Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 12, శ్లోకం 12

12.
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్‌
జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్‌ కర్మఫలత్యాగ:
త్యాగాత్‌ శాంతిరనంతరమ్‌ ||
తాత్పర్యము : ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞానసముపార్జనమునందు నియుక్తుడవగుము. అయినప్పటికినీ జ్ఞానము కన్నను ధ్యానము మేలైనది. కాని త్యాగము వలన మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుటచే సర్వకర్మఫల త్యాగము ఆ ధ్యానముకన్నను మేలితరమైనట్టిది.

భాష్యము : అంతిమ లక్ష్యమైన శ్రీకృష్ణున్ని చేరుకొనుటకు రెండు మార్గాలు సూచించబడినవి. మొదటిది : శ్రీ కృష్ణున్ని ప్రేమించి సేవించుట. ఇది చేయలేని వారికి రెండువది. పరోక్షముగా అనగా త్యాగము, జ్ఞానము, ధ్యానము ద్వారా చివరకు భగవత్ప్రాప్తి పొందుట. అయితే కృష్ణుడు అర్జునునికి ప్రత్యక్ష మార్గమే సూచించెను. అది చేయలేని వారికి రెండవది కూడా మంచిదే. వారు తమ కర్మానుసారము వచ్చిన దానిని త్యాగము చేయుట ద్వారా జ్ఞానవంతులై, పరమాత్మ లేదా బ్రహ్మమును ధ్యానించవచ్చును. అలా చివరికి దేవాది దేవుణ్ణి అర్థము చేసుకొనవచ్చును. అయితే భగవద్గీత ప్రకారము ప్రత్యక్ష మార్గమే సూచించబడినది. కాబట్టి ప్రతిఒక్కరూ భగవంతునికి శరణుపొంది ప్రత్యక్ష మార్గాన్నే స్వీకరించుట ఉత్తమము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …

Advertisement

తాజా వార్తలు

Advertisement