Friday, April 19, 2024

ఏడుకొండలపై మూడోసారి ఏకాంత బ్రహ్మోత్సవం

తిరుపతి, ప్రభన్యూస్‌ బ్యూరో రాయలసీమ: అఖిలాండకోటి బ్రహ్మాండనాయ కుడు కొలువైన తిరుమలక్షేత్రం వరుసగా మూడవసారి ఏకాంత బ్రహ్మోత్సవాలకు సన్నద్ధమైంది. కరోనా కారణంగా గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలను భక్తులు ఆన్‌లైన్‌లోనే తిలకించాల్సి ఉంటుంది. ఆలయ ప్రాంగ ణంలో ఏకాంతంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు ఈ నెల 7వ తేదీన ధ్వజారోహణం జరగనుంది. ఆ రోజున పట్టువస్త్రాలను సమర్పించడానికి రావాల్సిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11వ తేదీన గరుడసేవ రోజున తిరుమలకు రావడం ద్వారా మళ్లి పాత విధానానికి శ్రీకారం చుట్టినట్టవుతోంది.
కలియుగ ప్రత్యక్షదైవంగా ప్రపంచవ్యాప్తంగా భక్తుల పూజలందుకునే తిరు మల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోడానికి రెండేళ్లక్రితం వరకు రోజుకు సగటున 80 వేల మంది భక్తులు వచ్చేవారు. అదే ఏడాదిలో ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలలో స్వామి వారిని తిలకించి తరించడానికి సగటున లక్ష మంది భక్తులు వస్తుంటారు. 2020 ఆరంభం నుంచి ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తున్న కరోనా మహ మ్మారి ప్రభావం తిరుమల క్షేత్రంపై కూడా పడింది. 2020 మార్చి నెలాఖరు నుంచి తిరుమలేశుని భక్తులు కనులారా దర్శించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి దాదాపు 90 రోజులపాటు స్వామివారికి నిత్య సేవా కైంకర్యాలన్నీ ఏకాం తంగా నిర్వహించాల్సి వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌ – అక్టోబర్‌ నెలల మధ్యకా లంలో రోజుకు పదులు, వందల సంఖ్యలలో భక్తులను అంచెలంచెలుగా అనుమ తించడంతో మొదలైన విధానంలో ప్రస్తుతం రోజుకు నిర్దేశిత పద్ధతిలో 25 వేల మందిని అనుమతించే వాతావరణం ఏర్పడింది. దాదాపు ఏడాదిన్నరకాలంలో తిరుమలేశునికి నిర్వహించే వివిధ రకాల ఆర్జిత సేవా వైభవాన్ని సామాన్య భక్తులు ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి వీలుకాని పరిస్థితులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
ఈసారీ ఎస్వీబీసీలోనే తిలకించాలి..
ఈ నేపథ్యంలోనే 2020లో అధికమాసం కారణంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో రెండుసార్లు ఏకాంతంగానే జరిగిన తిరుమలేశుని బ్రహ్మోత్సవాలను భక్తులు ప్రత్యక్షంగా తిలకించలేకపోయారు. ఇక కరోనా భయం పూర్తిగా వీడకపోవడంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగానే నిర్వహిం చాల్సి వస్తోంది. ఈ నెల 7వ తేదీ ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల వాహన సేవలను ఆలయ ప్రాంగణంలోనే నిర్వహిం చనున్నారు. 7వ తేదీన ఆలయ ప్రాంగ ణంలోని ధ్వజస్తంభం వద్ద నిర్వహించే ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్స వాలు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను తిలకించిన విధంగానే సామాన్య భక్తులు ఈసారి కూడా శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌ ప్రత్యక్ష ప్రసారాల ద్వారానే దర్శించి తరించాల్సి ఉంటుంది.
మారిన సంప్రదాయం..
దాదాపు 20 ఏళ్లుగా ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించే విధానం ఈసారి గరుడసేవ రోజుకు మార నుంది. 80వ దశకానికి ముందు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు బ్రహ్మోత్స వాల సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించే ఆనవాయితీ కొనసాగింది. 1983లో రాష్ట్రాధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్‌.టి. రామారావు భద్రాచలక్షేత్రం తరహాలో గరుడసేవ రోజున ముఖ్యమంత్రి పట్టువస్త్రా లను సమర్పించే ఆనవాయితీని ప్రారంభించారు. 2003 వరకు ఆ ఆనవాయితీ కొనసాగింది. 2004లో గరుడసేవ రోజున ముఖ్యమంత్రి రావడం వల్ల సామాన్య భక్తులకు ఇబ్బందిగా ఉంటోందనే వినతులకు స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ధ్వజారోహణం రోజున పట్టువస్త్రాలను సమర్పించే ఆనవా యితీని ప్రారంభించారు. ఆ విధానం గత ఏడాది వరకు కొనసాగింది. కాగా ఈ ఏడాది ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11వ తేదీన గరు డసేవ రోజున స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడానికి రానున్నారని టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి ప్రకటించారు. దీంతో 2004లో తండ్రి రాజశేఖరరెడ్డి హయాంలో మొదలైన ధ్వజారోహణం రోజున పట్టువస్త్రాలను సమర్పించే ఆనవాయితీ కుమారుడైన జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పాతపద్ధతికి మారినట్టవుతోంది. మొత్తం మీద కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా తిరు మలేశుని బ్రహ్మోత్సవ వైభవాన్ని సామాన్యభక్తులు దర్శించుకోడానికి వీలుకాని దుస్థితి వరుసగా మూడవసారి ఏర్పడినట్టవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement