Wednesday, May 25, 2022

ధర్మం మర్మం (ఆడియోతో..)

శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్‌” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.
ఈరోజు వేదవ్యాసని వైభవంపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
వేదవ్యాసుడు
శ్రీమన్నారాయణుడు సృష్టి ప్రారంభంలో బ్రహ్మాదులకు అందించిన వేద, శాస్ర,్త పురాణ ఇతిహాసాలు కాలక్రమేణ లోపిస్తుండగా బ్రహ్మ రుద్రాది దేవతలు మళ్లిd వాటిని ఉద్దరించ మని శ్రీమన్నారాయణునిని ప్రార్థించారు. పరాశురుడు, సత్యవతులకు ఒక ద్వీపములో అప్పటికప్పుడు అవతరించిన మహానుభావుడు కృష్ణద్వైపాయనుడు. ద్వీపములో పుట్టిన కారణాన ద్వైపాయుడుగా పేరుపొందెను. ఈ మహానుభావుడు అవతరించి ఒక రాశిగా ఉన్న వేదముల నుండి ఋక్కులను, యజస్సులను, సామములను, అధర్వములను విభజించి నాలుగు భాగాలుగా చేయగా అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం. ఇలా ఒకటిగా ఉన్న దానిని నాలుగుగా విస్తరించాడు కావున వ్యాసుడు అని, వేదాలను విస్తరించినందుకు వేదవ్యాసుడుగా పేరుపొందాడు. వేదాలసారం అర్థము చేసుకోలేనివారు జ్ఞానాన్ని పొందాలని వేదములకు వ్యాఖ్యానముగా వేదములలో వివరించిన ధర్మాన్ని, జ్ఞానాన్ని, కర్మను ఇతర విశేషాలను అందిస్తూ మహాభారత గ్రంథాన్ని అందించారు. ఇది లక్ష ఇరవై ఐదువేల శ్లోకాల గ్రంథము. అంత గ్రం థమును చదవలేని వారి కోసం 18 పురాణాల రచన చేసారు. ఇందులో సాత్విక, రాజస, తామస పురాణాలు అన్ని గుణముల ప్రవృత్తి గల మానవులు చదివి అర్థము చేసుకొనగలిగేటట్లు దైవ భక్తి, సమాజ సంక్షేమం, సాంఘిక నియమాలు, మానవజీవనంలో అన్ని కోణాలు తెలుపుతూ అందించవాడు వేదవ్యాస భగవానుడు. వీటి వల్ల సంతృప్తి చెందలేని వ్యాసభగవానుడు పరమ వేదాంతత్త్వాన్ని సంక్షేపంగా అందించడానికి బ్రహ్మసూత్రములను అందించాడు. అయినా తాను శాంతి పొందక చివరగా నారద ఉపదేశంతో శ్రీమద్భాగవత మహా పురాణాన్ని అందించాడు. ఇలా అనంతమైత భారతీయ వాఙ్మయానికి దిశను, దశను చూపినవాడు వ్యాసభగవానుడు. సుక మహర్షిని పుత్రునిగా పొంది ప్రపంచానికి భారత, భాగవతాలను ప్రబోధించినవాడు వ్యాసుడు. ప్రతి ఒక్కరూ ప్రతీ నిత్యము ప్రాత:కాలములో ఒకసారి వేదవ్యాస నామాన్ని పలికినా, జపించినా, స్మరించినా భారతీయ సంస్కృతికి మరో లక్ష సంవత్సారాలు అపాయము లేని రక్షణ లభిస్తుంది.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement