Friday, March 29, 2024

ధర్మం – మర్మం : తొలి ఏకాదశి (ఆడియోతో..)

తొలి ఏకాదశి విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి లేదా తొలిఏకాదశిగా వ్యవహరిస్తారు. పద్మపురాణం ఉత్తరకాండంలో దీని ప్రాశస్తం గూర్చి వివరించబడినది. యుధిష్ఠర శ్రీకృష్ణ సంవాద రూపంలో ఉన్న ఈ పురాణంలో ఆషాఢ శుక్ల ఏకాదశి ఏ పేరుతో పిలువబడుతుందని దీనిని ఆచరించాల్సిన విధానం ఏమిట ని ధర్మరాజు అడుగగా ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశిగా వ్యవహరిస్తారని ఈ ఏకాదశి సకల పాపములను హరించి స్వర్గమును, మోక్షమును ప్రసాదిం చునని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చెను. ఈ శయన ఏకాదశి ప్రభావమును వినినంతనే వాజపేయ యాగ ఫలం లభించునన్నది సత్యం, మానవులకు దీనిని మించినది లేదని శ్రీకృష్ణుడు పలికెను.

పాపినాం పాప నాశాయ సృష్టా ధాత్రా మహోత్తమా
అత: పరా న రాజేంద్ర వర్తతే మోక్షదాయిని

ఆషాఢ శుద్ధ ఏకాదశి పాపుల పాపములను నశింపజేయును. ఇది అన్నిటికంటే ఉత్తమమైనది కావున దీని ప్రభావమును వినము అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో పలికెను. తన భక్తిపరాయణులు అయిన మానవులు ఆషాఢమున వామన రూపంలో ఉన్న పరమాత్మను పూజించెదరని శ్రీకృష్ణుడు తెలిపెనను.

వామన: పూజితోయేన కమలై: కలమలేక్షణా
ఆషాఢస్య శితే పక్షే శయన్యాశ్చ దినే తదా
యేనార్చితం జగత్సర్వమ్‌ త్రయోదేవా: సనాతనా:
కృతా చైకాదశియేన హరివాసర ముత్తమమ్‌

- Advertisement -

ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వామన మూర్తిని కమలములతో అర్చించ వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, జగత్రయమును పూజించినవారగదుర ని కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో పలికెను. నీవు ఎలా శయనించినావు, ఎలా బలిని ఆశ్రయించినావు, భూమిని ఏ విధంగా చేరినావు, ఆ సమయమున నరులు ఏమి చేసిరని ధర్మరాజు సందేహం వెలిబుచ్చగా సకల పాపములను హరించు ఉత్తమ కథను వినమని శ్రీకృష్ణుడు పలికెను.

పూర్వము త్రేతాయుగమున బలి అను దైత్యరాజు నిత్యము నన్నే పూజించుచూ అన్ని విధములైన యజ్ఞములు, వ్రతములతో సనాతనుడనైన నన్ను పరమ భక్తితో ఆరాధించుచుండెను.
అయిననూ జ్ఞాతి (పాలి) వైరముతో ఇంద్రుడిని యుద్ధములో ఓడించి త్రైలోక్య రాజ్యమును హరించెను. రాజ్యమును కొల్పోయిన ఇంద్రుడు దేవతలు, బృహస్పతితో కలిసి పలు సూక్తములతో నన్ను పూజించగా నేను వామన రూపంలో పంచమావతారమున ఆవిర్భవించి అత్యుగ్రమైన సకల బ్రహ్మాండ రూపంతో మాటల నేర్పుతో దైత్యులందరినీ ఓడించి బలిని మూడు అడుగులు యాచించితిని. శుక్రాచార్యుడు నా నిజరూపమును తెలుసుకొని ఇతను సాక్షాత్తు నారాయణుడే అని దానము ఇవ్వరాదని బలితో వారించెను. అయినా సత్యవాక్కు పరిపాలకుడైన బలి ఆడిన మాటను తప్పక సంకల్ప ఉదకమును నా చేతిలోకి అర్పించెను. అంతలోనే నేను ఉగ్రరూపమును దాల్చి భూలోకమున పాదములు, భువర్లోకమున మోకాళ్ళు, సువర్లోకమున నడుమును, మహర్లోకమున ఉదరమును, జన లోకమున హృదయమును, తపోలోకమున కంఠమును, సత్య లోకమున ముఖమును, ఆపైన నా శిరమును ఉంచితిని. అపుడు సూర్యచంద్రులు, గ్రహములు, నక్షత్రములు, ఇంద్రాదిదేవతలు, నాగ, యక్ష, గంధర్వులు వివిధములైన వేద సూక్తములతో నన్ను స్తుతించుచుండిరి. బలిని చేత పట్టుకొని మూడు లోకములను మూడు పాదములతో నింపి బలిమహారాజును రసాతలమునకు పంపితిని. బలి వినయముతో తల వొంచి నన్ను ఆరాధించగా నేను ప్రసన్నుడనై ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నా ఒక మూర్తి బలిని ఆశ్రయించి ఉండునని వరమిచ్చితిని. రెండవ మూర్తి క్షీరసాగర మధ్యమున ఆదిశేషుని శయ్యపై కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శయనించి ఉండును. ఈ విధంగా ఈ నాలుగు మాసములు ధర్మాత్ములైన వారు చాతుర్మాస్య వ్రతమును ఆచరించినచో పరమగతిని పొందుదురు. కావున ప్రతి ఒక్కరూ ఈ శయన ఏకాదశి వ్రతమును అనగా చాతుర్మాస్య వ్రతమును ఆచరించవలెనని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో పలికెను.

ఈ ఏకాదశి నాడు శంఖ, చక్ర, గదాధరుడ యిన శ్రీమన్నారాయణుడు క్షీర సాగరమున ఆదిశేషుడిపై శయనించి ఉండును కావున ఆయననను భక్తితో పూజించి ఆనాటి రాత్రి జాగరణ చేయవలెను. ఈ విధముగా ఉపవాసము, జాగరణ చేసి నారాయణుని పూజించిన వారికి పుణ్యం ఎంతో బ్రహ్మ కూడా లెక్కించజాలడు. ఈవిధంగా శయన ఏకాదశి వ్రతమును ఆచరించిన వారు సకల పాపములను హరించుకుని భక్తిని, ముక్తిని పొందుదురు. ఈ వ్రతమును ఆచరించెడి వారు ఎవరైనా జాతి, వర్ణ, లింగ, వయో భేధముతో నిమత్తిము లేకుండా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ప్రతి దినము భక్తితో వ్రతముతో మోదుగు ఆకులో దీపమును అర్పించినచో స్వామికి ప్రీతిపాత్రులగుదురు. శ్రీ హరి శయనించిన ఈ నాలుగు నెలలు నరులు నేలపై పరుండవలెను. శ్రావణమాసంలో శాకము, భాద్రపదమున పెరుగును, ఆశ్వయుజమున పాలను, కార్తీకమున పప్పులను విడిచిపెట్టవలెను. ఈ నాలుగు మాసములు బ్రహ్మచర్యంతో ఒక పూట మాత్రమే భుజించవలెను. కోపమును, లోభమును, నిందను, ఆశను, యాచనను విడిచిపెట్టిన వారు పరమపదమును పొందును. ఈ విధంగా శయన ఏకాదశి వ్రతముతో మానవుడు సకల పాపములను నాశనం చేసుకొనును. శయన ఏకాదశి, బోధని (కార్తీక) ఏకాదశి మధ్యనున్న కృష్ణ పక్ష ఏకాదశులలో మాత్రమే ఉపవశించవలెను. ఇతర కృష్ణ పక్ష ఏకాదశులలో ఉపవసించరాదు.

ఈ శయన ఏకాదశి వృత్తాంతాన్ని విన్నవారు, చెప్పినవారు, చదివి న వారు సకల పాపములను పోనాడి అశ్వమేధ యజ్ఞ ఫలమును పొందును. ఈవిధంగా శ్రీకృష్ణుడు రాజశ్రేష్ఠుడైన ధర్మరాజుకు శయన ఏకాదశి వృత్తాంతము, ఆచరించు విధానము మరియు ఫలమును వివరించెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement