Thursday, April 25, 2024

ధర్మం – మర్మం : తపస్సు (ఆడియోతో…)

శివపురాణం ఉమాసంహిత 20వ అధ్యాయంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

తపసా దివి మోదంతే ప్రత్యక్షం దేవతాగణా:
ఋషయో మునయశ్చైవ సత్యం జానీహి మద్వచ:
సుదుర్ధరం దురాసాధ్యం సుధురం దురతిక్రమం
తత్సర్వం తపసా సాధ్యం తపో హి దురతి క్రమమ్‌

తపస్సుతోనే దేవతా సమూహము దైవత్వాన్ని పొంది స్వర్గములో దేవతలుగా ఆనందించుచున్నారు. ఋషులు, మునులు కూడా తపస్సు తోటే స్వర్గమున ఆనందాన్ని పొందుతున్నారు. తాను చెప్పిన ఈ మాట సత్యము సత్యము సత్యము అని తపస్సు వల్ల సాధించరానిది లేదు, ధరించలేని దానిని తపస్సుతోనే ధరించవచ్చునని మహా శివుడు చెప్పి ఉన్నాడు.

ఆదిశేషుడు గొప్ప తపమును ఆచరించి ధరింప శక్యం కాని ఇంతటి భూమిని తన వేయి శిరములలో ఒక శిరములోని వేయవ అంశముతో ఆవగింజను వలే ధరిస్తున్నాడు. తపస్సుతో సాధింప శక్యం కాని ఎంతటి కష్ట తరమైన పనిని కూడా సాధించవచ్చును. క్షత్రియుడైన విశ్వామిత్రుడు తపస్సుతోనే బ్రాహ్మణత్వాన్ని పొందగలిగాడు. వశిష్ట మహర్షి కూడా తన దివ్యమైన తప : శక్తితోనే విశ్వామిత్రుని బ్రహ్మాస్త్రమును కూడా నిగ్రహించగలిగెను. హిరణ్యకశ్యపాది రాక్షసులు తపస్సుతోటే పొంద శక్యం కాని వరములను పొంది మూడు లోకముల ఆధిపత్యాన్ని పొందగలిగెను. ఎందరో రాజులైన ధ్రువుడు, అంబరీషుడు, పుండరీ కుడు, పురూరవుడు, మాంధాత, ఇక్ష్వాకువు మొదలగు వారంతా తపస్సు
చేసే కష్ట తరమైన రాజ్యపాలనను ప్రజారంజకముగా చేయగలిగిరి. అన్నిటికంటే బరువైన రాజ్యపాలనను తపస్సుతోటో మోసారు. సావిత్రి దాట శక్యం కాని విధి నిర్ణయాన్ని కూడ తన పాతివ్రత్య తపముతో దాటి తన భర్త ప్రాణాలను తిరిగి పొందగలిగింది. అందుకే అన్నీ తపస్సుతో సాధించవచ్చును. అతిక్రమించలేని వాటిని అన్నింటిని తపస్సుతో అతిక్రమించవచ్చును కాని తపమును దేనితోటి అతిక్రమంచలేము.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement