Wednesday, April 24, 2024

అన్నమయ్య కీర్తనలు : జయ జయ రామ

ప|| జయ జయ రామ సమర విజయ రామ
భయహర నిజ భక్త పారీణ రామా ||జయ జయ||

చ|| జలధి బంధించిన సౌమిత్రి రామా
సెలవిల్లు విరచిన సీతారామా
అల సుగ్రీవు నేలిన అయోధ్యరామా
కలిగి యజ్ఞము కాచె కౌసల్యరామా ||జయ జయ||

చ|| అరి రావణాంతక ఆదిత్యకులరామా
గురు మౌనులను గాచే కోదండరామా
ధర నహల్యపాలిటి దశరథరామా
హరురాణి నుతుల లోకాభిరామా ||జయ జయ||

చ|| అతి ప్రతాపముల మాయామృగాంతక రామా
సుత కుశలవ ప్రియ సుగుణరామా
వితత మహిమల శ్రీ వేంకటాద్రిరామా
మతిలోన బాయని మనువంశరామా||జయ జయ||

Advertisement

తాజా వార్తలు

Advertisement