Thursday, March 28, 2024

శ్రీరామ పట్టాభిషేకం

భరతుడు రాముని చూసి ”అన్నా! తండ్రిని సత్యసంధుని చేయతలచి, పితృవాక్య పాలన నిమిత్తమై అలనాడు వనవాసానికి వెళ్ళావు. చిత్రకూట పర్వతమున తాత్కాలి కంగా రాజ్యపాలన బాధ్యత నాకు అప్పగించావు. నీ రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను. కోసల రాజ్యపాలనకు నీవే అర్హుడవు. మన తండ్రి దశరథుడు నిన్ను రాజుగా చూడాలని కలలు గన్నాడు. పట్టాభిషిక్తు డవై తండ్రి కోరికను నెరవేర్చుము” అన్నాడు.
రాముడు సమ్మతించాడు. క్షురకులు రామలక్ష్మణుల జడలను తొలగించారు. భరత లక్ష్మణ శత్రుఘ్నులు, సుగ్రీవుడు, విభీషణుడు మున్నగువారు మొదట స్నానం చేసి పునీతులయ్యారు. తరువాత వారు రాముని సర్వాలంకార భూషితుని చేశారు. దశరథుని భార్య లు సీతను అలంకరించారు. తార, రుమ మున్నగు వానర స్త్రీలను కౌసల్య అలంకరించింది.
శత్రుఘ్నుని సూచనను అనుసరించి, సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేసి తెచ్చాడు. శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు. భరతు డు సారధ్యం చేశాడు. శత్రుఘ్నుడు తెల్లని గొడుగును పట్టాడు. లక్ష్మణ విభీషణులు వింజామరలు వీచారు. సుగ్రీవుడు రాముని పట్టపుడేనుగు శత్రుంజయమును అధిరోహించాడు. వానరులు సర్వాలంకార భూషితులై తొమ్మిదివేల ఏనుగులనెక్కి అయోధ్యలో ప్రవేశించారు. సీత, తార, రుమ మున్నగు స్త్రీలు పల్లకీలలో పయ నించారు. మంగళ వాద్య ధ్వనుల మధ్య అందరూ నందిగామం నుండి అయోధ్య వైపు పయనించారు.
అయోధ్య నగర ప్రజల హర్షధ్వానాలు, జయజయ నినాదాలు మిన్నంటాయి. వంది మాగధులు పాఠకుల స్తుతులతో నగరం హోరెత్తిపోయింది. బ్రాహ్మణులు, స్త్రీలు మంగళ గీతాలను ఆల పించారు.
రాముడు సుగ్రీవాది వానర వీరులు తనకు చేసిన సాయాన్ని గూర్చి మంత్రులకు తెలిపాడు. మంత్రి పురోహితులతో శ్రీరాముడు అయోధ్యలో ప్రవేశించాడు. వంశపారంపర్యంగా ఇక్ష్వాకు రాజులు నివసించే రాజభవనంలో రాముడు ప్రవేశించాడు. ముగ్గురమ్మ లకు నమస్కరించాడు. తన మందిరాన్ని సుగ్రీవునికి విడిదిగా ఇమ్మని భరతునికి సూచించాడు. భరతుడు సుగ్రీవుని చేయి పట్టు కొని, మునుపు రాముడు నివసించిన మందిరానికి చేర్చాడు. శత్రు ఘ్నుడు వానర వీరులకు, విభీషణాదులకు తగిన రీతిలో ఏర్పా ట్లను కావించాడు.
వసిష్ఠుడు పట్టాభిషేకానికి అవసరమైన మంగళకరముల యిన సంభారములన్నింటిని తెప్పించాడు. భరతుని సూచన మేరకు సుగ్రీవుడు వానరులచే తెప్పించిన పవిత్ర జలాలను శత్రు ఘ్నుడు పురోహితునకు సమర్పించాడు.
ఇక్ష్వాకు వంశ ప్రధాన పురోహితుడు వసిష్ఠుడు. బ్రాహ్మణులు వేద పఠనం చేస్తుండగా సీతారాములను సింహాసనాసీనులను కావించాడు. వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యా యనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మున్నగు మహ ర్షులు పవిత్ర సుగంధ జలాలతో రాముని అభిషేకించారు. దేవ గంధర్వాదులు ఓషధి రసాలతో అభిషిక్తులను కావించారు. మను వు నుండి వంశపారంపర్యంగా ధరిస్తున్న మణిమయ కిరీటాన్ని రాముని శిరస్సున అలంకరించారు. శత్రుఘ్నుడు సీతారాములకు గొడుగును పట్టాడు. సుగ్రీవుడు, విభీషణుడు ఇరువైపుల వింజా మరలు వీచారు. వాయుదేవుడు శతప్రత స్వర్ణకమలాన్ని, ముత్యా ల హారాన్ని సమర్పించాడు. గంధర్వులు మధుర గానం చేశారు. అప్సరసలు అత్యద్భుతంగా నాట్యమాడారు. కళాకారుల వినోద ప్రదర్శనలు నయనానందకరం అయ్యాయి. బ్రాహ్మణులకు అపా రమైన ధనరాసులు, గోవులు, స్వర్ణ రత్నరాసులు దానం చేశారు.
