Friday, March 29, 2024

ఆంజనేయం మహావీరం!

అంత కాల రఘు బర పుర జా ఈ|
జహాఁ జన్మ హరి భక్త కహా ఈ||

పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు. హరి అంటే విష్ణువని, కపి అని అర్థం. హరి భక్తులంటే హనుమ భక్తులని భావన.
పాంచ భౌతిక దేహాన్ని ధరించి హనుమను నమ్మి, పూజించి, సేవించిన వారందరూ, వారి మరణానంతరము రఘువరు పురానికి చేరుకుంటారు. అంటే వైకుంఠమనీ సూచన. నిజానికి, వైకుంఠపురం అంటే హృదయమే! అదే ఆత్మ స్థానం. అది నిజ స్థానం.
జన్మ తీసుకోవడానికి ముందున్న ఆత్మ, ఒక దేహాన్ని ధరించి, హనుమను సేవించి, ఆరాధించి, జ్ఞానశక్తితో జీవించి, ఉన్నదంతా బ్రహ్మమేనన్న భావనలో సంస్థితమై, మేనువ్రాలిన తరువాత, అంటే మరణించగానే తన నిజస్థానమైన మూలంలోకి ప్రవేశించటమే వైకుంఠ ప్రాప్తి. అధ్యాత్మ స్థాయిలో ఇదే సత్యం!
హనుమ వాయునందనుడు. సృష్టినంతా ఆవరించి ఉన్నా, కంటికి కనిపించనిది వాయువు. హనుమ కేవలం వానర జాతికి చెందిన పరిమిత ప్రభావమూర్తి కాదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఆవహించిన వాయు సర్వోత్తముడు హనుమ. ఆ వాయువు, జీవియందు సంచారం చేసే ప్రాణశక్తి. మనోశక్తి. చైతన్యశక్తి. ఆయుశ్శక్తి. జననంతో మొదలై కడదాకా కదిలి కదిలి, జీవిని నడిపించే జీవశక్తి. వాయువు. భూనభోంతర రాళాల నడుమ సచరించే, సంచలించే వాయువు ఒక అనంత శక్తి. ఆ వాయువే హనుమ. అది కాలతీతమైనది. యుగాలకు అతీతమైనది. కనుక వాయువువలె హనుమ చిరంజీవి, సర్వకాలాల బ్రహ్మ!
వాయువుకు గంధ వాహకము అని పేరు. అంటే అన్ని వాసనలను మోసుకువెళ్ళేది అని అర్థం. అందునా దేనినీ అంటించుకోకుండా! ఇది హనుమకు గల అకర్తృత్వ భావన! లోతుగా అర్థం చేసుకోగలిగితే, హనుమ పరోపకారి. తన వలన ఎవరికైనా ఆనందం కలిగితే ఆ ఆనందాన్ని తన ఆనందంగా భావించే జ్ఞాన స్వరూపం, హనుమ!

– వి.యస్‌.ఆర్‌.మూర్తి
9440603499

Advertisement

తాజా వార్తలు

Advertisement