Saturday, April 20, 2024

కరుణించి బ్రోచే తండ్రీ…

99. బొంకనివాడె యోగ్యు, డరి బృందము లెత్తినచోట చివ్వకున్‌
జంకనివాడె జోదు, రభసంబున నర్థికరంబు సాచినన్‌
గొంకనివాడె దాత, మిము కొల్చి భజించినవాడె పోనిరా
తంక మనస్కుడెన్నగను, దాశరథీ! కరుణాపయోనిధీ!

తాత్పర్యం: ఓ దశరథ నందనా! నిజ జీవితంలో అసత్యమాడని వాడే యోగ్యుడు. శత్రుసేనలు దండెత్తి వచ్చినపుడు యుద్ధభూమిలో జంకక ఎదురు నిల్చినవాడే యోధాగ్రణి. అవసరం వచ్చి దాన మడిగిన వానికి సందేహించకుండా దానం చేసినవాడే నిజమైన దాత. శ్రీరాముని సేవించి కొలిచినవాడే స్వచ్ఛమైన మనస్సు గలవాడు
విశేషం: సమాజంలోని భిన్న మనస్తత్వాలను గోపన్న ఉదాహ రించాడు. రాముడు సత్యవాక్పరి పాలకుడు. శరణాగతత్రాణ. అట్టి రాముని గుణగణాలను పుణికి పుచ్చుకున్న భక్తుడు నిర్మల మనస్సు తో భగవంతుని సేవించగలగాలి. అప్పుడే ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది.

డాక్టర్‌ రేవూరు అనంతపద్మనాభరావు
98665 86805

Advertisement

తాజా వార్తలు

Advertisement