Friday, March 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 56
56.
సర్వకర్మాణ్యపి సదా
కుర్వాణో మద్వ్యపాశ్రయ: |
మత్ప్రసాదాదవాప్నోతి
శాశ్వతం పదమవ్యయమ్‌ ||

తాత్పర్యము : అన్ని రకములైన కర్మల యందు నియుక్తుడైనను నా శుద్ధ భక్తుడు నా రక్షణలో నిలిచి శాశ్వతమును, అవ్యయమును అగు పదమును నా అనుగ్రహముచే పొందగలడు.

భాష్యము : ఈ శ్లోకమున ‘మృద్‌-వ్యపాశ్రయ:’ అనగా భగవంతుణ్ని ఆశ్రయించిన వారు, ఆయన రక్షణను స్వీకరించిన వారు, అని అర్థము. భౌతిక కల్మషములు నుండి దూరము కావలెనన్న భగవంతుని ఆదేశానుసారము లేదా అతని ప్రతినిధియైన గురువు ఆదేశానుసారము జీవించవలసి ఉంటుంది. అటువంటి భక్తుడు నిరంతరమూ భగవంతుని ఆధ్వర్యములో ఆయన సేవలో నిమగ్నమై ఉంటాడు. భగవంతుడు కూడా అటువంటి భక్తుని పట్ల ఎంతో దయకలిగి ఉంటాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా అటువంటి భక్తుడు భగవంతుని లోకమైన కృష్ణ లోకానికి తప్పక చేర్చబడతాడు. ఈ విషయమున ఎటువంటి సందేహమూ లేదు. ఆ ధామము సంపూర్ణ జ్ఞానముతో, ఎటువంటి మార్పు చేర్పులకు గురికాకుండా, ఎప్పటికీ తరిగిపోని సంపదలను కూడి శాశ్వతముగా విరాజిల్లుతూ ఉంటుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement