Saturday, July 24, 2021

ఆదరణ కరువు

కలియుగంలోని మానవులకు అదృష్టం అనేది ఒక వరం లాంటిది. అదృష్టం అంటే ఒక భాగ్యం. ఈ భాగ్యం ఏరూపంలోనైన ఉండవచ్చు. మానవులకు ఈ అదృష్ట రేఖ ఒకసారి బాగా ఉండి, పరిస్థితుల ప్రభావంతో అది తిరిగి అదృశ్యంగా వచ్చును. ఈ అదృష్టము వున్నప్పుడు అతని చుట్టు అందరు చేరి తమ ఆత్మీయతలను , అనురాగాన్ని, అభిమానాన్ని ఆయనకు పంచుతూ ఆయనను అభిమానంతో ముంచెత్తి స్తోత్రాలు చేస్తుంటారు. ఆ వ్యక్తి అదృష్టము తగ్గినపుడు ఎవరు దరి చేరరు. పలుకరించరు. ఆత్మీయులు ఆదరించరని భాస్కర శతక రచయిత మారన గారు ఒక ఉత్పలమాల పద్యం ద్వారా లోకాని మంచి సందేశాన్ని అందించారు.
పూడిన భాగ్య రేఖ చెడిపోయిన పిమ్మట , నెట్టి మానవుడైనను వాని నెవ్వరు బ్రియంబున బల్కరు. పిల్వ రెచ్చటందానది యెట్లో కోయనిన దథ్యము పుష్పమువాడి – వాసన హీనత నొంది యున్నయెడ నెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా అంటూ, ఓ భాస్క రా! మానవుని భాగ్య రేఖ బాగా లేని నాడు అతనితో ఎవ్వరూ ప్రేమతో మాట్లాడరు. ఎక్కడికి ఆహ్వానించరు. ఎవ్వరూ గౌరవిం చరు. అది సత్యం. యధార్థం. కవి దీనికి ఉపమానంగా ప్రకృతి లోని పూవులు కాంతి లేక – వాసనకూడా లేకుండా వాడిపోతే అలాంటి వాటిని ఎవ్వరూ గ్రహించరు కదా?
భాగ్య రేఖ బాగుంటే అన్నీ బాగుంటాయి. బాగా లేకపోతే అన్నీ పోతాయి. ఏమీ వుండవు. మిగలవు. ఈ కలిలో అన్నీ వున్న వారినే ఆదరించడం తక్కువై ఉండగా , ఏమిలేని వారిని లోకులు చులకనగా, హీనంగా చూస్తారు. మహా కవి కాళీదాసు దాసు ఒక శ్లోకంలో రిక్త: సర్వేభవతిహి లఘు: అని తెలిపాడు.
విధి వక్రించి మొదటిలో భాగ్య రేఖ కలిగి మరలా అది దూరమైందని లోకులు భావించరు. చెట్లకు పండ్లు వుంటేనే పక్షులు వస్తాయి. పండ్లు లేకుంటే ఆ పక్షులు కూడా ఆ చెట్ల దరి చేరక వెళ్ళిపోతాయి.
పూవులు వికసించి ఉంటే తుమ్మెదలు వచ్చి వాలుతాయి. ఆనందంతో మకరందాన్ని గ్రోలుతుంటాయి. ఆ పూలు వాడిపోతే విడిచిపోతాయి.
ఈ ప్రపంచంలో అదృష్టవంతులనూ, దురదృష్టవంతులనూ చూస్తూ ఉంటాం. ప్రకృతిలో భాగ్య రేఖా విలాసాన్ని – భాగ్య హీనతను చూస్తూనే ఉన్నాము. దురదృష్టం అనగా దౌర్భాగ్యం నెత్తిపై ఉన్నప్పుడు ఎవరూ ఏమి చేయలేరు.
విధే వక్రేమూర్ద్ని స్థితి తతి వయంకే పునరమీ అని సూక్తి.
వ్యవహారికంలో మానవులు అదృష్ట హీనుని జూచి , ఎంతో బాగా అదృష్టంతో తుల తూగినవాడి నెత్తిన ఎవరో పెద్దమ్మ కూర్చుని ఈ విధంగా వున్నాడని జాలి పడడం చూస్తూనే ఉంటాం.
పూవులు, వాడి, పరిమళ హీనమై ఉండడం ఎలాగో మనిషికి భాగ్యరేఖ చెడిపోవడం అలాగే ఉంటుంది. వాడిన పూలకు ఆకర్షణ ఉండదు. అదృష్ట రేఖ బాగా ఉన్నప్పుడు , మంచి స్థితిలో వున్న వారిని చూసి అందరూ దూషించే వారే. అది చెడిపోయినప్పుడు లోకులు ఆ వ్యక్తిని దూషించడానికి కూడా వెనుదీయరు. ఇది కలి మానవ స్వభావం. ఈ పద్యంలో అదృష్ట హీనుని వాడిన పూలతో పోల్చి చెప్పడం కవి వాస్తవికత.
రకరకాల పూలను పలురకాలుగా వాడుకుని అవి వాడి పోగానే వాటిని దూరంగా పడవేసి,కనీసం వాటిని స్పృశించరు. కవి అదృష్టరేఖను అందంగా వర్ణించారు. అదృష్టంతో పండితే ఆరు నూరవుతాయి అని సామెత. కానీ అదృష్టం ఎండితే అంటే తగ్గినప్పుడు దూరమైనప్పుడు నూరు ఆరు కూడా కావు.
మహా కవులు పురాణాలలో రామాయణ, భారత భాగవ తాలలో , నాటక రచనలో అదృష్ట హీనుల గురించి ఎన్నో విషయా లను విశదీకరించారు.
బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు తమ హరిశ్చంద్రీయ నాటకం లో పలు పద్యాల ద్వారా హరిశ్చంద్రుని భాగ్యావంతులను – అదృష్ట హీనులను కవులు పలు రీతులలో వర్ణించి లోకానికి ఎన్నో సందేశాలు అందించారు.
అన్నీ అందుబాటలో ఉన్నప్పటికీ అదృష్ట హీనులు వాటిని అందుకోలేరు. అది వారి దురదృష్టం. దౌర్భాగ్యం. సృష్టి ప్రారంభం లోనే విధాత అదృష్ట వంతులనూ, దురదృష్ట వంతులనూ సృష్టిస్తాడని పురాణోక్తి.
పొందిన అదృష్టాన్నీ, భాగ్యాన్ని మంచి జ్ఞానంతో నిలుపుకొని పదిమందిలో కీర్తి పొందడంలో మానవులు కృత కృత్యులు కావాలని భాస్కర శతక కర్త సాభిప్రాయంగా తలంచవచ్చును. కాలం కలిసి రాకపోతే అది వారి దురదృష్టం.
పురాణ పురుషులు, పురాణ వ్యక్తులు కూడా అనగా దేవ దానవులు పలుమార్లు అదృష్ట హీనులై తుదకు తాము నమ్ముకున్న దైవాన్ని శరణాగతి వేడి తిరిగి భాగ్యవంతులైనారని ఎన్నో విషయాలు విన్నాము.
అదృష్ట హీనులు మానసికంగా కృంగిపోకుండా , మన నుదుటి రాత ఇలా ఉందని ధైర్యంతో , పరిస్థితులకనుగుణంగా నడుచుకుని ప్రగతిబాటలో పయనించాలి.
భర్తృహరి తమ నీతి శతకంలో ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు దాల్మియున్‌ అని చెబుతూ ధైర్యం, స్థైర్యంతో అదృ ష్ట హీనులు జీవన యాత్ర సాగించాలనీ దివ్య సందేశాన్ని అందించారు. వారిలో స్పూర్తిని కలుగజేశారు.
కలిమానవులు సర్వేజనా సుఖినోభవంతు అనే నినాదంతో సాగిన నాడు అదృష్టం దురదృష్టమనే పదాలు దరి చేరవు. అందరూ ఒకటేనని నాదమే ఆనంద మార్గం. కలిజనుల కదదే స్వర్గము.
లోకా సమస్తా సుఖినోభవంతు

– పివి. సీతారామమూర్తి
9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News