Tuesday, April 16, 2024

శ్రీ మహా విష్ణువు నోట ఆయుర్వేదం

వేదముల నుండి ఆవిర్భవించిన ఆయుర్వేదము సనాత నము. అతి ప్రాచీనమైన ఈ వైద్య విధానము అత్యంత ప్రతిభావంతమైనది. ప్రస్తుత వైద్య శాస్త్రమునకు పునాది. రోగ కారణమును మరియు మూలమును గుర్తించి నిర్మూలన చేసే శక్తి శాలి. నాగరిక మానవుని జీవన సౌలభ్యము కొరకు అనేక వైద్య ప్రక్రియలు, ఔషధములు అమలులోకి వచ్చి యున్నవి. స్వల్ప కాలమున ప్రయోజనము పొందుచూ దీర్ఘ కాలమున అనేక ఇక్కట్లు పడుచున్నాడు. దేశాభివృద్ధితోబాటు అనేక రోగములు కూడా వెలుగులోనికి వచ్చినవి. జీవి పుట్టుక, దాని సంరక్షణకు ఆధారము
ఈ పుడమి. ముఖ్యముగా మానవుని సంరక్షణ కొరకు అవసరమగు మూలి కలు, ఖనిజములు, స్వచ్ఛమైన వాతావరణము ఈ భూమి మీదనే లభించుచున్నవి. వీటి నుండి రూపాంతరము పొంది నవే ఔషధములు. జీవముతో కూడిన ఔషధములే ఆయుర్వేద మునకు ప్రధానమైనవి. ఆయుర్వేద వైద్యవిధానములో ఈ ఔషధములు గొప్ప విశేషతను సంతరించుకొన్నవి. ఆయుర్వేదము యొక్క సమస్త ప్రస్థావన బ్రహ్మ వైవర్త పురాణములోని బ్రహ్మ ఖండమునందు కలదు. అందు ఉటం కించిన పదార్థములు మన వంటింటి ధన్వంతరి పేటికయిన పోపుల పెట్టెలో ఉండుట ముదావహము. బ్రాహ్మణ రూపమున శ్రీ మహావిష్ణువు మాలావతీదేవికి ఆయుర్వేదమును గురించి ఈవిధముగా వివ రించెను.

”చతుర్వేదాలను ప్రకటించిన పరమేశ్వరుడు ప్రజాపతిని అధ్యయనము చేయుమని ఆజ్ఞాపించెను. అంత ప్రజాపతి వేదసారమును గ్రహించి ఆయుర్వేదమును రూపొందించె ను. దానిని సూర్యునకు ఉపదేశించెను. సూర్యుడు ఆయుర్వేద సారమును స్వతంత్ర సంహితగా సృజించి దానిని తన శిష్యు లకు ఉపదేశించెను. ఆ పదహార మంది శిష్యులు ఒక్కొక్క ఉప సంహితను సృష్టించారు. అవి- ధన్వంతరి చికిత్సా తత్త్వ విజ్ఞానము, దివోదాసుడు చికి త్సాదర్పణము, కాశీరాజు దివ్య చికిత్సా కౌముది, కవలలైన అశ్వనీకుమారులు అమోఘ వైద్యసంహిత అయిన చికిత్సా సార తంత్రము, నకులుడు వైద్యక సర్వస్వము, సహదేవుడు వ్యాధిసింధు విమర్దనము, యముడు జ్ఞానార్ణవము, చ్యవన మహర్షి జీవదానము, జనక యోగి వైద్యసందేహ భంజన ము, బుధుడు సర్వసారము, జాబాలి తంత్రసారము, జాజలి వేదాంగసారము, పైలుడు నిదాన తంత్రము, కరథుడు సర్వ ధరతంత్రము, అగస్త్యుడు బ్యైధ నిర్ణయము అను మహిమా న్విత వైద్యశాస్త్ర గ్రంథములను నిర్వచించిరి. ఇవి బీజ స్వరూప గ్రంథములు.

వ్యాధేస్తత్త్వ పరిజ్ఞానం వేదనాయశ్చ నిగ్రహ:
ఏతద్వైద్యస్య వైద్వత్యం నవైద్య: ప్రభువాయుష:
రోగముల యొక్క పరిజ్ఞానమును కలిగి, వేదననుభవించు చున్న జీవుని శరీరమందున్న రోగమును నిర్ణయము చేసి ఆ రోగ బాధను నిరోధించి, దానిని నిర్మూలిం చుటయే వైద్యుల వైద్యతత్వము. వైద్యుని లక్షణములేవనగా, అసలైన చికిత్సను తెలిసున్న ఆయుర్వేద జ్ఞాత, చికిత్స క్రియను యథార్థ రూప ముగా తెలుసుకొన్నవాడు, ధర్మనిష్ఠ కలవాడు, కరుణామ యుడు మాత్రమే వైద్యుడనబడును. వృద్ధత్వము దేహధారులైన జీవులను నావహించుటకు నిరంతరము భూమిపై భ్రమించుచుండును. కాని సంయమ, నియమ యుక్తులైనవారిని రోగగ్రస్తమైన వృద్ధత్వము దరి చేరదు. ప్రతి దినము నేత్రములను స్వచ్ఛమైన జలముచే శుద్ధి చేసుకొనుట, ప్రాత:కాలమున యోగ, వ్యాయామ మాచరిం చుట, తరచు తైలయుత స్నానము నాచరించుట, ఋతువు లను అనుసరించి అగ్ని సేవన చేయుట, ఋతువులను, కాల నియమములననుసరించి ధర్మపత్ని యందు సుఖమొందు ట, ఋతువులననుసరించి తగిన జలములలో స్నానమాచరిం చుట, అరగదీసిన చందనమును లేపనముగా వేసుకొనుట, పరిశుద్ధమైన వాయువును సేవించుట, సమయమునకు మిత భోజనము చేయుట, వేడిపదార్థములను భుజించుట, పరమా న్నము, నేయి సేవించుట, ప్రశాంత చిత్తముకొరకు దైవమును ఆరాధించుట, తాంబూలము సేవించుట, పగటిపూట పెరుగు భుజించుట, రాత్రియందు తగినన్ని గోక్షీరమును త్రాగుట వలన రోగగ్రస్తమయిన వృద్ధాప్యము దరిచేరదు. మాంసము, ఐదు రోజులు పులిసిన పెరుగును, రాత్రులయందు పెరుగు తినువారిని, పరస్త్రీలను, ఋతుమతి అయిన స్త్రీలను, వయసు న పెద్దది అయిన స్త్రీలను సమాగమించిన వారు అతి త్వరగా రోగగ్రస్తమైన జరావస్థను పొందుట ఖాయము.
అందువలన స్వధర్మాచరణ పాటించుచూ భగవంతుని మంత్ర దీక్ష ను గైకొని తల్లిదండ్రులను, గురువును, అతిథులను భక్తితో సేవించుచుండవలెను. ధ్యానమునందు ఆసక్తిచూపు చూ వ్రతదీక్ష, నియమిత ఉపవాసములు ఆచరించవలెను. తీర్థ యాత్రలు చేయవలెను. అట్టి వారిని రోగములు దరిచేరవు. వారు జరావస్థ నుండి దూరముగా నుందురు.
ఇక పాపములు రోగములకు కారణమగును.

పాపేన జాయతే వ్యాధి: పాపేన జాయతే జరా!
పాపేన జాయతే దైన్యం దు:ఖం శోనో భయంకర:
తస్మాత్‌ పాపం మహావైరం దోష బీజమమంగళమ్‌!
భారతే సంతతం సన్తో నాచరన్తి భయాతురా:

పాపములే రోగములకు, వృద్ధావస్థకు, నానావిధ విఘ్నము లకు బీజములు. పాపము వలననే దైన్యము, దు:ఖము, రోగ ము, వార్థక్యము ఉత్పన్నమగును. పాపములే దోష బీజము లు, అమంగళకారకములు. కావున నియమబద్ధమైన, పవిత్ర మైన దివ్యమైన జీవనము మానవ దేహమునకు ఆపాదించిన ఆనందమయమయిన చైతన్యమునకు అర్హుడగును.”
ఈవిధముగా బ్రాహ్మణ రూపములోనున్న శ్రీహరి మాలా వతీదేవికి ఆయుర్వేద రహస్యములను, రోగ నివారణా ఔష ధములను పవిత్రమైన జీవన మార్గ మును, అనేక మహోన్నత విశేష ణము లను తెలియచేసినాడు.


– వారణాణి వెంకట
సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement