Friday, October 22, 2021

పూల జాతర

పుడమి పువ్వుల పులకింతలు
ప్రకృతి ఒల్లంతా సప్తవర్ణ శోభలు
కొమ్మల సిగలో పుష్పాల నవ్వులు
బతుకమ్మ పర్వదిన సౌభాగ్య సిరులు!

బతుకునిచ్చే పూలతల్లి కల్పవల్లి
పూల సింగిడి పండగేగా బతుకమ్మ
అమ్మోరి దీవెనలకే అతివల ఆరాటాలు
నిత్య నైవేద్యాలతో తన్మయత్వ పూజలు !

పల్లెలన్నీ పరిమళ పూల వనాలు
ఆడబిడ్డల ఆటపాటల కోలాటాలు
పడతుల పసందైన బృంద నృత్యాలు
అడవి పూల బతుకమ్మ ఘన వేడుకలు !

తంగేడు, గునుగు, గుమ్మడి, బంతులు
తీరోక్క పూలతో పళ్ళెంలో
పసుపు గౌరమ్మలు
ఎంగిలిపూల మొదలు
సద్దుల నవమి దాకా..
నవదిన వైవిధ్య భరిత నిత్య సందడులు!
తెలంగాణమంత పూలదేవత కాంతులు
ఊరు వాడ పట్టుచీరల ప్రదర్శనలు
శక్తిస్వరూపిణినే బతుకమ్మైన వైనాలు..
ఉయ్యాల, కోలాట
పాటల కోలాహలాలు!
నిండిన చెరువులు, ఇంట్లో గాబులు
మగువల ముఖాల్లో పూసిన నవ్వులు
వీధి వీధిన పూల జాతర సంబురాలు
పుట్టింట ఆడపడుచుల
పట్టు పరికిణీలు!

అటుకులు, ముద్దపప్పు,
నానబియ్యాలు..
అట్లు, వేపకాయలు,
వెన్నముద్దలు, సద్దులు
బతుకమ్మ తల్లికే
వైవిధ్యభరిత నివేదనలు
చల్లగా దీవించమంటూ
పవిత్ర నిమజ్జనాలు!

బతుకమ్మ తీర్చాలి బడుగుల వెతలు
ఇంటింట వెలవాలి అక్షయపాత్రలు
వైరస్‌ వైరిని మట్టు పెట్టాలి దుర్గమ్మలు
ఆకలిని తరుమాలి గౌరమ్మ
ఆశీర్వాద బలాలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News