Friday, March 29, 2024

ధర్మం – మర్మం : వినాయక రహస్యము (ఆడియోతో..)

మంత్రఫలము, వాగ్బలం గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యలవారి వివరణ

నందీశ్వర వృత్తాంతము :
శరీరానికి, మనస్సుకు, బుద్ధికి హితమును, శుభమును కలిగించే దానిని కావలసినంతే తీసుకోవాలి. అందరినీ, అన్నింటినీ నేనే అనుభవించాలి అనే ఆశకు ప్రతిరూపం ఉదరము. అనవసరమైన వాటిని స్వీకరించినందున నందీశ్వరుడు గజాసురుడి ఉదరమును చీల్చాడు. మితము, హితము లేకుండా అన్ని ఉదరమునే దాచుకోవడం ఆసురత్వం. తాను ఒక్కడే తింటే రాక్షసుడు, పది మందికి పెట్టిన వాడు మానవుడు అయితే పదిమంది కోసం తాను తినడం మానేస్తే భగవంతుడు. కడుపుకు ఆశ, ఆకలి
పెంచక రుచితో పాటు అభిరుచిని పెంచుకోవాలి. రుచి మనదైతే అభిరుచి లోకానిది అందుకే నందికేశ్వరుడు గజాసుర ఉదరాన్ని చీల్చి శంకరుడిని బయటకు తీసుకువచ్చాడు. నంది అనగా గోవు, వృషభం. ఇది శబ్ద వృషభం అనగా

చత్వారి శృంగా త్రయోఅస్య పాదా:
ద్వేశీర్షే సప్త హస్తాసోఅస్య
త్రిధా బద్ధో వృషభోరోరవీతి
మహాదేవో మర్త్యాగ్‌ం ఆవివేశ

అని శబ్ద రూప వృషభమును వేదమంత్రం వర్ణించింది. ఈ శబ్ద వృషభము నాలుగు కొమ్ములు, మూడు పాదాలు, రెండు శిరస్సులు, ఏడు చేతులు కలిగి ఉంటుంది. ఈ వృషభాన్ని మూడు చోట్ల కట్టగా ఇతనే మహాదేవుడు, మానవులలో ప్రవేశిస్తాడు అని అర్ధం. ఇది శబ్ద పురుషుని ఋషభ స్వరూపం. పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాలుగు వాక్కు భేదాలు నాలుగు కొమ్ములు అలాగే భూత, భవిష్య, వర్తమాన కాలములు మూడు పాదాలు. నిత్యము, అనిత్యము రెండు తలలు అదే విధంగా ఏడు విభక్తులు ఏడు చేతులు. శబ్దము అనేది హృదయమున పుట్టి శిరస్సుకు చేరి కంఠ ము ద్వారా బయటకు వచ్చును. ఇది శబ్ద బ్రహ్మ.

ఆనందరూపుడైన పరమేశ్వరున్ని తన స్వార్థ బుద్ధితో గజాసురుడు తన ఉదరమున దాచుకొనగా మంత్రవశ్యుడైన శంకరున్ని మంత్రరూపుడైన నంది తన మంత్రముతో బయటకు తెచ్చి ఆనందాన్ని లోకమంతటికి అందించాడు. నంది గజాసురుని ఉదరమును కొమ్ములతో చీల్చెను అనగా కొమ్ములు నాలుగు విధములైన వాక్కులు కావున వాక్కులతో ఉపాసించి పరమేశ్వరున్ని సాక్షాత్కరించుకున్నాడు.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement