Tuesday, October 26, 2021

సర్వం విష్ణు ఆహారమే!

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నము నుండే జీవం ఉద్భస్తోంది. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు అగ్నిని అందిస్తే దానికి వాయువు తోడయి వర్షరూపంలో జలం మనకు లభిస్తోంది. ఈ ప్రకృతి విన్యాసమంతా ఆకాశంలో జరుగుతోంది. భూమి ఆ జలాన్ని గ్రహించి అన్నమును సృజించి మన కందిస్తోంది. ఏదైనా భూమి నుండే మనం గ్రహిస్తున్నాం. సమస్త జీవకోటికి ఈ పుడమే ఆధారం. భూమి నుండే జనిస్తాయి తిరిగి భూమిలోనే ఐక్యమవుతాయి. ఆహారమైన అన్నం మానవ దేహంలోని పంచ కోశాల్లో ప్రవేశించి తిరిగి ధాతురూపంలో వేరొక క్షేత్రంలో నిక్షిప్తమయి మరొక జీవుని సృష్టిస్తోంది. అదేవిధంగా భూమి నుండి జనించిన ఆహారం నుండే సమ స్త జీవ రాశులు జనిస్తున్నాయి. ఆహారానికి ఆధారం భూమి. ”విశ్వం విష్ణు:” అనే అద్భుత భావనతో ఆలోచనచేస్తే అనంతమైన నక్షత్ర రాశులు, వాటి చుట్టూ పరిభ్రమించే గ్రహరాశులు, ఉపగ్రహాలు సమస్తమూ విష్ణువు యొక్క ఆహారము. మనం నివ సించే భూమి కూడా ఆహారం. ఆకాశమనే మహా ఉదరంలో ఇవన్నీ ఆహార పదార్థాలే! నర్వం విష్ణువు వున్నాడు. సమస్తమూ విష్ణువు ఆహారమే అవుతుంది కదా! అంత పవిత్రమైన ఆహారాన్ని నిర్లక్ష్యం చేయ కూడదు. బ్రహ్మ స్వరూపమైన అన్నము పై జీవులు ఆధారపడి ఉన్నప్పుడు దాని పవిత్రతను కాపాడడం మన బాధ్యత. కాని ప్రస్తుత కాలంలో అన్నం ఎంతో నిర్లక్ష్యానికి గురి అవుతోంది. ఆహారాన్ని సృష్టించే రైతు కూడా నిర్లక్ష్యానికి గురి అవుతున్నాడు. ఆహారానికి వెలకట్టవచ్చునేమో గాని రైతు శ్రమకు వెల కట్టలేము. ఎందువలన అనగా గింజ, పండు, కాయ మొద లగు రూపాలను సృష్టిస్తున్న బ్రహ్మ రైతు. జ్ఞానంతో కర్మనాచరిస్తేనే ఈ సృష్టి జరుగుతోంది. రైతు యొక్క కర్మ ఫలం ఆహారం. ఆహారమును వ్యర్థ పరిస్తే రైతును అవమానపరిచినట్లే! ఆహారాన్ని విస్తారంగా ఉత్పత్తి చేయాలి. ఆ ఉత్పత్తులను నిక్షేపణ చేయాలి. అన్నార్తులకు పంపిణీ చేయాలి. ఆహారమును స్వీకరించేటప్పుడు రైతును స్మరించాలి. మట్టి వాసన మరచిన నాగరికులకు అన్నం ఎక్కడి నుండి వస్తుందో కూడా తెలియని పరిస్థితి. నాటి నుండి నేటి వరకు అసలు సిసలైన వృత్తి ఏదైనా ఉంది అంటే అది వ్యవసాయమే! కాని నేడది చిన్న చూపు చూడబడడం దుర దృష్టకరం. అందుకే విజ్ఞానశాస్త్ర ప్రయోజనాన్ని పూర్తిగా వ్యవసాయం వైపు మళ్ళించాలి. ఆహారము యొక్క విలువను పిల్లలకు విశద పరచాలి. ఏ ఆహార మైనా భగవంతునికి నివేదన చేసి పవిత్రమొనరించిన తరువాతనే స్వీకరించాలి. అప్పుడే అది అమృత తుల్యమవుతుంది. పంచ కోశము లలో పుష్టిని కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితులలో అన్నమును నిందించ కూడదు. ఆహారోత్పత్తికి రైతు, దేశ రక్షణకు సైనికుడు అహర్నిశలు శ్రమి స్తున్నారన్న సంగతి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అప్పుడే మనం ఎలా జీవించాలి అన్న సంగతి బోధపడుతుంది. ఈ ఆధునిక వస్తు ప్రపంచమే శాశ్వతమన్న భ్రమ నుండి బయటపడినప్పుడే అసలు సిసలైన ఆనం దం, ఆరోగ్యం చేరువ అవుతాయి. విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు మానవ జాతి మూలాలను నశింప చేసేవి గా ఉండకూడదు. మానవ జాతి అభివృద్ధి, వికాసానికి శాస్త్రం దోహద పడాలి. ప్రకృతికి అనుగుణంగా శాస్త్రం నడచుకోవాలి. ఆహారాన్ని బహుముఖంగా తైత్తిరీయోపనిషత్తు విశ్లేషణ చేసింది. ప్రాణమే ఆహారం. దేహం ఆహారాన్ని భుజిస్తుంది. దేహంలో ప్రాణం నెలకొని ఉంది. అంటే ఆహారం ఆహరంలోనే నెలకొని ఉంది. ఆహారాన్ని అగ్ని భక్షిస్తుంది. అగ్ని నీటిలో నెలకొని ఉంది. కనుక ఆహారంలో నెలకొని ఉన్నది అగ్ని. ఆహారం కోసం వచ్చిన ఎవరినీ తిరస్కరించకూడదు. అందువల్లనే ఆహారాన్ని విస్తారంగా ఉత్పత్తి చేయాలి. ”ఆహారం సిద్ధంగా ఉన్నది” అన్న నినాదం తో ఏ ప్రదేశము అలరా రుతుందో అదే నిజమైన నాగరికుల భూమి. ఆహా రాన్ని సాత్వికంగా తయారుచేయాలి. శ్రేష్ట మైన ఆహారాన్ని దానం చేసేవారికి ఇహ పరంలో సకల సౌభాగ్యాలు లభి స్తాయి. మనిషిలో ఉన్న వారూ ఆ సూర్యునిలో ఉన్నవారు ఒక్కరేనన్న సత్యాన్ని తెలుసుకున్న వారు ఈ ప్రాపంచిక భావన నుండి విడివడి దేహాత్మ భావనను ఛేదిం చి అతీతులవుతారు. తరువాత వారు కోరిన రూపాన్ని, లోకాన్ని, ఆహారాన్ని పొందుతూ ఆనందంగా కొనసాగు తారు. అప్పుడు నేనే ఆహా రాన్ని అని తెలుసుకుం టారు. భుజించేవాడనూ నేనే, దేవతల కంటే ముందే అమరత్వ స్థితి గలవాడను నేనే, నాకు ఇవ్వకుండా భుజించే వాడిని. భక్షించేది నేనే, సమస్త లోకాలను జయించేది నేనే, అత్యంత ప్రకాశవంతంగా నున్న దేవతను నేనే. అను చైతన్య చింతనతో ఆనందమును పొందుతారు. అన్నము పరబ్రహ్మము కావున దానిని చింతన చేసేవారు భగవత్‌ చింతన చేసినట్లే! అటువంటి వారు ఆదర్శ ప్రాయమైన జీవితాన్ని గడుపు తారు. నిత్య ఆనందాన్ని అనుభవిస్తారని తైత్తిరీయ ఉపనిషత్తులోని ఆనందవల్లి ఏనాడో మనకు తెలియజేసింది. కనుక సాత్విక ఆహారాన్ని భుజిద్దాం. ఆహారాన్ని వ్యర్థం చేయకుండా ఉందాం. ఆహార బ్రహ్మ రైతుని ప్రోత్సహిద్దాం.

– వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News