రాముడు మణిమయమైన స్వర్ణ హారాన్ని సుగ్రీవునికి కానుక ఇచ్చాడు. వజ్ర రత్న ఖచితములైన రెండు భుజకీర్తులను అంగదు నికి బహూకరించాడు. సీత దివ్య వస్త్రాలను, ఆభరణాలను బహూ కరించింది. సీత తన కంఠాభరణాన్ని తీసుకొని రాముని వైపు, వాన రుల వైపు సాభిప్రాయంగా చూసింది. శ్రీరాముడు సీత ఆంతర్యాన్ని గ్రహించాడు. నీ ఆదరానికి పాత్రుడైన ఉత్తమునికి కంఠాభరణాన్ని ఇమ్మని సూచించాడు. సీత తన కంఠాభరణాన్ని హనుమంతునికి బహూకరించింది. శ్రీరాముడు విభీషణాదులకు హనుమంత, జాంబవంతాది వానర శ్రేష్ఠులకు దివ్య వస్త్రాభరణాలను బహూక రించాడు. వానర వీరులందరూ సంతోషభరితాత్ములై కిష్కింధకు బయలుదేరారు. సుగ్రీవుడు రామపట్టాభిషేక దృశ్యాన్ని హృదయ మున స్థిరముగా నిలిపి, కిష్కింధ చేరాడు. విభీషణుడు శ్రీరాముని ఆరాధ్య దైవంగా తన హృదయమున ప్రతిష్ఠించుకొని లంకా నగ రం చేరాడు.
శ్రీరాముడు లక్ష్మణునితో, లక్ష్మణా! ఈ రాజ్యాన్ని నాతోపాటు నీవు కూడ పరిపాలింపుమన్నాడు. రాముడు భరతుని యువరాజు గా ప్రకటించాడు. రాముడు యజ్ఞాలను చేసి అనేక కోట్ల ధనరాసు లను దక్షిణగా సమర్పించాడు.
శ్రీరామరాజ్యం ఆదర్శ రాజ్యంగా కీర్తి గాంచింది. శ్రీరామ రాజ్యంలో క్రూర జంతువుల బాధలేదు. రోగ భయం, దొంగల భయం అసలే లేవు. అనర్థాలకు తావులేదు. బాల మరణాలు మచ్చు నకు గూడ కానరావు. ప్రజలు ధర్మపరులై పరస్పరం ఆత్మీయ తానురాగాలతో ప్రశాంతంగా సహజీవనం సాగించారు. ప్రజలం దరూ దీర్ఘాయుష్మంతులే! రామనామస్మరణ, రామకథా కీర్తనల తో జగమంతా రామమయం అయింది.
చెట్లు ఎల్లవేళల పుష్పఫలభరితములై కనువిందు కావిస్తూ ఉండేవి. సకాలంలో వర్షాలు కురుస్తూ ఉండేవి. పాడిపంటలతో సమృద్ధమై కోసల రాజ్యం నిత్య కల్యాణం పచ్చతోరణంగా అలరా రుతుండేది. వర్ణాశ్రమ ధర్మాలు విద్యుక్తంగా అనుసరించబడుతూ ఉండేవి. శ్రీరాముడు పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. వాల్మీకి మహర్షి రచించిన ఆదికావ్యం రామాయణం. రమణీయమైనది. శుభకరమైనది. ఆయురారోగ్యాలను కలిగిస్తుం ది. విజయాన్ని చేకూరుస్తుంది. రామాయణాన్ని చదివినా, వినినా సకల పాపాల నుండి విముక్తులవుతారు. రామాయణాన్ని భక్తి శ్రద్ధలతో చదివినవారు కామక్రోధాలను జయిస్తారు. దు:ఖాల నుండి విముక్తులవుతారు. దూరమైన బంధుమిత్రులు కూడ దరి చేరుతారు. మనోరథములు నెరవేరతాయి. దేవతలు ప్రసన్నులవు తారు. రాజ్యభ్రష్టులు శత్రువులను జయించి, కోల్పోయిన రాజ్యా న్ని మరల పొందుతారు. సకల శుభాలు కలుగుతాయి. గర్భవతులు ఉత్తమ పుత్రులను పొందుతారు. రామానుగ్రహాన్ని పొందుతారు. సంపన్నులవుతారు. రామాయణాన్ని శ్రద్ధతో వినడం వల్ల కుటుం బం వృద్ధి అవుతుంది. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. రామా యణాన్ని శ్రద్ధాభక్తులతో నియత వ్రతులై నియమనిష్ఠలతో వినాలి. వాల్మీకి మహర్షి కృతమైన రామాయణాన్ని భక్తితో వ్రాసినవారు స్వర్గసుఖాలను పొందుతారు.

– కె.ఓబులేశు
9052847742

Advertisement

తాజా వార్తలు

Advertisement