Wednesday, July 28, 2021

కాలాన్ని దాటడం ఎవరికైనా సాధ్యమా

రామలక్ష్మణులు జటాయువుకు కర్మలు చేసి, సీతాదేవి లభిస్తుందని ఆయన చెప్పిన మాటలను విశ్వసించి, సీతాదేవిని కలవాలన్న కోరికతో అడవుల జాడ పట్టుకుని నైరుతిమూలగా పోయారు.అడవిలో సీతను వెతకసాగారు. మధ్యలో అడ్డుతగిలిన అయోముఖి అనే రాక్షసిని చంపారు. అలాసీతను వెతుక్కుంటూ పోతుండగా అడవిని చీల్చుకుంటూ పెద్ద ధ్వని వినిపించి, ఒక భయంకరాకారం కనిపించింది.
పర్వతంలాంటి పెద్ద దేహం, పెద్ద రొమ్ము, తలమెడ లేకుండా, బిరుసు వెంట్రుకలు, నల్లటి మబ్బు లాంటి, ఉరుము లాంటి ధ్వని, నిప్పుల్లాంటి ఒంటి పెద్ద కన్ను, పెద్ద కోరలు, యోజనం పొడుగు చేతులు కలవాడిని, నోరు తెరిచి తమ దారికి అడ్డంగా వున్న వాడిని, కబంధుడిని సమీపించారు రామలక్ష్మణులు. ఆ రాక్షసుడు వీళ్ళిద్దరినీ తన రెండు చేతులతో పట్టుకున్నాడు. వారిద్దరూ శత్రువు చేత చిక్కి ఆపదపాలయ్యారు.
రాక్షసుడిని చూసి అన్నదమ్ములు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. వారిని చూసి కబంధుడు తనను చూసి వారెందు
కు భయపడుతున్నారని అడిగాడు. వాళ్ళను తన నోట్లో పడేట్లు బ్ర#హ్మ చేశాడని కూడా అన్నాడు. ఈ రాక్షసుడు మహా బలవంతుడనీ, భయంకర దే#హంకల దుష్టుడనీ, ప్రపంచమంతా గెలవగల పరాక్రమం కలవాడిగా కనిపిస్తున్నాడనీ, కాబట్టి తమను మింగుతాడు కాని వదలడని లక్ష్మణుడు అంటాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు విని ఆ రాక్షసుడు, రామలక్ష్మణులను నోట్లో వేసుకుందామని ఆలోచించే లోపలే వాడి తత్త్వాన్ని అర్థం చేసుకున్న వారిద్దరిలో రామచంద్రమూర్తి వాడి కుడిచేయి నరికాడు. రాముడికి కుడిపక్కన వున్న లక్ష్మణుడు తన కత్తి దెబ్బతో ఎడమ చేయి నరికాడు. ఇలా నరకగా ఆ రాక్షసుడు భూమ్యా కాశాలు, దిక్కులు దద్దరిల్లేట్లు నేలకొరిగాడు.
దు:ఖంతో కూడిన ఆ రాక్షసుడు రెండు చేతులూ కోల్పోయి వారెవరనీ, ఈ అడవిలో వాళ్లకేమిపని వుందనీ అని ప్రశ్నించాడు. జవాబుగా లక్ష్మణుడు, వాళ్ల చరిత్ర చెప్పాడు. తాము ఇక్ష్వాకు వంశంలో పుట్టామనీ, తన అన్న పేరు శ్రీరాముడనీ, తన పేరురు లక్ష్మణుడనీ,దండకారణ్యంలో వున్నప్పుడు దుండగులైన రాక్షసులు మాయచేసి అన్న రాముడి భార్య సీతమ్మను దొంగిలించగా ఆమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామనీ అన్నాడు. మొండెం మాత్రమే ఆకారంగా వున్న ఆ రాక్షసుడు ఎవరని కూడా అడిగాడు. ఇది విన్న ఆ రాక్షసుడు, తనకు శాపమోక్షణ కాలం దగ్గరికి వచ్చింది కదా అని సంతోషించి ఇలా జవాబిచ్చాడు లక్ష్మణుడికి.
