Friday, March 29, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : పెద్దశేషవాహన సేవ (ఆడియోతో…)

పెద్దశేష వాహన సేవ ఆంతర్యం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజార్యుల వారి వివరణ

ధ్వజారోహణం జరిగిన నాటి సాయంత్రం మలయప్ప స్వామిని పెద్ద శేష వాహనం పై నాలుగు మాడ వీధులలో అంగరంగ వైభవంగా సకల పరిజన పరిచ్ఛదముగా తాళ, నృత్య, వాద్య, సంగీత, గాన సంరంభంతో, వేద పండితుల వేద ఘోషలతో, దివ్య ప్రబంధ అధ్యాపకుల ప్రబందాధ్యాయముతో పాటు భక్తుల కోలాహలం మధ్యన స్వామి ఊరేగుతారు.

పెద్దశేష వాహనం అనగా ఆదిశేషుడే. ఆదిశేషుడనగా ఆది – మొదటి, శేషుడు – సేవకుడు అనగా మొదటి సేవకుడు అని అర్థం. శ్రీమన్నారాయణునికి నిరంతరం వెంట ఉండి అతనికి కావాల్సిన సేవలు అన్నీ తానే అయ్యి చేస్తాడు ఆదిశేషుడు. స్వామి నివసించడానికి తానే ఇల్లుగా, పడుకోవడానికి శయ్యగా, కూర్చోవడానికి సింహాసనంగా, నడవడానికి పాదుకలుగా, తలకింద తలగడగా, చలివేస్తే దుప్పటిగా, వర్షం మరియు ఎండ వస్తే గొడుగుగా ఇలా స్వామికి ఎప్పుడు ఏ సేవ కావాలన్నా తానే ఆ పరికరముగా మారి సేవ చేస్తాడు కావున ‘ఆదిశేషుడు’ అని పిలువబడతాడు. అందుకే మొదటి వాహన భాగ్యం ఆదిశేషుడికే స్వామి కల్పించాడు. ఈ విధంగా సేవలు చేయడమే కాకుండా స్వామి ఏ రూపంలో ఉన్నా తాను కూడా అతనికి తగిన రూపంలో ఉంటూ వెంట అవతరిస్తాడు.

ఆదిశేషుడు తన వేయి శిరములలో ఒక శిరములోని ఒక చిన్న భాగంలో అఖిలాండ కోటి బ్రహ్మాండములను సిద్ధార్థ (ఆవగింజ) రూపంలో ధరిస్తాడు. ఇంత బ్రహ్మాండమును ఒక ఆవగింజలా ధరించే మహాబలుడు ఆదిశేషుడు. అతనికి కాస్త తల భారంగా అనిపించినపుడు అనగా భూమిపై నివసించే ప్రాణులు సహించరాని పాపములను చేసినపుడు పాపాల భారం మోయలేనని కొంచెం తల కదలిస్తాడు. ఏ ప్రాంతంలో ఆదిశేషుని తల కదిలితే ఆ ప్రాంతంలో భూకంపం సంభవిస్తుంది. ఈ విధంగా ఆది శేషుడు మొదట సకల జగత్తుకు ఆధారం. శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించినపుడు ఆదిశేషుడు లక్ష్మణస్వామిగా వచ్చాడు. తమ్ముడిగా సేవ చేసిన ఫలితంగా కృష్ణావతారంలో అన్నగా అవతరించమని ఆదేశిస్తే కృష్ణునికి అన్నగా బలరామునిగా అవతరించాడు. కలియుగంలో వ్యాకరణ శాస్త్రం తెలియక అంటే మాట్లాడలేక ఇబ్బంది పడుతున్న జనుల కోసం పాణిని మహర్షి రచించిన ‘ అష్టాధ్యాయి’ సూత్రములకు వ్యాఖ్యానం చేయడానికి ‘పతంజలి’గా అవతరించి మహాభాష్యం రాసి వాక్‌ శుద్ధిని చేశాడు. ఈ పతంజలే యోగ భాష్యం రాసి మన:శుద్ధిని, వైద్యశాస్త్రంలో భాష్యం రాసి శరీర శుద్ధిని చేశారు. తరువాత చాలా కాలానికి భగవద్రామానుజులుగా అవతరించి బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానమును చేసి ‘శ్రీభాష్యం’ అను పేరుతో అందించారు. ఇంతటి దివ్యమైన సేవ చేసిన మహానుభావుడు కావున మలయప్ప స్వామి మొదటి వాహన సేవా భాగ్యాన్ని ఆదిశేషునికి ఇచ్చారు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు,
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement