Sunday, October 17, 2021

ఏకత్వానుభవమే ఆధ్యాత్మికత

స్వామి వివేకానంద వేదాలను విశ్లేషిస్తూ ”వేదాలు భగ వంతుని వచనాలుగా భావించవచ్చు. ఆయన శ్వాసగా ఉండవచ్చు. కాని వేదాలు భగవంతుడు మాత్రం కాదు. భగవంతుడిని చేరుకోవడం అనే మహత్తర కార్యం మాత్రమే మహో న్నతమైనదని విశదీకరిస్తాయి. అందుకే మానవ జన్మకు అంతిమ లక్ష్యం భగవద్దర్శనం. ఏ జ్ఞానం చేత భగవంతుని చేరుకుంటామో అదియే అత్యున్నత జ్ఞానం. దానినే ఆధ్యాత్మిక జ్ఞానం అని పిలవడం జరిగింది.
మనిషి తన మేధస్సునంతా మధించి, ఈ లోకాన్ని సృష్టించిన వారిని కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
కాని అది లౌకిక జ్ఞానంతో ప్రయత్నించడం వలన నిష్పలంగా మిగిలింది. ఆయనను కనుగొనడానికి ఉన్నత జ్ఞానం కావాలి. అది యే ఆధ్యాత్మిక జ్ఞానం. సమస్త జ్ఞానాలకు మూలాధారం.
ఏ అంశమును తెలుసుకుంటే సమస్తమూ తెలుసుకున్నట్లు? అనే ప్రశ్నను లేవనెత్తి, మార్గము చూపింది ముండకోపనిషత్తు.
ఓం బ్రహ్మదేవానాం ప్రథమ: సంబభూవ
విశ్వస్య కర్తా భువనస్య గోప్తా!
సబ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టామ్‌
అథర్వాయ జ్యేష్ట పుత్రౌయప్రాహ
ప్రణవ సహిత బ్రహ్మ దేవుడు మొట్టమొదట ఉద్భవించాడు.
తదుపరి జగత్తును సృష్టించి రక్షిస్తున్నాడు. జ్ఞానములకు ఆధార భూతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తన పెద్ద కుమారుడైన అథర్వునకు ఉపదేశించాడు. వెలుగు లేనిదే దేనిని చూడలేనట్లు ఆధ్యాత్మిక జ్ఞానం లేనిదే ఏ జ్ఞానమూ ఫలించదు, ప్రయోజన మివ్వదు. ముఖ్యంగా ఆత్మ గురించి అధ్యయనం చేసేదే ఆధ్యాత్మిక జ్ఞానం. మానవుని నిజ స్వరూపం ఆత్మయని అనుభవ పూర్వకంగా తెలుసుకోవడానికి దోహద పడేదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఇంద్రియాలు చైతన్యంతో తమతమ అనుభవాలను అందిస్తున్నాయి. ఆ చైత న్యాన్ని అందించేది ఆత్మ. బ్రహ్మదేవుని నుండి గ్రహించిన ఆధ్యా త్మిక జ్ఞానాన్ని అథర్వుడు అంగిరునకు బోధించాడు. అంగిరుడు భరద్వాజ గోత్రుడైన సత్యవహునికి బోధించాడు. తదుపరి గురు శిష్య పరంపర కొనసాగింది.
శౌనకుడు గృహస్థాశ్రమంలో నుండి అంగిరుని పూజించి, దేనిని తెలుసుకుంటే ఈ సమస్తమూ తెలుసుకున్నట్లు? అని అడి గాడు. ఏకత్వ స్థితిని కనుగొనడమే విజ్ఞానం. ఎప్పుడైతే ఏకత్వము అనుభవంలోకి వస్తుందో జ్ఞానాన్వేషణ పరి సమాప్తమవుతుంది. పరమాత్మ నుండి ఆత్మలు ఆవిర్బవించు మాయా ప్రహేళిక యొక్క మూలమైన పరమాత్మయే సర్వవ్యాపితాత్మయని తెలిసినప్పుడు జ్ఞానాన్వేషణ అంతమవుతుంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, శబ్ద శాస్త్రం, వ్యాకరణం, నిఘంటువు, ఛందస్సు, ఖగోళశాస్త్రం, జ్యోతి షం ఇవన్నీ సామాన్యమైన జ్ఞానానికి చెందినవి. అవినాశి అయిన భగవంతుడు ఏ జ్ఞానంతో పొందగలుగుతున్నాడో అదియే అత్యున్న తమైన జ్ఞానమని ముండకోపనిషత్తు తెలియజేస్తోంది. భగవంతుడు దర్శింప సాధ్యం కానివాడు. అర్థం చేసుకోవడా నికి సాధ్యంకాదు. ఉత్పత్తి లేదు. రంగు లేనివాడు. మానవునికున్నట్లు అవయవాలు లేవు. శాశ్వతమైన వాడు. అనంతమైన రూపాలను సంతరించుకొనగలడు. సర్వవ్యాప్తి, అత్యంత సూక్ష్మమైనవాడు, అవినాశి, సృష్టికి మూల కారణమైన వాడు. జాగృత చైతన్యులు ఆయనను సర్వత్రా దర్శించగలరు. దర్శింప సాధ్యం కానివాడు. సర్వత్రా దర్శించగలరు అని రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలు కొంత సందిగ్ధమునకు గురి చేస్తున్నా యి. అయితే మన జ్ఞానం ఇంద్రియ పరిధి లోనిది. భగవంతుడు ఇంద్రియ జ్ఞానాతీతుడు. ఆధ్యాత్మిక గ్రంథ రాజమైన భగవద్గీత ప్రవచనాంతమున శ్రీ కృష్ణ పరమాత్మ తన విశ్వరూప ప్రదర్శనను వీక్షించడానికి అర్జునునికి దివ్య నేత్రాలు ప్రసాదించాడు. ఇంద్రియాలకు అతీత మైన దివ్య నేత్రాలు గలవారిని ”జాగృత చైతన్యులు” అంటారని ఉపనిషత్తు విశదపరుస్తోంది. చైతన్య మూర్తి అయిన భగవంతుని దర్శించాలంటే దివ్య జీవిత సాధన చేసి జాగృతమైన వారు అర్హులవుతారు.
వారికి దివ్య నేత్రాలు వికసిస్తాయి.

తపసా చేయతే బ్రహ్మ తతోన్నభి జాయతే!
అన్నాత్ప్రాణో మన: సత్యం లోకా: కర్మసు చామృతమ్‌!!

భగవంతుడు తపస్సుచే పెరుగుతాడు. మొదట ఆయనలో నుండి మూల ప్రకృతి వెలువడింది. తరువాత ప్రాణం, మనస్సు, పంచభూతాలు, లోకాలు, కర్మలు, ప్రారబ్ద కర్మలు ఉద్భవించాయి. సంతోషకరమైన తపస్సు చే భగవంతుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులను సృజించాడు. ముక్తిని పొందమని ఒక అవకాశం ఇచ్చాడు. సర్వమూ తెలిసినవాడు, సర్వులనూ ఎరిగిన వాడు జ్ఞానమయమైన తపస్సు గలవాడు భగవంతుడు. ఆయన నుండి బ్రహ్మ దేవుడు, అనేక రూపాలు, ఆహారము ఉద్భవించాయి. అనాసక్తితో భగవంతుడు తపస్సు చేస్తాడు. అందుకే అది జ్ఞానమయమయింది. విశ్వం జనించింది. ఆసక్తితో మొదలయిన ఆధ్యాత్మిక సాధన అనాసక్తితో ముగియడమే తపస్సు. అదియే జాగృత చైతన్యం.
– వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News