Thursday, April 25, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 40

  1. మునునీచేనపవర్గరాజ్యపదవీమూర్ధాభిషేకంబు
    (గాంచినపుణ్యాత్ములు నేను నొక్క సరివో! చింతించి చూడంగ
    నెట్లనినన్గీట ఫణీంద్ర పోతమదవేదండోగ్ర హింసా విచారిని
    ( గాగా, నిను( గాన( గాక మదిలో శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా!, చింతించి = ఆలోచించి, చూడగన్ = చూడగా, మును = పూర్వం, నీ చేన్ = నీ వలన, అపవర్గ = మోక్షము అనే, రాజ్యపదవీ = సామ్రాజ్య పదము నందు, మూర్ధ + అభిషేకంబు = పట్టాభిషేకాన్ని, కాంచిన = పొందిన, పుణ్య + ఆత్ములు = పుణ్యకర్మలు చేయటమే తమ జీవలక్షణంగాకలవారు, నేనున్ = నేను కూడ, ఒక్క సరి + పో = సమానులమే సుమా!, ఎట్లు + అనినన్ = ఏ విధంగా అంటే, కీట = సాలెపురుగుని, ఫణీంద్రపోత = సర్పరాజాన్ని, మదవేదండ = మదపుటేనుగని, ఉగ్ర = భయంకరమైన, హింసావిచారిని = కిరాతకుడిని, కాగాన్ = అవగా, (అయి ఉండగా), మదిలోన్ = మనసులో, నినున్ = నిన్ను, కానన్ + కాక = చూడక పోయాను.

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! ఇంతకు ముందు నీ వల్ల మోక్షపదవియందుపట్టాభిషేకాన్ని పొందిన పుణ్యాత్ములును, నేను సమానమే. ఎలాగంటే–సాలె పురుగుని, పాముని, మదపుటేనుగని, కిరాతకుణ్ణి అయి (తాను వారి భావాన్ని పొంది) నిన్ను నా మనస్సులో దర్శించ లేక పోయాను.

విశేషం:
శ్రీకాళహస్తి యందున్నశివుణ్ణి సేవించి, ముక్తి పొందినవి సాలెపురుగు, సర్పం, ఏనుగ, కిరాతుడు. ధూర్జటి తాను వాటితో సమాన మన్నాడు.అనగా తాను ఆయా జంతువుల భావాన్ని పొందాడట! కీటముఅనగా పురుగు క్షుద్రజీవి. తాను కూడా పురుగు వంటి అల్పజీవి. పాము వలె కలుగులో దూరే లక్షణం, మదపుటేనుగ వలె పొగరెక్కి, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే లక్షణం, భయంకరమైన హింసచేయాలనే కోరిక (ఉగ్రహింసావిచారి) కలవాడినని చెప్పుకున్నాడు. ఈ లక్షణాలు తనలో ఉన్నాయి కనుక తాను ఆ జంతువులతోను, ఆ బోయవాడితోనూసమానమట! అయితే అవి భగవద్దర్శనం చేసుకుని, మోక్షం పొందాయి. తాను పరమేశ్వరుణ్ణి మనస్సులో చూడలేకపోయాడట. అదే తనకి వాటికి ఉన్న తేడా అట. అంటే, యీశ్వరుణ్ణి దర్శించ లేని వారు ఆ జంతువులతో కూడా పోల్చతగని వారు అని ధూర్జటి భావం. మోక్షాన్ని పొందిన ఆ జీవుల భావాన్ని తాను పొందాడు కనుక వాటి వలె తాను కూడా అనుగ్రహాన్ని పొందటానికి అర్హుడనని సూచిస్తున్నాడు ధూర్జటి.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి

ఇదికూడా చ‌ద‌వండి : శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 39

Advertisement

తాజా వార్తలు

Advertisement