Thursday, March 28, 2024

శ్రీకాళహస్తీశ్వరా శతకం

75. చవిగా( జూడవినంగ, మూర్కొన( దనూసంఘర్షణాస్వాదమొంద
వినిర్మించెద వేల జంతువుల? ఏతత్ క్రీడ లే పాతక
వ్యవహారంబులుసేయుదేమిటికి? మాయావిద్యచే( బ్రొద్దు
వుచ్చివినోదింపగ దీన నేమిఫలమో? శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, జంతువులన్ – ప్రాణులని, చవి – కాన్ – రుచి చూడటానికి, చూడన్ – కంటితో చూడటానికి, వినంగన్ – వినటానికి, మూర్కొనన్ – వాసన చూడటానికి, తనూ సంఘర్షణ – ఆస్వాదము – ఒందన్ – శరీరాల రాపిడిని ఆస్వాదించి ఆనందించటానికి (స్పర్శసుఖాన్ని అనుభవించటానికి), వినిర్మించెదవు – ఏల – ఎందుకు సృష్టిస్తావు?, ఏతత్ – వీటికి సంబంధించిన, క్రీడలు – ఏ – ఆటలే / వినోద వ్యాపారాలే, పాతకవ్యవహారంబులు – పాపపుపనులుగా, చేయుదు – ఏమిటికి – ఎందుకు చేస్తావు? మాయావిద్యచేన్ – మాయావిద్యతో, ప్రొద్దుపుచ్చి – కాలక్షేపం చేసి, దీన – దీనితో, వినోదింపగన్ ్స ఆడుకోటం వల్ల, ఏమిఫలము – ఓ – నీకేమి లాభం ఉంది?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!రుచిచూడటం, చూడటం, వినటం, వాసనచూడటం, స్పృశించటం అనే వాటిని ఆస్వాదించటానికి వీలుగా ( నాలుక, కన్ను, చెవి, ముక్కు, చర్మం అనే ఇంద్రియాలని ఇచ్చి అని భావం) జీవులని ఎందుకు తయారు చేశావు? వీటికి సంబంధించిన వినోదవ్యాపారాలనేపాపపుపనులుగా చూపుతున్నా వెందుకు? మాయావిద్య (లేనిది ఉన్నట్టుగాభ్రమింప చేసే విద్య) తో కాలక్షేపం చేస్తూ వినోదించటం వల్ల నీ కేం ప్రయోజనం ఉందో చెప్పు.

విశేషం:
పరమేశ్వరుడి మాయాజాల వినోదం తనకు అర్థం కాలేదు అంటాడు ధూర్జటి. పంచతన్మాత్రలని, వాటికి సంబంధించిన విషయాలని, వాటిని అనుభూతి చెంది ఆనందించటానికి పంచజ్ఞానేంద్రియాలని ప్రసాదించిన పరమాత్మయే ఆ ఆనందానుభూతిని పాపహేతువుగా చూపటం ఈశ్వరమాయ.

డాక్టర్ అనంతలక్ష్మి


Advertisement

తాజా వార్తలు

Advertisement