Friday, November 15, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 5

5. భవకేళీమదిరా మదంబున మహాపాపాత్ముడై వీడు న
న్ను వివేకింప డటంచు, నేను నరకార్ణోరాశి పాలైన బ
ట్టవు, బాలుం డొకచోట నాటతమితో డన్నూత గూలంగ దం
డ్రి విచారింపక యుండునా, కటకటా శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! సంసారరూపమైన ఆట అనే కల్లు త్రాగి, మత్తెక్కి, ఒళ్ళు తెలియని ఈ నరుడు పాపాత్ముడై, నన్ను ధ్యానించలేదు అనే నెపంతో నరక మనే సముద్రంలో పడి మునిగి పోతూ ఉన్నా నీకేమీ పట్టనట్టు ఉరకుంటున్నావు. అయ్యో! ఇదేమైనా న్యాయముగా ఉన్నదా? పిల్లవాడు ఆటలలో పడి ఒళ్ళెరుగక నూతిలో పడినట్లైతే తండ్రి పట్టించుకోకుండా ఉండడు కదా! అనగా, తను సేవించినా లేక పోయినా, తండ్రి వంటి శివుడు తనను ఉద్ధరించి రక్షించాలి, తనపై వాత్సల్యం చూపాలి అని భావం.
విశేషం: భగవంతుడికి భక్తుడికి మధ్య నున్న తండ్రి కొడుకుల సంబంధం ఈ పద్యంలో ప్రస్తావించ బడింది. ధూర్జటి శివుణ్ణే తనకు తండ్రిగా భావించాడు. అందుకే తన వంశం గురించిన ప్రస్తావన కూడా చేయ లేదు.
“ భవము” అంటే “ సంసారం”. జనన మరణ చక్రమునకే సంసారము, లేక భవము అని పేరు. ఈ చక్రంలో చిక్కుకొని పోయిన జీవుడు అదే తన పరమార్థం అనుకుంటాడే గాని, ఆ చక్రభ్రమణంలో నుండి ఇవతలకు రావాలని కూడా అనుకోడు. చావు పుట్టుకలు అనే ఆటనే, అందులో నిమగ్నమైపోయి మరీ, ఆడుతూ ఉంటాడు. ఆ విధంగా ఆటలో లీనమైపోయేది పసిబాలుడు. కనుకనే తనను బాలునిగా భావించి రక్షించ మని ప్రార్థించాడు. జీవుడు పడిన నూయి సంసార రూపమే. ఆటలో లీనం అవటం ఎంతగా ఉంటుందంటే “ మళ్ళీ జన్మ అంటు ఉంటే …..” అని ఆలోచిస్తారే కాని, “ జన్మ లేకుండా..” అని మనసులో కూడా అనుకోరు.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి

ఇదికూడా చదవండి : శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 4

Advertisement

తాజా వార్తలు

Advertisement