Saturday, April 20, 2024

సమస్త మూలాధారం పరబ్రహ్మ

మహాభారతంలో విదురుడు ఎన్నో నీతి బోధలు చేస్త్తాడు. అతను ధృతరాష్ట్రునికి ఎక్కువగా ఈ విషయాలు చెబుతుంటాడు. ఒక సందర్భంలో ధృతరాష్ట్రుడు జీవుడు లేక ఆత్మ, పరబ్రహ్మ, మృత్యువు గురించి వివరంగా చెప్పమని కోరాడు. దానికి నీతికోవిదుడైన విదురుడు చెప్పిన సమాధానం తెలుసుకోవలసినది. విదురుడు ఈ విధంగా చెప్పాడు. ”మహాప్రభూ! నాకున్న స్థాయిని బట్టి నేను మీకు ఆ విషయాలను చెప్పజాలను. ఈ విషయాలను పురాతనుడైన సనత్సుజాతుడనే ఋషి బాగా వివరించి చెప్పగలడు అతనిని రప్పిస్తాను” అన్నాడు. అలా చెప్పిన ఆయన తన మనసులో సనత్సుజాతుని ధ్యానించాడు. విదురుడు తనను ధ్యానిస్తున్నాడన్న విషయాన్ని దివ్య దృష్టితో చూసిన ఋషి, అతని సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు. విదురుడు అయనకు వినయపూర్వకంగా నమస్కరించి ధృతరాష్ట్రుడు ఆత్మ, పరబ్రహ్మము, మృత్యువు గురించి వెల్లడించిన సందేహాలను గురించి అడిగాడు. దానికి సనత్సుజాతుని సమాధానం ఇలా ఉంది.
”అజ్ఞానం వలన మరణం కలుగుతుందని పండితులంటారు. అజ్ఞానమే మరణం. జ్ఞానమే అమృతత్వము. జీవులను మృత్యువు నేరుగా కబళించదు. కొందరు మృత్యువే యముడని తలుస్తారు. ఇది సరికాదు. మనమూహించే యముడు పితృలోకానికి అధిపతి. అతని ఆదేశంపై మృత్యువు క్రోధం, అజ్ఞానం, లోభత్వం అనే రూపాలలో మానవుల యందు ఉత్పన్నమవుతోంది. అహంకారం, గర్వం మానవులు అధర్మ మార్గంలో చరించేలా చేస్తుంది. వారెవరూ తమ నిజస్వరూపం తెలుసుకొనలేరు. వారి అవగాహన మబ్బు పట్టిన ఆకాశం వలె ఉంటుంది. వారు ఆవేశాలకు, ఉద్రేకాలకు లోనై చివరకు దేహాన్ని త్యజించి పదే పదే నరక కూపాలలో పడుతూ ఉంటారు. వారెప్పుడూ ఇంద్రియాలననుసరిస్తుంటారు. ఈ విధంగా మరణం అజ్ఞాన స్వరూపం అని తెలుస్తోంది.
కర్మఫలాన్ని కోరే మానవులు సమయం వచ్చినపుడు దేహం విడిపెట్ట్టి స్వర్గం వైపు ప్రయాణిస్తారు. అయితే వారు మృత్యువును తప్పించుకోలేరు. వారు తాము చేసిన పూర్వ పుణ్య కర్మ ఫలితం అనుభవించిన తరువాత తిరిగి ఈ భూమి మీద జన్మించుట తప్పనిసరి.
శరీరధారులైన జీవులు బ్ర హ్మ జ్ఞానం పొందేందుకు అశక్తులై భౌతిక సుఖానుభవంతో ఉన్న సంబంధం వల్ల పదే పదే జనన మరణాలనే సంసార వలయంలో పడుతున్నారు.
అశాశ్వతమైన వాటి కోసం తాపత్రయపడటం మానవ లక్షణం. ఇంద్రియాలు మానవులను పెడదారి పట్ట్టించేందుకు ఇదియే ముఖ్య కారణం. భౌతిక సుఖాలను అనుభవించాలనే కోరిక మొదట జనిస్తుంది. కోరిక వెంటే క్రోధమోహాలు ఉదయిస్తాయి. ఈ మూడు మానవుల మరణానికి దారితీస్తాయి.
మానవులు ఇంద్రియ నిగ్రహం, ఆత్మ నిగ్రహంతో మాత్రమే మృత్యువును జయించగలరు. కనుక జ్ఞానంపై ఆధారపడిన మానవుడు మరణం గురించి భయపడవలసిన అవసరం లేదు. మరణంతో శరీరం నశించినట్లు జ్ఞానంతో మరణం నశిస్తుంది.
మానవుడు నిత్యజీవితంలో కర్మలాచరించి అశాశ్వతమైన వాటినే పొందగలడు. జ్ఞానం పొందితే శాశ్వతమైన పరబ్రహ్మ స్థిితిని చేరుకోగలడు”.
ఇక అంతర్యామి, నిత్యసత్యడుడైన పరబ్రహ్మ నిజ స్వరూపం ఎటువంటిదో సనత్సుజాతుడు ఈ విధంగా చెప్పాడు. ”భూమ్యాకాశాలయందు గాని, సముద్ర జలమందుగాని పరబ్రహ్మము కానరాదు. నక్షత్ర మండలంలోగాని, మేఘాలలోగాని, సూర్యచంద్రులందు గాని, దేవలోకంలో గాని పరబ్రహ్మాన్ని గాంచలేము. వేదాలలో కనుగొనలేము. పరిమిత బుద్ధికతీతంగా అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మమునందు లయకారుడు కూడా ప్రళయానంతరం లీనమగుచున్నాడు.
అణువులో అణువు వలె సూక్ష్మంగా ఉండి చూసేందుకు అగోచరమైనది పరబ్రహ్మము. సృష్టిలోని ప్రతి వస్తువునకు మూలాధారం పర బ్రహ్మం. పరబ్రహ్మ మార్పులేనిది, అనంతమైనది, ఆనందమయమైనది.
అన్ని జీవులు పరబ్రహ్మము నుండి జనించి తిరిగి పరబ్రహ్మములో లీనమవుతున్నాయి. అన్ని విధములైన ద్వంద్వముల నుంచి విముక్తి పొందిన పరబ్రహ్మ వ్యక్త రూపమే ఈ లోకం. సర్వత్ర వ్యాపించి ఉన్నది, మార్పులేనిది, నిత్యసత్యమైనది పరబ్రహ్మమని పండితులు చెబుతారు. ఈ లోకాన్ని సృష్టించిన పరబ్రహ్మాన్ని తెలుసుకున్న వారు నిజంగా ధన్యులు.
సర్వేజనాస్సుఖినోభవంతు

-కోసూరు హయగ్రీవరావు
99495 14583

Advertisement

తాజా వార్తలు

Advertisement