Friday, April 19, 2024

శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం (ఆడియోతో..)

శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్‌” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.

ఈరోజు కూర్మావతార విశేషాల గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
కూర్మావతారం
దూర్వాస మహర్షి శాపం వలన లక్ష్మీదేవి అంతర్థానం చెంది క్షీరసాగరంలో ఉండగా దేవతలు రాక్షసుల బాధను తట్టుకోలేక శ్రీహరిని ప్రార్థిం చెను. అప్పుడు క్షీరసాగరంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకి తాడుగా అమర్చి సకల ఔషధులు అందులో వేసి చిలికితే అమృతము వస్తుందని చెప్పగా దేవ దానవులు కలిసి పరమాత్ముని సహాయంతో మందర పర్వతాన్ని సముద్రంలో వేసి వాసుకిని ప్రార్థించి కవ్వం తాడుగా చేసి చిలుకుతుండగా అధికబరువు కారణంగా మందర పర్వతం సముద్రంలో మునగసాగింది. అపుడు అందరు స్వామిని ప్రార్థించగా ఆయన కూర్మరూపాన్ని ధరించి పర్వతాన్ని మోసి మునగకుండా చేసి అమృతం మరియు అమ్మవారు ఉద్భవించడానికి అనువును ఏర్పరిచారు. ఆ సమయంలో దేవతలకు, ఋషులకు వేదార్థాన్ని కూర్మ పురాణ రూపంలో అందించారు. సిద్ధిని పొందగోరే వారు చేసే అన్ని ఉపాసనలకు కూర్మాసనం ప్రధానం. నీటిలో స్నానం ఆచరించే సమయంలో ”కూర్మ రూపి జనార్థన:” అని, బరువు మోస్తున్నప్పుడు ”కూర్మ రూపాయతే నమ:” అని స్మరించి ముందుకు సాగమని కూర్మ పురాణం చెబుతుంది.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement