Tuesday, September 21, 2021

ధర్మం – మర్మం : వ్యాస పూర్ణిమ (ఆడియోతో…)

వ్యాసపూర్ణిమ గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వివరణ..

సృష్టి ఆదిలో శ్రీమన్నారాయణుడు సకల లోకములను సముద్దరించుటకు అనేక ధర్మములను ఏర్పాటు చేసెను. కానీ కాలక్రమేణా ఆ ధర్మములు లోపించగా బ్రహ్మ, రుద్రేంద్రాది దేవతలు శ్రీమన్నారాయణుని లోపించిన ఆ ధర్మమును మళ్ళీ ఉద్ధరించమని ప్రార్థించగా స్వామి మూడవ ద్వాపర యుగమున పరాశర మహర్షి, సత్యవతులకు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు అవతరించెను. ఈ వ్యాస భగవానుడు సరస్వతి నదీ జలమున స్నానమాచరించి ఆచమనము చేసి, పరిశుద్ధుడై సూర్యభగవానుడు ఉదయించిన సమయమున ఏకాంతమున ఆసీనులై ఉం డగా కాలత్రయము తెలిసిన వాడు కావున తెలియ సక్యం కాని వేగము కల కాలమును పొందింప చేసిన యుగధర్మ విశేషములను తెలుసుకొని, ద్వాపరము ముగి సి కలియుగము రాబోవు చున్నదని ఆ కాల ప్రభావముతో భౌతిక భావనలు అనగా శక్తులు తగ్గుచున్నవని తెలుసుకొనెను. ఆనాటికే మానవులలో శ్రద్ధ, బలము, బుద్ధిబలము, ఆయుష్యము తగ్గి దౌర్భాగ్యము పెరుగుచున్నదని దివ్య చక్షువుతో తెలుసుకొని, సార్ధకమైన దృష్టి కలవాడు కావున సకల వర్ణములకు, సకల ఆశ్రమములకు హితము కలిగించవలెనని తలచి ప్రజలకు వైదికమైన పరిశుద్ధమైన చాతుహోత్ర కర్మను సమీక్షించి యజ్ఞములను విస్తరింపచేయుటకు ఒకటిగా ఉన్న వేదమును ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదముగా విభజించెను. ఈ నాలుగు కాక ఇతిహాస పురాణమను 5వ వేదమును అందించెను.

పైలుడు అన్న శిష్యునకు ఋగ్వేదమును, జైమిని మహర్షికి సామవేదమును, వైశంపాయునకు యజుర్వేదమును, సుమంతునకు అధర్వణ వేదమును ఉపదేశించెను. ఇతిహాస పురాణమను పంచమ వేదమును రోమహర్షనుడను సూత మహర్షికి ఉపదేశించెను. వ్యాస మహర్షి వలన ఉపదేశము పొందిన ఆయా ఋషులు తాము పొందిన వేదములను తమ శిష్యులతో, ప్రశిష్యులతో అనేక విధములుగా శాఖలను ఏర్పచిరి. దుష్ట బుద్ధి మరియు మంద బుద్ధి కలవారు వేద, ఇతిహాస పురాణములను ధరించలేరని దీనులు, అభాగ్యుల యందు వాత్సల్యం కల వేద వ్యాస భగవానుడు వేద పురాణ అర్థములు వారికి కూడా తెలియాలని మహాభారతమును రచించెను. ద్వాపర యుగము చివర రాబోవు కలియుగములో నరులు ఉత్తమ కర్మను తెలియజాలక ఆపదలను కొని తెచ్చుకుందురు అని వారికి శ్రేయస్సును ఇచ్చు కర్మలను తెలుపుటకు వ్యాస భగవానుడు దయతో సకల వేదముల అర్థమును అందరికీ అందుబాటులోకి తెచ్చుటకు మహాభారతమును రచించెను. ఈ మహాభారతమున అన్ని వర్ణముల వారు, ఆశ్రమముల వారు, అన్ని జాతుల వారు, అన్ని లింగముల వారు, అన్ని వయస్సుల వారు ఆచరించదగిన ధర్మములను పొందుపరిచెను. ఇంతటితో తృప్తి పొందక సకల వేదములు సుస్పష్టముగా నిగూఢముగా అంత:గర్భితముగా దాగియున్న సూక్ష్మ ధర్మములను పరబ్రహ్మ స్వరూపము అని తెలియజేయుటకు 545 బ్రహ్మసూత్రములను అందించెను. ఈ విధంగా 18 పురాణములు, మహా భారతము, బ్రహ్మ సూత్రములను లోకశ్రేయస్సు కొరకు అందించిన మహానుభావుడు వ్యాస భగవానుడు. 18 పురాణములలో 5 లక్షల శ్లోకములు, హరివంశ మహా పురాణంతో కలిపి మహాభారతం లక్ష ఇరువై అయిదు శ్లోకాలు కలవు. అనగా మొత్తం ఆరు లక్షల ఇరవై అయిదు వేల శ్లోకములను లోకమున శ్రేయస్సు కొరకు అందించిన పరమ దయానిధి వ్యాసభగవానుడు.

మహాభారతమున చివర ‘యఇహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్‌ క్వచిత్‌ ‘ అని ప్రతిజ్ఞ చేసెను. అనగా ఈ భారతంలో ఉన్నది మరో చోట లభించును. ఇందులో లేనిది ఎందులోను లభించదని అర్థం.

మహాభారతం శాంతి, అనుశాసన పర్వములలో సుమారు 26వేల శ్లోకములలో రాజధర్మములు, ఆపద్ధర్మములు, దాన ధర్మములు, మోక్ష ధర్మములు, స్త్రీ ధర్మములు అను విభాగం చేసి అందరి కొరకు పొందు పరచిన మహోపకారి వేద వ్యాసుడు.

ఊర్ధ్వ బాహు: విరోమ్యేష న హి కశ్చిత్‌ శృణోతి మే
పరోపకార పుణ్యాయ పాపాయ పర పీడనమ్‌

అనగా పరులకు ఉపకరించుట పుణ్యం, పరులను పీడించుట పాపం అని రెండు చేతులూ పైకి ఎత్తి చాటినా ఎవరూ తన మాట వినుట లేదని పరితపించిన కృపాసింధువు వ్యాస భగవానుడు. ఆయన అందించిన ధర్మములను అధ్యయనం చేసి అందులో కొన్నింటినైనా ఆచరించి తరించుటే వ్యాసభగవానునికి మనం అందించే నివాళి.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News