Friday, October 22, 2021

శ్రీకృష్ణ సతి రుక్మిణీదేవి ఆత్మతత్వం!

దేవ దేవేశ్వరుడు శంఖ చక్రగధాధరుడు- పంకజనాభుడు లీలామానుష విగ్ర హుడు- శ్రీ కృష్ణ పరమాత్మ ఒకే ముహూర్తమున వేరువేరు భవనములందు వేరువేరు రూపములను ధరించి ఒకేసారి తాను పరిణయమాడిన రాజకన్యలందరిని ఏకత్వ భావనతో వారిని ఆనంద డోలికల్లో విహరింపజేసేవాడు. పరమాత్మునికి కూడా పరిహాసం వినోదంగా ఉంటుందని భాగవత రత్నాకరం తెలుపు తుంది. ఆ రీతిలోనే ఒకనాడు శ్రీ కృష్ణుడు రుక్మిణిదేవిని గాంచి, పరిహాసముగా ”దేవీ! నీవు గొప్ప గొప్ప రాజులుండగా, నా బోటి అకించనుని ఏల పెండ్లి ఆడినావు? ఏమి ఆశిస్తున్నావు?” అని అడిగాడు. ఆ తరువాత ఆయన చరిత్రను సూక్ష్మంగా తెలుపుతూ ఒక శ్లోకంలో ఇలా అన్నాడు హాస్య చతురుడు.
శ్లోకం|| ఉదాసీనావయంనూనం – నస్త్య్ర పత్యార్థకాముకా:
ఆత్మలబ్ద్వా ఆస్మహే పూర్ణా- గేహ యోర్జ్యోతి రక్రియా: అంటూ ”దేవీ! నిజంగా మేము ఉదాసీనులము. మేము స్త్రీ- సంతాన- ధనములకు, వశులము కాము. మేము నిష్క్రి యులం. దేహ, గృహాది సంబంధ రహితులం. దీపశిఖ వలె సాక్షిమాత్రులము. మేము మా ఆత్మ యొక్క సాక్షాత్కరము చేతనే పూర్ణ కాములమై- కృతకృత్యులమై యున్నాము” అని అమాయకంగా తన ఆత్మతత్వమును వెల్లడించాడు. తమ జీవన రీతులను వివరించాడు.
రుక్మిణీదేవి ఆ మాటలు విని శ్రీ కృష్ణుడి హాస్యమని భావింపక, నూతనంగా పరిణయ భావనను గ్ర హింపలేక కొంచెంసేపు బాధపడింది. వెంటనే రుక్మిణీదేవి అంతరంగ భావము ను గ్రహించి శ్రీ కృష్ణుడు ”దేవీ! నీ ప్రేమ పూరిత వాక్యములను వినుట కొరకే పరిహాసంగా పల్కిన నా పలుకులివి” అని ఓదార్చాడు.
రుక్మిణి వెంటనే సంతసించి పరమాత్మతో తన అంతరంగ తత్వమును, ఆమె మనోభా వనలను ఇలా వెల్లడించినది ఒక శ్లోకం ద్వారా!
”త్వంవై సమస్త పురుషార్థంమయ: ఫలాత్మా
యద్వాంఛయా- సుమతయో విసృజన్తి కృత్స్నమ్‌||
తేషాం విభో సముచితో- భవత: సమాజ:
పుంస: స్త్రియాశ్చరత యో: సుఖ దు:ఖినోర్న:”
”స్వామీ! ప్రపంచమందలి జీవునకు చతుర్విధ పురుషార్థములయిన ధర్మ- అర్థ- కామ- మోక్షములను వాంఛనీయ పదార్థము లేవి కలవో, వాటి యన్నిటి రూపమున మీరే ప్రకటితమై ఉన్నారు. మీరు సమస్త వృత్తుల, ప్రవృత్తుల, సాధనల, సిద్దుల, సాధువుల యొక్క తప: ఫల స్వరూపులు గదా! విచారణశీలురు మిమ్ము పొందుటకు, సమస్తమును త్యజించి వైచుచున్నారు. వాంఛ లను వదులుచున్నారు. అట్టి వివేకవంతులకు నిరంతరం మీతో సన్నిహిత సంబంధం ఉంటుంది. స్త్రీ, పురుషుల సాంగత్యము- సహవాసములచే లభించు సుఖమునకుగానీ, దు:ఖమునకుగానీ, వశీభూతులగువారు, మీతో సంబధమును పొందు టకు యోగ్యులు కారు. అర్హులు కారు.
కమల నయనా! పూర్వకాలమున అంగుడు- పృధువు- భరతుడు- యయాతి- గయు డు మున్నగు రాజన్యులెందరో తమతమ ఏకచ్ఛత్రాధిపత్య సామ్రాజ్యములను త్యజించి, మిమ్ము పొందవలెననీ, మీచే ముక్తికాంత లభించుననే అభిలాషతో తపస్సు చేయుటకు వనా లకు వెళ్ళారు. వారు మీ మార్గానువర్తులు గదా! వనములలో వారు ఏవిధమైన కష్టములను అనుభవించారు? వారు ఎలాంటి కష్టములను అనుభవించలేదనీ తమకు బాగా తెలుసు. పవిత్ర హృదయుల మనసులు, వారి అంతరంగ భావనలు మీకు ఎఱుకయే గదా!
ఇంక నా విషయంలో మీరు వెలిబుచ్చిన హాస్య వచనములకు నాకెలాంటి సందేహం లేదు. అకస్మాత్తుగా మీ చతుర వచనమును విని కొంచెం బాధపడిన మాట వాస్తవమే. ఎంతై నా స్త్రీ స్వభావం గదా స్వామీ! తమకు తెలియనిదేమున్నది? అంటూ నా అభిప్రాయం ఆల కిం చండి మహాత్మా! మీరు ఈ విశ్వానికే ఏకైక ప్రభువు. ఇహమందు, పరమందు సమస్త వాంఛలను పూర్ణం చేస్తూ వుంటారు. ఆత్మయు మీరే. ఆత్తతత్త్వం మీరేగదా!
మీరు నాకు అనురూపులని తలచియే నేను మిమ్ము మనసారా వరించితిని. నేను నా కర్మానుసారం విభిన్న జన్మల యందు, తిరుగవలసి యున్ననూ నాకేమియూ చింతలేదు. సదా మిమ్ము భజించు వారి మిధ్యా సంసార భ్రమను తొలగించేవారు. వారికి మీ స్వరూప మును ప్రసాదించుచుండగా పరమేశ్వరులైన, మీ పాదముల శరణమందు సదా వసించి యుండుటయే నా ఏకైక అభిలాష అయి ఉన్నది. జగతిలో సంసార లంపటంలో చిక్కి స్త్రీలకు సేవ చేస్తున్న రాజులు లోక వ్యవహారములందు తగుల్కొని కష్టాలు పడువారును, నిరంత రం దాస్యం చేస్తూ, కృపణులుగా- హింసకులుగా ఎలా మారుతున్నారో వినండి” అంటూ!
”యత్కర్ణమూల మరి కర్షణ- నోపయాయాదే
యుష్మత్కధామృడ- విరించి సభా సుగీతా!”
ఎవరి చెవులలో శంకర, బ్రహ్మాది దేవేశ్వరుల సభయందు గానమొనర్పబడు మీ లీలా విలాస కథలు ప్రవేశింపలేదో, అట్టి అభాగ్యురాండ్రైన స్త్రీల భర్తలై యుందురుగాక.
కృష్ణా! మనుష్య శరీరము బ్రతికి యున్నను శవమే అయి ఉన్నది. ఈ మాయా శరీరము పలు అంగములతో నిండి ఉన్నది. ఏ స్త్రీకి మీ పాద కమలముల మకరందము యొక్క సుగంధము ఆ ఘ్రాణించుటకు లభించ లేదో, అట్టి మూఢురాలగు స్త్రీయే, శరీరము తనదేనని తలంచి సేవిస్తూ వుంటుంది.” అంటూ రుక్మిణి తన అంతరంగ తత్వము ను తెలుపగనే, ఆమె అమృత వచనములు విని తన నిశ్చయాత్మకమైన భావనను తెలిపాడు శ్రీ కృష్ణుడు . ”సుందరీ! నీవు నా అనన్యమైన ప్రేయసివి. నా ఎడల నీకు అనన్య, భక్తి ప్రేమలు గలవు. నీ మనసులో ఏ అభిలాష కల్గి యున్నావో అవి సదా నీకు ప్రాప్తిస్తాయి. నీకు విముక్తి కలుగ జేస్తా యి. నేను మోక్షమునకు ప్రభువును, జనులను సంసార సాగరా న్ని దాటించువాడను. నా పరాభక్తిని కోరిన వారే భాగ్యవంతు లు. నా మాయలో చిక్కి సదా నన్ను సేవించి స్మరించి తరించిన వారే ధన్యులు. అందులో నీకే ప్రథమ స్థానమ”ని ప్రేమపూరిత వాక్కులతో సంతృప్తి పరిచాడు పరమాత్మ రుక్మిణీదేవిని.
– పి.వి.
సీతారామమూర్తి
9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News