”ఓ రాఘవులారా! నా భాగ్యం పండడం మిమ్మల్ని ఇక్కడ చూడగలిగాను. చేతులు పోగొట్టుకున్నాను. వినయం తప్పిన పనులు చేయడం వల్లే నాకిలాంటి వికార స్వరూపం కలిగింది. నేను మొట్టమొదట సుందరాకారం కలిగి, అందగాడినని పెరుతెచ్చు
కున్నాను. ఆ గర్వంతో మునులను అరణ్యవాసులను భయపడేట్లు అనేకరకాల దు:ఖపెడుతూ, స్థూలశిరుడు అనే మునిని నింద్య రూపంలో భయపెట్టాను. ఆ ఋషీశ్వరుడు ‘ఓరీ! పాపాత్ముడా! నింద్యమైన ఈ రూపంలో నన్ను బెదిరిస్తావా? నీకు ఈ రూపమే శాశ్వతం కలుగుగాక!’ అని శపించాడు. శాపవిమోచనం చెప్పమని ప్రార్థించగా ఈ అడవిలో ఎప్పుడు రామచంద్రుడు నీ చేతులు తెగనరికి దహిస్తాడో అప్పుడే నీకు శాపం తొలగిపోయి, నీ పూర్వ రూపం పొందుతావు అని శలవిచ్చాడు ఆ మునీశ్వరుడు”.
”కబంధ రూపం రావడానికి మరో కారణం వుంది. ఒక సారి బుద్ధిహనుడనై ఇంద్రు డిని యుద్ధానికి రమ్మని పిలిచాను. ఇంద్రుడు వజ్రా యుధం వేటుతో నా తల, రొమ్ము, కడుపు, తొడలు కుదిం చుకు పోయేట్లు అణచి వేశాడు. నేనప్పుడు, నాకీ దురవస్థకన్నా మర ణమే మేలని చంపమని ప్రార్థించాను. నేనెలా బతకాలయ్యా? అని అడిగితే, ఆమడ పొడుగున్న చేతులు, కడుపులో నోరు అనుగ్రహించాడు. వాటి సహాయంతో ఏనుగులను, పులులను, సింహాలను, ఇతర మగసమూహాలను చంపి తింటున్నాను. లక్ష్మణుడితో సహా ఎప్పుడు రాముడు నా చేతులను నరుకుతాడో అప్పుడు మళ్లిd నేను స్వర్గానికి వస్తానని చెప్పి ఇంద్రుడు పోయాడు”.
”ఇక అప్పటి నుండి ఈ వికార స్వరూపం పోవడానికి ప్రయత్నం చేస్తూ, ఎవరు కనపడ్డా పట్టుకుని, రాముడు చిక్కకపోతాడా అని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఆ మునీశ్వరుడు చెప్పిన రాముడివి నువ్వే. మీకు నేను సహాయం చేస్తాను. మీ కార్యం సాధించగల స్నేహితుడిని చూపిస్తాను. నన్ను అగ్నితో దహిహంచు” అని అంటాడు కబంధుడు. తన దేహాన్ని వేగంగా దహించి వేస్తే సీతను దాచి వుంచిన ర#హస్యమంతా దాచకుండా చెప్తానంటాడు కబంధుడు రాముడితో. ఆ పని సూర్యాస్తమయం లోపే చేయమంటాడు. వాడి విషయం తెలిసినవాడు ఒకడున్నాడనీ, అతడితో ధర్మబద్ధంగా స్నే#హం చేయమనీ, అతడు ప్రపంచంలో తిరగని చోటు లేదనీ, అతడు రాముడికి ఉపకారం చేస్తాడనీ చెప్పాడు కబంధుడు.
కబంధుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు వాడిని ద#హనం చేయడానికి సన్నాహాలు చేశాడు. రామలక్ష్మణులు చూస్తుండగానే, మండుతున్న ఆ మంటల్లో నుండి బయటకు వచ్చి,ఆకాశానికి ఎగిరిన కబంధుడు, తాను సీతాదేవిని చూసిన విధం రాముడితో ఇలా చెప్పాడు.
”రామచంద్రా! లోకంలో సంధి, విగ్రహ, యానా, సన, ద్వైదీభావ, సమాశ్రయంలనే ఆరు ఉపాయాలను పనులు చక్కబెట్టడానికి ఆలోచిస్తారు. ఈ ఆరింటిలో సంధి తప్ప తక్కినవి నీకు ప్రస్తుతం సరిపడేవి కాదు. ప్రత్యక్ష శత్రువు ఎవరైంది నీకు తెలియలేదు కాబట్టి, నువ్వు వాడితో సంధి చేద్దామన్నా కుదరదు. కాబట్టి మొదలు నీ శత్రువు విషయం, సీత ఉనికి తెలుసుకోవాలి. ఇది మీ ఇద్దరివల్ల సాధ్యపడేది కాదు. కాబట్టి అన్యుల సహాయం తీసుకోవాలి. ఇతరులతో సంధి అంటే, ఎలాంటివారితో చేయాలి? కయ్యానికి, నెయ్యానికి, వియ్యానికి సమానత్వం కావాలి. తనకంటే గొప్పవారితో స్నేహం కుదరదు. తక్కువ వారితో స్నేహం చేస్తే లాభం లేదు. తనకంటే ఎక్కువవాడు తనని చులకన చేస్తాడు కాని, నిండు మనస్సుతో ఆదరించడు”.
”కాబట్టి నీ స్థితిలాంటి స్థితిలో ఉన్నవాడిని చూసి స్నేహం చేసుకో. సుగ్రీవుడు అనే వానర రాజు, తన అన్న వాలికి తనమీద కోపం రాగా, నలుగురు వానరులను సహాయంగా తీసుకుని దు:ఖపడుతూ, పంపానది ఒడ్డున వున్న పవిత్ర ఋశ్యమూక పర్వతం మీద సంచరిస్తున్నాడు. అతడు పరాక్రమవంతుడు. ఋజువర్తనం కలవాడు. అతడితో నువ్వు స్నేహం చేస్తే నీ భార్యను వెదకడానికి అతడు నీకు సహాయపడతాడు. రామా! నువ్వెందుకు దు:ఖపడతావు? ఏదెలా జరగాలో అలాగే జరుగుతుంది కాని, దానిని తప్పించడానికి ఎవరికి సాధ్యం? ఎలాంటివారికైనా కాలాన్ని దాటడం సాధ్యం కాదుకదా?.
”సుగ్రీవుడు, అన్న వాలికి భయపడి, తిరుగుతున్నాడు. వాడు నమ్మేట్లు నువ్వు నీ ఆయుధాలన్నిటినీ తాకి ప్రతిజ్ఞ చేసి అతడితో స్నేహం చేయి. అతడికి తెలియని రాక్షసులు వుండే చోటు భూమ్మీద లేదు. సూర్యకిరణాలు వ్యాపించే భూమ్మీదగల నదులు, నదాలు, కొండలు, అడవులు, వెతికి నీ భార్య ఎక్కడున్నదీ వార్తా తెప్పించగల సమర్థుడు సుగ్రీవుడు. నిన్ను ఎడబాసిన కారణాన దు:ఖిస్తున్న సీతాదేవి రావణుడి బందీగా ఎక్కడ ఉన్నదో కనుక్కోగల సమర్థుడతడు. ఆ రావణుడి ఇల్లు వెతికి, వాడామెను పాతాళంలో దాచినా, మెరువు కొనలో ఉంచినా, రాక్షసుల గుంపును చంపి ఆమెను తీసుకురాగలడు”.
ఇంతదాకా రామలక్ష్మణులు దక్షిణ దిక్కుగానే ప్రయాణం చేశారు. జటాయువు కూడా దక్షిణం వైపే పొమ్మని సలహా నిచ్చాడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News