Thursday, March 28, 2024

ధర్మం మర్మం (ఆడియోతో…)

గణపతి వైశిష్ట్యం గూర్చి డాక్టర్‌ కందాడై రామానుజాచార్యలు వారి వివరణ

గణానాంత్వా గణపతిగుం
హ వామహే కవిమ్‌ కవీనామ్‌

అని గణపతిని వివరిస్తుంది వేద మంత్రం. గణపతి అన్న శబ్దమునకు గణములకు అధిపతి అని చాలా విశిష్టమైన అర్థం ఉంది. గణము అనగా సమూహము. విశాలమైన ఈ ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల గణములు ఉన్నాయి. శరీరంలో కాళ్ళు, చేతులు, శిరస్సు, కనులు, చెవులు మొదలగు అవయవ గణములు ఉన్నాయి, ఆ అవయములకు అధిపతి శరీరమే కావున మొదటి గణపతి శరీరం.

శరీరంలో ఉన్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అనే 10 ఇంద్రియ గణములకు అధిపతి మనసు. అందుకే మరో గణపతి మనసు. మనస్సుతో కలసి ఉన్న ఇంద్రియ గణమునకు అధిపతి బుద్ధి. అందువల్ల ఇంకో గణపతి బుద్ధి. ఇక మన శరీరంలో అనేకమైన నాడులలో అధిపతి సుషుమ్న నాడే కావున మరో గణపతి సుషుమ్న నాడి. శరీరంలో ఉన్న అన్ని ఎముకలకు అధిపతి వెన్నెముక. అన్ని ఎముకలు వెన్నెముకతో కలిసి ఉండి పని చేస్తాయి. ఏ అవయవానికి ఆ అవయవం ఎముకలు వేరుగా ఉన్నా ఒక వెన్నెముక పని చేయకుంటే ఏ అవయవాలు పని చేయవు. అందుకే మరో గణపతి వెన్నెముక.

ఇంటిలో కుటుంబానికి యజమాని గణపతి. అలాగే గ్రామానికి గ్రామ పతి, రాష్ట్రాధిపతి, దేశాధిపతి, ప్రపంచాధిపతి అందరూ గణపతులే. వీరందరూ జీవులు, ఈ అన్ని జీవాత్మలకు అధిపతి పరమాత్మ, ఆయనే అసలైన గణపతి. అందరినీ శాసించే వాడు అందరికీ దారి చూపేవాడు, అందరి హితాన్ని ప్రియాన్ని కలిగించే వాడు పరమాత్మ. మనం ‘గణాంనాంత్వా’ అనే మంత్రంతో ధ్యానించేది ఆ పరమాత్మనే. నిజమైన గణపతి పరమాత్మే. నిజమైన అధిపతి అంటే నాయకుడు, పరిపాలకుడు. ఆయన ఫలమును తాననుభవించాలని కోరుకోడు, అనుభవించడు కూడా, అందరికీ సమానంగా పంచుతాడు, అందరి చేత అనుభవింప చేస్తాడు. నాయకుడు అనుభవించడం మొదలు పెడితే ఇక సేవకులకు మిగిలేది ఏమి ఉండదు. అందుకే అధిపతి అయిన పరమాత్మ దేన్నీ అనుభివించడు అని ‘అనశ్నన్‌ అన్య: అభిచాక శీతి’ అని పరమాత్మ తాను దేన్ని అనుభవించకుండా అనుభవించే వారి కంటే అధికంగా ప్రకాశిస్తాడు. నిజమైన కాంతి, తేజస్సు, సిద్ధి, బుద్ధి, బలము, శక్తి ప్రభావము స్వార్థం లేని వారికే ఉంటాయి. అంటే స్వార్థం లేనివాడే నిజమైన గణపతి అనే విశాలమైన అర్థము గణపతి శబ్దానికి ఉంది. అయినా అందరూ పామరులు పండితులు గృహస్థులు, వానప్రస్థులు, లౌకికులు, వైదికులు కూడా ఇంతటి విశాలమైన పరమార్థాన్ని తెలుసుకొని నలుగురికి తెలిపి ఆరాధించ లేరు, కావున పరమాత్మ అందరూ సులభంగా అర్థం చేసుకొని ఆరాధించి ఫలితం పొందడానికి ఒక గణపతిని ఏర్పరిచారు. దాని కోసమే పరమాత్మ గణపతి అవతారాన్ని ఆ వైభవాన్ని అందించారు.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement