Friday, April 19, 2024

మనో వైచిత్రి!

త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతిలో మనసనే పదార్థం మర్క ట ప్రాయమైనది. దీనికి వేసే ఆహారాన్ని బట్టి ఇది ప్రవర్తి స్తుంది. భావోద్రేకాలకు కారణం ఈ మనసే! అటువంటి మనసును స్వాధీనంలో ఉంచకపోతే అది మనలను ముప్పు తిప్ప లు పెడుతుంది. ఒక్కొక్కసారి అయోమయానికి, తీవ్ర విషాదానికి గురి చేస్తుంది. అందుకే మనసు జయించాలి. కానీ ఇది అంత సుల భం కాదు. జయించడం అటుంచి, దానిని స్వాధీనం చేసుకుంటే అదే పదివేలు. వెయ్యిమందిని వేలసార్లు యుద్దంలో ఓడించిన వాడికన్నా తన మనస్సును జయించిన వాడే పరాక్రమవంతుడు. ప్రస్తుత కాలంలో అన్ని వయసుల వారిని తీవ్రమైన మానసిక ఒత్తిడి అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా పోటీ ప్రపంచం యువ తను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ పోరాటంలో జయాపజయాలు సర్వ సాధారణం. జయానికి పొంగిపోయి, అపజయానికి కృంగి పోతున్న యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోంది. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. దీనికంతటికే ప్రధాన కారణం మనసు స్వాధీనంలో లేకపోవడమే! చిత్రమైన మనసును చిత్తశుద్ధితో స్వాధీనం చేసుకోవాలి. మనిషి జీవనానికి ప్రధాన ఇంధనం ఆశ. అది అత్యాశ. దురాశ కానంత వరకు విజయం నిన్ను వరిస్తుంది. చిన్న అపజయానికి కూడా చెదిరిన మనసుతో తన అంతర్గత శక్తులను కూడా మరచి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
చెదిరిన మనసును చీకటి ఆవరించి మనల్ని నిస్సత్తువుగా మార్చి సోమరితనానికి దగ్గర చేస్తుంది. అశాంతి ఆవరిస్తుంది. అప్పుడే చెదిరిన మనసును స్వయం సాధనతో కూడగట్టాలి. అప్పు డు అది ఏకాగ్ర బుద్దితో స్నేహం చేసి చిత్తమునకు దగ్గరవుతుంది. చిత్తము దానికి సుపథమును చూపి ఆత్మకు దగ్గర చేస్తుంది. మనకు తెలుసు ఆత్మకు రంగు, రుచి, రూపము, ఆశ, నిరాశ మొదలయినవి ఏవీ లేవు. త్రిగుణరహితమైనది ఆత్మ. ఆత్మకు దగ్గరయిన మనసు ఏకాగ్రతను సాధిస్తుంది. అటువంటి ఏకాగ్ర దశకు చేరిన మనసు చాలా శక్తివంతమైనది. దానిని ఏ కార్య రంగములో ఉపయోగించి నా అత్యున్నతస్థాయికి చేరడం ఖాయం. మామూలు గాయకుడు సంగీత విద్వాంసుడు అవుతాడు. స్వల్ప నైపుణ్య మున్నవాడు
కూడా నిష్ణాతుడవుతాడు. విజయ శిఖరాలను అధిరోహిస్తారు. సంపదలు సమీకరించుకుంటారు. చివరకు తమ మనో బల సాధ నాల ఫలాలను అందరికీ పంచి ఆనంద యోగాన్ని ఆస్వాదిస్తారు. దీనికి అవిరళ సాధన చాలా అవసరం. ముందు సంకల్ప శక్తిని బలహీన పరిచే కారణాలను తొలగించాలి. మనసులో మరింత శక్తిని నింపడానికి కావలసిన పరిస్థితులను కల్పించాలి. ప్రస్తుతం మనకున్న నైపుణ్యాన్ని గాడిలో పెట్టాలి. కాలాన్ని బలమైన సంక ల్పంతో నమ్మితే అది అచిరకాలంలోనే అభీష్టాన్ని నెరవేరుస్తుంది. మనలను విజయం వైపు ఆశ్చర్యంగా పరుగులు తీయిస్తుంది. మనసును బలహీనపరిచేది భయం. దానిని గుర్తించి అభయాంశ లతో నింపాలి. ఓటమి అనేది నిజానికి బలహీన క్షణంలో కలిగే ఒక భావన మాత్రమే! దానిని సడలని బుద్దితో పరిశీలిస్తే అది విజయ ప్రయ త్నానికి ఒక అంకుశపు పోటు అని అవగాహన అవుతుంది. అది నెప్పిగా ఉన్నా ఏనుగులాంటి నిన్ను సరైన పంథాలో నడిపి స్తుంది. నీలోనున్న ప్రధాన అడ్డు మానసిక బలహీనత కాదు. స్వాధీ నంలో లేని మనసు అని గుర్తించాలి.
స్వాధీనంలో లేని మనసు విపత్కర పరిస్థితుల్లో విపరీతమైన అంతర్మథనం చేస్తుంది. దానివల్ల మనకున్న శక్తి సామర్ధ్యాలు విని యాగించుకోలేము. మనకున్న నైపుణ్యం మరుగున పడేలా చేస్తుంది. అందువల్ల మనసును స్వాధీన ం చేసుకుంటూ అంతర్మ థనానికి అడ్డుకట్టవేయాలి. ముందు నీ ఓటమిని గెలుపుగా మార్చు కోవడానికి కావలసిన వ్యూహం గురించి సంకల్పం చేయాలి. నీకున్న పూర్వ నైపుణ్యాలను అస్త్రశస్త్రాలుగా మార్చి ఎప్పుడు? ఎలా? సంధించాలో నిర్ణయించాలి. ఈ సమయంలో ఎవరితోనూ దేనిలోను పోల్చుకోకూడదు. నీకు నువ్వే పోలిక. నీకు నువ్వే సాటి. మనస్సు స్వాధీనం అయితే వచ్చే ఫలితం సమగ్ర వ్యక్తి వికాసం. అప్పుడు మనస్సును సంకల్ప సిద్ది కొరకు పరుగులు పెట్టించ వచ్చు. ప్రతికూల పరిస్థితి ఆశ్చర్యంగా సానుకూలమవుతుంది. పనిలో నాణ్యత పెరుగు తుంది. సంపదలు నీ స్వంతమవుతాయి. ఓటమి భయాన్ని వీడిన మనసు దైవ స్వభావంతో నిండిపోతుంది. అప్పుడు నీ సంపూర్ణ శక్తులు విడుదల అవుతాయి. అప్రయోజనకరమైన ఆలోచనలు దూరమవుతాయి. పైదశను చేరాలంటే సున్నితమైన మనసును బలమైన పని ముట్టుగా మార్చుకోవాలి. చిత్తశుద్దితో మంచి మనసుతో మంచి ఉద్దేశాలు కలిగించాలని భగవంతుణ్ణి నియమిత కాలంలో ప్రార్థిం చాలి. సర్వశ్య శరణాగతితో విజయాన్ని ప్రసాదించమని దైవశక్తిని కోరితే తప్పక విజయం సిద్దిస్తుంది. ఇక్కడ మంచి ఉద్దేశాలు కావా లని కోరుకుంటున్న నీ మనసును దైవశక్తి తప్పక ఆమోదిస్తుంది.
బలహీనమైన మనసును విడిగా అధ్యయనం చేయాలి. అప్పుడు మనం వేరు, మన మనసు వేరు అనే భావన పుడుతుంది. ఆ సమయంలో దానిని భయం నుండి వేరు చేయాలి. జగమంతా సంతోషమని, దానిలో భాగమవ్వాలంటే ఓటములనే మెట్లు ఎన్నై నా ఎక్కాలని సూచించాలి. ఓటమికి పై మెట్టు విజయమని దానికి అవగాహన కల్గించాలి.
ఈ సాధనా పరంపరలో భయంతో అల్లకల్లోలమైన మనసుకు ప్రాణాయామం, ధ్యానం సరైన ఔషధాలు. సుఖాసనంలో కూర్చు ని గుండెల నిండా గాలి పీల్చి వదలే క్రమం సాధన చేస్తే నిశ్చలమైన బలమైన మనసు స్వంతమవడం ఖాయం. ప్రాణాయామం గురు ముఖతే సాధన చేయడం ఉత్తమం.
మనో బలానికి మరొక ఆయుధం ధ్యానం. క్రమబద్దమైన అభ్యాసంతో మనసును భగవంతునిపై లగ్నం చేయడమే ధ్యానం. భగవంతుడంటే ఆత్మశక్తి. అదియే నీ ఇష్ట దైవమనుకొని మనసును ధ్యానంలో లగ్నం చేయాలి. తనను స్వాధీనం చేసుకుంటున్నాడని తెలుసుకున్న మనసులోకి పెద్దమొత్తంలో ఆలోచనలు, ఆకర్షణలు, భయాలు ప్రవేశించడానికి సిద్దంగా ఉంటాయి. ధ్యాన సమయం లో అవన్నీ ఒక్కసారిగా మనసును ఆక్రమించడానికి తహతహలా డతాయి. ఆ సమయంలో వాటిపై గట్టి నిఘావేసి ఆత్మశక్తి వైపు ఆర్తితో మనసును మళ్ళించాలి. అప్పుడు ధ్యానం పవిత్రమవుతుంది. శుద్దమైన, శక్తివంతమైన చిత్తము నీ స్వంతమవుతుంది. ఏ కార్యమై నా విజయ శిఖరాన్ని అధిరోహిస్తుంది. మనసు తను పొందే ఆనంద అనుభవాలు అందరికీ పంచాలని ఉబలాటపడుతుంది. బలమైన మనసే విజయానికి పునాది.

– వారణాశి వెంకట
సూర్య కామేశ్వరరావు
80746 66269

Advertisement

తాజా వార్తలు

Advertisement