Saturday, October 12, 2024

ధర్మం – మర్మం : కార్తిక పౌర్ణమి విశిష్టత (ఆడియోతో…)

కార్తిక పౌర్ణమి విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ..

ఆగ్నేయంతు యదావృక్షం కార్తిక్యాం భవతి క్వచిత్‌
మహతీ సా తిథి: జ్ఞేయా స్నాన దానేషు చోత్తమా
యదాతు యామ్యం భవతి ఋక్షం తస్యాం తిథౌ క్వచిత్‌
తిథి స్సాపి మహాపుణ్యా మునిబి: పరికీర్తితా
ప్రాజాపత్యం యదా ఋక్షం తిథౌ తస్యాం నరాధిప
సా మహా కార్తీకీ ప్రోక్తా దేవానామపి దుర్లభా

అనగా కార్తిక పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్ర యోగమున్నచో ఈ పూర్ణిమను ‘మహాపూర్ణిమ’ లేదా ‘మహాకార్తీకి’గా వ్యవహరిస్తారు. భ రణి నక్షత్రం ఉన్నచో ‘మహాతిథి’ అని అంటారు. అలాగే రోహిణి ఉన్నా కూడా ‘మహాకార్తీకి’గా వ్యవహరిస్తారు. రోహిణి నక్షత్రంతో కూడిన పూర్ణిమ దేవతలకు కూడా లభించదని హేమాద్రి మరియు బ్రహ్మ పురాణాల ద్వారా తెలుస్తోంది.

విశాఖాసు యదా భాను: కృత్తికాసుచ చంద్రమా:
సయోగ: పద్మకోనామ పుష్కరే ష్వతి దుర్లభ:
పద్మకం పుష్కరే ప్రాప్య కపిలాం య: ప్రయచ్ఛతి
హిత్వా సర్వపాపాని వైష్ణవం లభతే పదం

అనగా సూర్యుడు విశాఖ నక్షత్రంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉన్నచో పద్మక యోగమని, ఈ యోగమున పుష్కర తీర్థమున స్నానమాచరించి కపిల గోదానం చేసినచో పాపవిముక్తులై వైకుంఠమును చేరెదరని పద్మపురాణ వచనం.

- Advertisement -

కార్తిక్యాం పుష్కరే స్నాత: సర్వపాపై: ప్రముచ్యతే
మాఘ్యాం స్నాత: ప్రయాగేతు ముచ్యతే సర్వ కిల్బిషై:

కార్తిక పూర్ణిమ నాడు పుష్కర తీర్థమున స్నానం ఆచరించినా మరియు మాఘపూర్ణిమ నాడు ప్రయాగలో స్నానం మాచరించినా పాపవిముక్తులు అగుదురు. కార్తిక పూర్ణిమ నాడు శ్రీహరి మత్స్య రూపం ధరించాడని యమస్మృతి ద్వారా తెలుస్తోంది.

వరాన్‌ దత్వా యతో విష్ణు: మత్స్య రూపీ భవేత్‌ తత:
తస్యాం దత్తం హుతం జప్తం తదక్షయ్య ఫలం స్మృతం

పద్మపురాణంలోని కార్తిక మహాత్మ్యం ద్వారా కార్తిక పూర్ణిమనాడు శ్రీహరి బ్ర హ్మకు వరమిచ్చి మత్స్యరూపమును ధరించెను కావున ఈనాడు చేసిన దానం, హోమం, జపం అక్షయ ఫలాలను ఇచ్చునని శ్లోకార్థం.

పౌర్ణమాస్యాంతు సంధ్యాయాం కర్తవ్య: త్రిపురోత్స:
దద్యాత్‌ అనేన మంత్రేణ ప్రదీపాంశ్చ సురాలయే
కీకా: పతంగా: మశకా: వృక్షా: జలే స్థలేయే విచరంతి జీవా:
దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగిన: భవంతి నిత్యం స్వపచాహివిప్రా:

కార్తిక పూర్ణిమ నాడు సంధ్యాసమయంలో త్రిపురోత్సవాన్ని జరిపి పై మంత్రాన్ని పఠిస్తూ దేవాలయంలో దీపాలను వెలిగించాలి. కీటకాలు, దోమలు మొదలైనవి మరియు చెట్లు, ఉభయచరాలు కూడా ఈ దీపమును దర్శించినచో పునర్జన్మ ఉండదు. ఈ దీపాన్ని దర్శించినవారికి కోరిన ఫలము దక్కును.

కార్తిక్యాం యో వృషోత్సర్గమ్‌ కృత్వా నక్తం సమాచరేత్‌
శైవం పదమవాప్నోతి శివం వ్రత మిదం స్మృతమ్‌

కార్తిక పూర్ణిమ నాడు వృషోత్సర్గము చేసిన వారు కైలాసాన్ని పొందుతారని పై శ్లోకార్థం.

కార్తిక్యాం య: నరోలోకే ధాత్రీ ఫల రసస్నాయీ
తులసీ అర్చనం కృత్వా మహావిష్ణుం ప్రపూజ్యచ
బ్రాహ్మణాం పూజయిత్వాచ నపున ర్లభతే భవమ్‌

అనగా కార్తికపూర్ణిమ నాడు ఉసిరి రసంతో స్నానమాచరించి తులసిని, శ్రీమహావిష్ణువును పూజించి బ్రాహ్మణులకు, బీదలకు వస్త్రదానం, సంతర్పణ చేసినచో పునర్జన్మ ఉండదు.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement