Wednesday, April 17, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 12, శ్లోకం 15

15.
యస్మాన్నోద్విజతే లోకో
లోకాన్నోద్విజతే చ య: |
హర్షామర్షభయోద్వేగ్వై:
ముక్తోయస్స చ మే ప్రియ: ||

తాత్పర్యము : ఎవ్వరికినీ కష్టము కలిగించనివాడును, ఎవరిచేతను కలతకు గురికానివాడును, సుఖదు:ఖములందును మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు.

భాష్యము : శుద్ధ భక్తుని మరిన్ని లక్షణాలు ఇక్కడ వివరించడం జరిగినది. అటువంటి భక్తుడు ఎప్పుడూ ఎవరినీ కష్టపెట్టుగాని, ఆందోళనకు గురిచేయుట గాని, భయపెట్టుటగాని, అసంతృప్తి పరచుట గాని చేయడు. భక్తుడు సహజముగానే అందరి పట్ల కరుణను కలిగి ఉంటాడు కాబట్టి ఎవరికీ ఆందోళన కలిగే విధముగా ప్రవర్తించడు. అలాగే వేరేవారు అతడికి ఆందోళన కలిగించినా అతడు చలించడు. కృష్ణుని కృపవలన బాహ్య పరిస్థితులకు ప్రభావితము కాకుండా జీవించటం నేర్చుకుంటాడు. కృష్ణ చైతన్యములో ని మగ్నుడగుట వలన దీనిని సాధించగలుగుతాడు. సహజముగా భౌతికవాది తన ఇంద్రియ తృప్తికి అవకాశము ఉన్నచో ఆనందించుట, తనకు లేక వేరేవారికి ఉన్నచో బాధపడుట అలాగే శత్రువు తనపై ప్రతీకారము తీర్చుకుంటాడని భయపడుట, తాను పనిని సక్రమంగా నెరవేర్చలేకపోయినపుడు కృంగిపోవుట జరుగుచుండును. వీట న్నింటికీ అతీతుడుగా ఉండే భక్తుడు శ్రీ కృష్ణునికి చాలా ప్రియుడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement