Friday, March 29, 2024

టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై విచారణ

కౌంటర్‌ దాఖలుకు గడువిస్తూ 17కి వాయిదా
అమరావతి, ఆంధ్రప్రభ :
తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రత్యేక ఆహ్వాని తుల నియామకంపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ అంశంపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు టీ-టీ-డీ గడువునివ్వాలని కోరగా.. తదుపరి విచారణను నవంబర్‌ 17కి వాయిదా వేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం, జీవోల అమలును నిలుపుదల చేస్తూ సెప్టెంబర్‌ 22న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా మరోసారి విచారణకు రాగా.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, టీటీడీని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా టీటీడీ సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఎస్‌. సత్యనారాయణ ప్రసాద్‌ కౌంటర్‌ దాఖలుకు గడువు కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement