించాడు. రేయింబవళ్లు వాళ్ల వెంటే ఉండాలని చెబుతూ తన నిర్ణయాన్ని అంగీకరించా లని ఊర్మిళను కోరాడు.
లక్ష్మణుడు చెప్పినదానికి ఊర్మిళ, సీతారాములకు తన భర్త చేయాల్సిన సేవలను అర్థం చేసుకుని, మీ అన్నావదినల సేవలో తరించండి. కానీ నా ప్రార్ధన ఒక్కటే! మీరు వనవాస కాలంలో నా గురించి ఒక్కక్షణం ఆలోచించి నా మనస్సు చలించిపోతుంది. మీ సేవకు ఆటంకం కలుగుతుంది. నా చింత వీడండి అంటుంది. అందుకే సీతారామ లక్ష్మణులకు వీడ్కోలు పలికేందుకు కూడా ఆమె అంత:పురం విడచి బయటకు రాలేదు. భర్తతో అరణ్యవాసమైనా అయోధ్యలా భావించి చరించిన చరిత జానకీమాతదైతే, భర్త చేసిన త్యాగానికి ప్రతిఫలంగా అయోధ్యలో కూడా అరణ్యవాసంగా తన జీవనాన్ని సాగించిన ధన్యురాలు ఊర్మిళాదేవి.
అడవికి వెళ్లిన తరువాత అరణ్యంలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండడంతో తన బాధ్యతకు ఎలాంటి ఆటంకం కలగకుండా, తనకు 14 సంవత్స రాలపాటు నిద్ర రాకుండా విడిచి పెట్టమని ఆ నిద్ర దేవతను వేడుకుంటాడు. అయితే, నిద్ర ప్రకృతి ధర్మమని తనకు రావాల్సిన నిద్ర మరెవరికైనా పంచాలని కోరడంతో, తన 14 సంవత్సరాలపాటు నిద్రను తన భార్య ఊర్మిళాదేవికి ప్రసాదించమని లక్ష్మణుడు నిద్రాదేవతను కోరుతాడు.
తండ్రి చనిపోయిన విషయం చెప్పి రాముణ్ణి ఒప్పించి తిరిగి అయోధ్యకు తీసుకెళ దామని భరతుడు తన ముగ్గురు తల్లులు మరియు పరివారంతో సహా వస్తాడు. మాట లలో మాటగా ఎవరో త్యాగం అనే మాటను అన్నారు. లక్ష్మణుడికి త్యాగం పేరు చెప్ప గానే ఊర్మిళ గుర్తొచ్చింది. తన మాటని జవదాటకుండా అంత:పురానికే అంకితమ య్యింది. ఒకరకంగా ఊర్మిళని వదిలి రావడం భర్తగా తను చేసింది తప్పేకాని అన్నగారి మీద ప్రేమ, భక్తి ఈనాటివి కాదు. తను అన్నగారిననుసరించి త్యాగం చేశాను అనుకుం టున్నారు వీళ్ళందరూ! తన త్యాగం వెనుక మరొక మూర్తి త్యాగం కూడా వుంది.
ఊర్మిళే కనక తనని అడవులకు వెళ్ళవద్దని నిర్బంధిస్తే? ఒకరకంగా తనకు పరీక్షే! తను వద్దనగానే మరోమాట మాట్లాడకుండా మౌనంగా అంగీకరించింది. ఒకసారి ఊర్మిళ మీద ప్రేమ అభిమానం పొంగుకొచ్చాయి లక్ష్మణుడికి. రాజపరివారమంతా బయల్దేరి వచ్చినా ఊర్మిళ మాత్రం రాలేదు, ఎందుకు రాలేదు? భర్తని చూడాలని అనిపించలేదా? ఏదో కారణం ఉండే ఉంటుంది. తల్లి సుమిత్రను అడిగితే తెలుస్తుంది. లక్ష్మణుడు గుడారం లోపలకి ప్రవేశించి, తల్లి సుమిత్రకి, పెదతల్లి కౌసల్యకి ప్రణామాలు చేసి, ”తల్లిd! అయోధ్యలో అందరూ కుశలమేనా? ఊర్మిళ ఎలావుంది? మీతోపాటు ఊర్మిళ ఎందుకు రాలేదు?” అడిగాడు లక్ష్మణుడు.
”నాయనా! లక్ష్మణా! మేమందరమూ భరతునితో బయల్దేరుతున్నామన్న విష యం స్వయంగా నేనే వెళ్ళి చెప్పాను. తనని కూడా రమ్మనమని చెప్పాను, కానీ. తనే రానని నిష్కర్షగా చెప్పింది. ఎంత బ్రతిమాలినా రానంది.”
”నువ్వు బ్రతిమాలినా రానని అందా! ఎందుకు రానందో కారణమైనా చెప్పిందా?”
”కారణం!” తటపటాయిస్తూ ఆగిపోయింది సుమిత్ర. ”సందే#హంవద్దు… చెప్ప మ్మా! నేనేమి కోపగించుకోను”
”నీకు ప్రతిబంధకం కాకూడదని” సుమిత్ర మధ్యలో ఆగిపోయింది. ఒక్కసారి లక్ష్మణుడికి మనుసుని ఛెళ్ళుమని కొట్టినట్లనిపించింది. బయల్దేరేముందు తనకి, ఊర్మిళకి జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. ఊర్మిళ అభిమానవతి. అంతేకాదు భర్త కర్తవ్య పాలనకోసం అంత:పురానికే అంకితమైన మహాసాధ్వి. లక్ష్మణుడు వడివడిగా అడుగులు వేసుకుంటూ తమ కుటీరం వైపు వెళ్ళాడు. వెన్నెల రాత్రిలో కుటీరం ముందు వదినగారు పుష్పరేకలతో వేసిన ముగ్గు చూసాడు. పసిడి వెన్నెల్లో గీతల్లా వేసిన ముగ్గులో ఆ పుష్పాలు మరింతగా మెరుస్తున్నాయి. ఆ పుష్పాల్లో ఊర్మిళే కనిపించింది లక్ష్మణు డికి. కనిపించే పెద్ద గీత సీత, దానివెనుక మరుగైన చిన్న గీత ఊర్మిళ.
పట్టాభిషేకం అయిన తర్వాత రాములవారు ఊర్మిళాదేవితో మాట్లాడుతూ…” తల్లిd! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతోపాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!” అన్నారట. రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. కానీ ”ప్రభూ! నాకు నీ పాద పద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. ప్రతి రోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నీ అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహంచు,” అందట.
”కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోద రుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొం దించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,” అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. ఆవిడే పూర్వజన్మలో ఊర్మిళ అని చెప్తారు. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరు.
పధ్నాలుగేళ్ళ వనవాసం అనంతరం, సీతారామ సమేతుడై తన భర్త అయోధ్యలో అడుగుపెట్టిన క్షణంలో కూడా ఎలాంటి ఉద్వేగానికి లోను కాని స్థితప్రజ్ఞురాలు ఊర్మిళా దేవి. అంటే! ఏళ్ళ తరబడి శిలలా పడి ఉన్న అహల్యకన్నా, జీవమున్నా శిలలా కాలం గడిపిన ఊర్మిళ ధన్యురాలు. అందుకే ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు ఇలా అంటారు: పైట చెరంగుతో పుడమి పైబడకుండగనద్దుకొమ్ము నీ
కాటుకకన్ను తామర్లు కాలువలై ప్రవహంచు వేడి క
న్నీటి కణాలు క్రిందపడనీయకు! ముత్తమసాధ్వివైననీ
బోటి వధూటి భాష్పములు భూమి భరింపగలేదు సోదరీ!
ఊర్మిళాదేవి నిశ్చలమైన మనస్సుకూ, అకుంఠిత పాతివ్రత్య ధర్మానికీ యావత్‌ లోకం కలకాలం నివాళులర్పిస్తూనే ఉం టుంది. స్త్రీ జాతికి ఊర్మిళాదేవి ప్రాత: స్మరణీయురాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement