Thursday, April 25, 2024

చిత్రాతి చిత్రం త్రిశంకు స్వర్గ సృష్టి

తంత్ర మంత్ర, యంత్ర యుగాలు ఒకదాని తరువాత ఒకటి పునరావృతం అవుతాయి. శ్రీరామాయ ణం, మహాభారతం, భాగవత కాలాలు తంత్ర, మంత్ర యుగాలు గా పేర్కొనవచ్చు. ప్రస్తుత కలియుగాన్ని యంత్ర యుగముగా భావించవచ్చు. పుష్పక విమానాలు, బ్రహ్మ, పాశుపత, వరుణ, ఆగ్నేయ ఇత్యాది భయంకరమైన అస్త్రాలు సృష్టించిన అద్భుతాలు, బీభత్సాలు మనకు విదితము.
అణ్వస్త్రాలు, అంతరిక్ష యానము, అవయవ మార్పిడులు, క్లోనింగ్‌ జీవము, కృత్రిమ గర్భధారణ, గర్భ మార్పిడులు, పరీక్ష నాళికలో పిండోత్పత్తి, భూగోళమును ఆవరించిన అంతర్జాల అదృ శ్య తరంగ వాహిని మొదలైనవి పరిశీలిస్తే మంత్ర యుగములో ఉప యోగించిన వాటికి మరో రూప క్రియలేనని గ్రహించవచ్చు. దేవ తలు ఆకాశము నుండి పుష్ప వృష్టి కురిపించుట, నారద మహర్షి ఆకాశ యానము చేసి ముల్లోకములను సందర్శించుట, సంజయు డు తన దివ్య దృష్టితో కురుక్షేత్ర సంగ్రామమును ప్రత్యక్ష ప్రసార ముగా అంధుడైన ధృతరాష్ట్రునకు వివరించుట, నేతి కుండల నుం డి కౌరవులు జనించుట మొదలైనవి మంత్ర యుగమునందు జరి గిన అద్భుతములని అంగీకరించక తప్పదు. అంతరిక్షమునందు శూన్య స్థితి ప్రభావము వలన మనుషులు తేలియాడుట మనం చూస్తున్నాము. అదేవిధమున దేవతలు, నారద మహర్షి ఆకాశము లో సంచరించుట ఆశ్చర్యమేమున్నది. ఈవిధముగా సకారాత్మ భావన చేసిన నేటి మానవునికి ఇంకా అనేక అద్భుత భావనలు జనించి మానవజాతి ప్రయోజనమునకు దోహదపడవచ్చు.
ఏ యుగములోనైనా సృష్టికి విరుద్ధముగా ప్రవర్తించిన అనేక అనర్థములకు గురికావడము జరుగుతుంది. మనుగడకు ఉప యోగపడని శాస్త్ర జ్ఞానము, శ్రమ అభిలషనీయము కాదు. అటు వంటి ఒక విచిత్ర ఉదంతమే త్రిశంకు స్వర్గ సృష్టి.
కుశనాభుని మనుమడు, గాధి కుమారుడు అయిన విశ్వా మిత్రుడు ఒక ధార్మికుడైన క్షత్రియుడు. తన రాజ్యాన్ని ఎంతో ఉన్న తంగా పరిపాలించేవాడు. కాని అనర్థదాయకమైన అసూయ, ద్వేషాలకు లొంగి జీవితంలో తీవ్ర ఘర్షణకు లోనయినాడు. అపా రమైన సైన్యముతో భూమండల యాత్రకు బయలుదేరిన విశ్వా మిత్రుడు బ్రహ్మ నిష్టాగరిష్టుడు, తపోధనుడు అయిన బ్రహ్మర్షి వశిష్టుని ఆశ్రమానికి వచ్చాడు. అత్యంత రమణీయమైన, మహి మాన్వితమైన వశిష్టుని ఆశ్రమానికి అనిర్వచనీయమైన శోభతో అలరారుచున్నది. బ్రహ్మర్షి వశిష్టుడు విశ్వామిత్రుణ్ణి అత్యంత ప్రేమతో, ఆప్యాయతతో స్వాగత సత్కారాలు చేసి ఆశ్రమంలోకి ఆహ్వానించాడు. వారిరువురు అనేక ధార్మిక విషయాల మీద చర్చిం చుకొన్నారు. మరికొన్ని రోజులు తన అతిథిగానుండమని కోరాడు విశ్వామిత్రుని. తన పరివారాన్ని మరికొంత కాలం పోషించడం వశిష్టునకు భారంగా మారుతుందని భావిస్తూనే మాట కాదనలేక అంగీకరించాడు.
కానీ ఆశ్చర్యంగా వశిష్టుని కామధేనువైన శబల తన సమస్త పరివారానికి అత్యంత మధురమైన పంచభక్ష్య పరమాన్నాలు, రక రకాల మధుర పానీయాలు బంగారు పాత్రలలో సృష్టించి గొప్ప మధురానుభూతికి గురిచేసింది. శబలను చూసిన విశ్వామిత్రునికి అసూయ జనించింది. ఎలాగయినా శబలను వశపరచుకోవాలని నిశ్చయించుకున్నాడు. వేలాది గోవులను, అనేక మణుగుల సువర్ణ మును ఆశ చూపించి శబలను తనకిమ్మని వత్తిడి చేసాడు.
కానీ కామధేనువు తన బహిప్రాణమని తన యజ్ఞాలకు కావల సిన సమస్త సంబారాలను తనకు సమకూరుస్తుందని, కావున శబలను ఇవ్వడం సాధ్యంకాదని ఖచ్చితంగా తెలియచేసాడు వశి ష్టుడు. అసూయతో రగిలిపోతున్న విశ్వామిత్రునిలో క్రోధం ప్రవే శించింది. వశిష్టుని తిరస్కారానికి కోపోద్రిక్తుడైన విశ్వామిత్రుడు శబలను బలవంతంగా తీసుకురమ్మని సైన్యానికి ఆదేశించాడు. తరువాత వశిష్ట విశ్వామిత్రుల మధ్య భయంకర యుద్ధం జరగ డం, చివరకు విశ్వామిత్రుడు బ్రహ్మశక్తి ముందు తన ఓటమిని అంగీకరించి తను కూడా బ్రహ్మర్షిగా మారడానికి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి ముందు రాజర్షిగా గుర్తింప బడ్డాడు. కానీ మరలా ఘోరమైన తపమాచరించి బ్రహ్మదేవ ునిచే బ్రహ్మర్షిగా ఆమోదింపబడినాడు. కానీ తన అహంకారము సంతృప్తి చెందక వశిష్టుని చేత తన బ్రహ్మర్షిత్వాన్ని అంగీకరింప చేయాలని పట్టుబట్టాడు. చివరకు సత్త్వగుణ సంపన్నుడైన వశిష్ట మహర్షి దేవతల విజ్ఞప్తి మేరకు విశ్వామిత్రుని బ్రహ్మర్షిగా గుర్తిం చాడు. ఆ ఘర్షణ అప్పటితో సమసిపోయి ఇరువురూ మిత్రులైనా రు. అయితే ఈ రాజర్షి, బ్రహ్మర్షి ప్రస్థానంలో విశ్వామిత్రుడు అనేక చిత్రాతి చిత్రమైన ఘనకార్యాలు చేసాడు. అందులో త్రిశంకు స్వర్గా న్ని సృష్టించడం ఒకటి.
ఇక్ష్వాకు వంశజుడైన త్రిశంకుడనే రాజు అయోధ్యను పరిపా లించేవాడు. సశరీరంగా స్వర్గాన్ని చేరాలని అతని కోరిక. యజ్ఞం నిర్వహించి తనను స్వర్గానికి చేర్చాలని గురువు వశిష్టుని కోరాడు. అది నీకు సాధ్యంకాదని నిరాకరించాడు వశిష్టుడు. పట్టువదలని త్రిశంకు వశిష్టుని కుమారులను ఆశ్రయించాడు. తండ్రి నిరాకరిం చిన విషయం తెలుసుకున్న నూరుగురు వశిష్ట కుమారులు గురు వును ధిక్కరించి తమవద్దకు రావడాన్ని సహించలేక త్రిశంకును తీవ్రంగా మందలించారు. వారిని కూడా ధిక్కరించి, మీకంటే యో గ్యులు నాకు దొరకకపోరు అని పరుషంగా పలికి తిరిగి వస్తున్న త్రిశంకును చండాలునగా మారమని శపించారు వశిష్ట పుత్రులు.
అప్పటికి రాజర్షిగా గుర్తింపబడిన విశ్వామిత్రుని ఆశ్రయిం చాడు త్రిశంకు. వశిష్టుడు, అతని కుమారులు తిరస్కరించారని తెలుసుకున్న విశ్వామిత్రుడు త్రిశంకును చేరదీసాడు. త్రిశంకు యోగ్యతను విశ్లేషించడం ప్రక్కనబెట్టి కేవలం వశిష్టుని మీదవున్న అసూయ వలన త్రిశంకును స్వర్గానికి పంపి అధిపతిగా చేస్తానని ప్రకటించాడు. అవసరమైన యజ్ఞానికి సమాయత్తం చేసాడు. యజ్ఞానికి రావడానికి తిరస్కరించిన వశిష్ట కుమారులను, మహో దయుడు అను ఋషిని తీవ్రముగా శపించాడు. మిగిలిన ఋషులు విశ్వా మిత్రునికి భయపడి త్రిశంకు స్వర్గారోహణకు యజ్ఞం చేయ సాగారు. విశ్వామితుని రాజర్షి బలంతో త్రిశంకు స్వర్గానికి సశరీరం గా ప్రయాణించి స్వర్గ ద్వారాన్ని చేరాడు. గురు తిరస్కార దోషంతో త్రిశంకు స్వర్గాన్ని చేరే యోగ్యత కోల్పోయాడని తిరస్కరించిన ఇం ద్రుడు తన బలంతో అతనిని భూమి వైపు తలక్రిందులుగా పడేటట్లు చేసాడు. తనను రక్షించమని గగ్గోలు పెడు తూ భూమిని సమీపిస్తు న్న త్రిశంకుకు నక్షత్ర మండలంతో సహా ఒక స్వర్గాన్ని సృష్టించి అక్కడ ఆగమని గర్జించాడు విశ్వామిత్రుడు.
ఆ త్రిశంకు స్వర్గాన్ని చూసిన దేవగణం అమితాశ్చర్యానికి గురయినారు. తిరిగి ఎక్కడ తపస్సుకు దిగుతాడోనని విశ్వామిత్రు నికి భయపడి, సృష్టికి విరుద్ధమైనా త్రిశంకు స్వర్గాన్ని ఆమోదిం చారు. రాజర్షి విశ్వామిత్రుని అహంవల్ల, త్రిశంకు యొక్క మూర్ఖ కోరికల వల్ల అటు ఇటుగాని అయోమయ స్థితిలో స్వర్గంల్లాంటి విచిత్ర స్థితిలో త్రిశంకు తలక్రిందులుగా వ్రేలాడసాగాడు. అతని కోరిక ఒక చిత్రమైన అంశంగా పౌరాణిక చరిత్రలో నిలిచిపోయింది. అయితే అటువంటి త్రిశంకు స్వర్గాన్ని మరలా ఎవరూ కోరుకోలేదు.


– వారణాశి వెంకట
సూర్య కామేశ్వరరావు
80746 66269

Advertisement

తాజా వార్తలు

Advertisement