Saturday, April 20, 2024

శ్రీకాళహస్తీశ్వరా శతకం

76.వెనుకంజేసిన ఘోర దుర్దశలు భావింపంగ రోత య్యెడున్
వెనుక న్ముందట వచ్చు దుర్మరణముల్వీక్షింపభీతయ్యెడున్
నను నే( జూచియు నా విధుల్దలచియున్ నాకే భయం బయ్యెడున్
జెనకుంజీకటియాయె( గాలమునకున్శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!,వెనుకన్ – పూర్వం, చేసిన – చేసినటువంటి, ఘోర – భయంకర మైన, దుర్దశల్ – చెడ్డపనులు, భావింపగ – తలచుకున్నట్లయిన, రోత – అయ్యెడున్ – అసహ్యం కలుగుతోంది, వెనుకన్ ముందట – వెనుక ముందులుగా (అనుకున్న సమయానికి అటు ఇటుగా), వచ్చు – కలుగుతున్న, దుర్మరణముల్ – అకాలమరణాలు, వీక్షింప – చూడగా, భీతి – అయ్యెడున్ – భయం కలుగు తోంది, నను – నన్ను, నేన్ – నేను, చూడగన్ – చూసుకుంటే, నావిధుల్ – నేను చెయ్యవలసిన పనులు, తలచియున్ – తలచుకొంటూ, నాకు – ఏ – నాకే, భయంబు – అయ్యెడున్ – భయం కలుగుతోంది. కాలమునకున్ – తగిన సమయానికి (అంత్యకాలానికి), చెనకుంజీకటి – పైపైకి విజృంభించే అజ్ఞానాంధకారమే, అయ్యెన్ – ఉంది.

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! పూర్వం నేను చేసిన దుష్కార్యాలు తలచుకుంటే అసహ్యం కలుగుతోంది. వెనుక ముందుగా వచ్చే అకాలమరణాలని చూస్తే, భయం వేస్తోంది. నన్ను నేను పరికించి చూసినా, నేను చేయ వలసిన విధులని తలచినా మఱింత భయం కలుగుతోంది. చివరిదశలో బాగా విజృంభిస్తున్న అజ్ఞానాంధకారమే మిగిలింది. (దాని నుండి రక్షించమని భావం.)

విశేషం
ఆత్మవిమర్శ, చేసిన పనులకి,పశ్చాత్తాపం, కాలం పైబడుతున్న సమయంలో, తాను చేసిన దుష్కర్మల కారణంగా అంతా చీకటే మిగులుతోందనే ఆవేదన ధూర్జటిదిఒక్కడిదే కాదు, సర్వజీవులదీను.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement