Wednesday, April 24, 2024

అన్నమయ్య కీర్తనలు : ఆడరో పాడరో

రాగం : మధ్యమావతి

ప|| ఆడరో పాడరో ఆనందించరో
వేడుక మొక్కరో విజ్ఞానులు

చ|| హరిరక్షకుడై యందరి కుండగ
పరగగ బతికేరు బ్రహ్మదులు
గరిమ నతడే చక్రము చేపట్టగ
సురిగి పారిరదె చూడు డసురులు

చ|| పదిలపు విష్ణుడై ప్రాణమై యుండగ
యిదివో మెలగేరు యీ జీవులు
మొదలు యితడే మూలమై యుండగ
పొదలె నీతని పంపున లోకములు

చ|| శ్రీ వేంకటాద్రిని శ్రీపతి యుండగ
తావుల నిలిచెను ధర్మములు
యీ వల నితడే యిచ్చేటి వరములు
పావను లైరిదే ప్రపన్నులు

Advertisement

తాజా వార్తలు

Advertisement