Thursday, April 25, 2024

శ్రీకాళహస్తీశ్వర శతకం

96
మొదలన్ భక్తుల కిచ్చినాడవు కదా మోక్షంబునేడేమయా
ముదియంగాముదియంగ బుట్ట ఘనమౌమోహంబులోభంబున
న్నదిసత్యంబుకృపందలంపవొకపుణ్యాత్ముండునిన్నాత్మ
గొల్చిదినంబున్మొర పెట్టగా కటకటా శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా!, మొదలన్ – ముందు / పూర్వకాలంలో, భక్తులకు – నీ సేవకులకు, మోక్షంబు – ముక్తిని, ఇచ్చినాడవు – కదా – దయచేశావు కదా!, ముదియంగా, ముదియంగన్ – ముసలితనం పై బడుతున్న కొద్ది, ఘనము – ఔ – గొప్పదైన, లోభంబున్ – పీనాసితనం/తనకే కావాలి అనుకోవటం/ఇతరులకి ఇవ్వక పోవటం, మోహంబు – అతి వాంఛ/ వ్యామోహం, పుట్టున్ – కలుగుతాయి, అన్నది – అని చెప్పే మాట, సత్యంబు – నిజం / వాస్తవం, ఒక – ఒకానొక, పుణ్యాత్ముడు – సత్పురుషుడు/పుణ్యకార్యాలు చేసే వాడు, నిన్ను – నిన్ను, ఆత్మన్ – మనస్సులో, కొల్చి – సేవించి / భజించి / ధ్యానించి, దినంబున్ – ప్రతిరోజు, మొర – పెట్ట – కాన్ – ప్రార్థించగా, కృపన్ – తలంపవు – కరుణించవు / దయచూడవు, నేడు – ఏమి – అయా – ఇప్పుడేమైంది? కటకటా! – అయ్యయ్యో / పాపం!!

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!పూర్వం నీ భక్తులకి మోక్షం ఇచ్చావు కదా! ఇప్పుడేమయింది? వార్ధకం వస్తున్న కొద్దీ వ్యామోహం, లోభగుణం ఎక్కు వవుతాయన్నది నీ విషయంలో సత్యమయింది. అట్లా కాకపోతే ఒక పుణ్యాత్ముడు నిన్ను అనునిత్యం ఆత్మలో దర్శించి స్థాపించి, ధ్యానం చేస్తూ ప్రార్థిస్తూ ఉంటే కూడా దయ చూపటం లేదు. అన్యాయం కదా!

విశేషం: శివుడు ఒకప్పుడు తన భక్తులందరికి కూడా మోక్ష మిచ్చాడు. ఇక్కడ సాలెపురుగు, పాము, ఏనుగ, తిన్నడు, సిరియాళుడు మొదలైన భక్తులందరి గురించి గుర్తుచేయటం ఉంది. అటువంటి వారందరికీ ముక్తి నిచ్చాడు. కాని, ప్రస్తుతం ఇవ్వకపోవటానికి, అందునాసచ్చరిత్రకలవాడిని కరుణించక పోవటానికి గల కారణాన్ని చక్కగా ఊహించాడు ధూర్జటి. ముసలితనం వస్తున్న కొద్దీ లోభం, మొహం పెరుగుతాయని ఉన్న లోకోక్తి శివుడి విషయంలో నిజ మయిందన్నాడు. అంటే భక్తులపై కరుణ చూడక పోవటానికి వృద్ధాప్యమే కారణం తప్ప, శివుడి దోషం లేదని ధూర్జటి సమర్ధన.

డాక్టర్ అనంతలక్ష్మి


Advertisement

తాజా వార్తలు

Advertisement