Tuesday, April 16, 2024

బాలీవుడ్‌ను ఆదుకున్న తెలుగు (పాన్‌ ఇండియా) సినిమాలు

తెలుగు సినిమా స్థాయి పెరగాలి. మనవాళ్ళ ప్రతిభ దేశమంతటికి చాటాలి. తెలుగులో ఉన్న క్రియేటివిటి మరెక్కడా లేదనే విశ్వాసం టాలీవుడ్‌లో చాలా మంది సినీ సాంకేతిక నిపుణుల్లో ఉంది. దానికి తగినట్టుగానే ఇప్పుడు మన తెలుగు సినిమావైపు మొత్తం దేశం చూస్తోంది. పాన్‌ ఇండియా సినిమాలకు కొత్తర్థం చెప్పిన తెలుగు సినిమా పాన్‌ ఇండియా నుండి కోలుకుంటున్న సినీరంగానికి ఊతమిచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప, అఖండ, రాధేశ్యామ్‌ వంటి సినిమాలతో ఉత్తరాదిలో పరిశ్రమ పుంచుకునేలా చేసింది. మనపొరుగు రాష్ట్రం కర్నాటకలో తయారైన కేజీఎఫ్‌ 2 కూడా భారతీయ సినీరంగం పుంజుకోవ డానికి అండగా నిలిచిందని చెప్పవచ్చు. పాన్‌ ఇండియా బ్రాండ్‌తో తెలుగులో చాలా చిత్రాలు రూపొందుతున్నాయి. ఇవి ముఖ్యంగా బాలీవుడ్‌కు షాక్‌ ఇస్తున్నాయి. ఒకప్పుడు హిందీ సినిమాను ప్రాంతీయ సినిమాలు ఫాలో అయ్యేవి. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. ప్రాంతీయ సినిమాలను నమ్ముకుంది బాలీవుడ్‌. అందుకే తెలుగు పాన్‌ ఇండియా సినిమాల్లో పెట్టుబడి పెట్టేందుకు కరణ్‌ జోహార్‌ సహా అనేక మంది ఉత్తరాది ఫైనాన్షియర్‌ ఆసక్తి చూపుతున్నారు. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ వంటి స్టార్స్‌ దేశవ్యాప్తంగా పరిచయం అయ్యారు. వీరు నటించిన కొత్త సినిమాలే కాదు పాత సినిమాలు సైతం ఉత్తరాది థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.

పాన్‌ ఇండియా సినిమా అంటే ఆయా సినిమాల్లో కేవలం తెలుగు తారలే ఉండటం లేదు. దాదాపు అన్ని భాషలకు చెందిన ఆర్టిస్టులకు అవకాశం లభిస్తోంది. ఇటీవలే విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అజయ్‌ దేవగణ్‌, అలియా భట్‌ నటించారు. ‘రాధేశ్యామ్‌’లో కథానాయిక పూజా హెగ్డే, ‘కేజీఎఫ్‌’ లో సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌ అవకాశం దక్కించుకున్నారు. పాన్‌ ఇండియా సినిమా అంటే ఒక ప్రాంతంలో నిర్మాణమైన చిత్రంగా పరిగణించే అవకాశం లేదు. ఎందుకంటే వాటిలో పాన్‌ ఇండియా నటీనటులు ఉంటుంది. ప్రభాస్‌ లాంటి నటుడితో సినిమాలు తీసేందుకు బాలీవుడ్‌ సినీ పెద్దలు పోటీలు పడుతున్నారు. విజయ్‌ దేవరకొండతో వరుస సినిమాలు తీసేందుకు కరణ్‌ జోహార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ సై అంటే ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌ నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ ట్రెండ్‌ బాలీవుడ్‌ వర్గాలకు మింగుడు పడటం లేదు. అందుకే చిన్న విషయాలను సైతం పెద్దదిగా చేస్తూ విమర్శలు చేస్తున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి తెలుగు సినిమా ధాటికి బాలీవుడ్‌ సినిమా కొంత ఇబ్బంది పడిందనే మాట వాస్తవం.

కేజీఎఫ్‌ 2 రిలీజ్‌ అయినప్పుడు హిందీ సినిమాలు నిలువలేక పోయాయి. టాలీవుడ్‌లో క్రియేటివికి ఎక్కువ. దర్శకులు ఎంచుకుంటున్న కథలు వైవిథ్యంగా ఉండటం వల్ల దేశవ్యాప్తంగా సినీ ప్రియులను అలరిస్తున్నాయి. అందులో హిందీ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఉన్నారు. జాన్‌ అబ్రహం అనే నటుడు తాను ప్రాంతీయ సినిమాల్లో నటించను అంటూ చేసిన ప్రకటన వివాదస్పదమైంది. తెలుగు సినిమాను చూసి భయపడే ఆయన ఇలా స్పందించారు. నిజానికి దక్షిణాది నుండి అబ్రహంకు నటునిగా ఎలాంటి ఆహ్వానం అందలేదనేది సుస్పష్టం. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వీక్షించిన బాలీవుడ్‌ నటులు, సాంకేతిక నిపుణులు సినిమాను ప్రశంసించారు. బావుందని ట్వీట్‌ చేశారు. దక్షిణాది సినిమా సత్తా తెలుసు కాబట్టి కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌ సైతం చిరంజీవి నటిస్తున్న తెలుగు చిత్రంలో నటించేందుకు మనస్ఫూర్తిగా ముందుకువచ్చారు. అమితాబ్‌ వంటి మాజీ సూపర్‌స్టార్‌ కూడా సైరాలో నటించగా, ఇప్పుడు ప్రభాస్‌ నటిస్తున్న ప్రాజెక్ట్‌ కెలో సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే సినిమాలో దీపికా పదుకునె నాయికగా నటిస్తోంది. నిజానికి చాలాకాలంగా ఉత్తరాదికి చెందిన కథానాయికలు తెలుగు సినిమాల్లో నటిస్తూ అత్యధిక పారితోషికం పొందుతున్నారు. వారికి టాలీవుడ్‌ సినిమాలు ఇచ్చిందనేది వాస్తవం. తెలుగు సినిమా స్థాయి పెరగడాన్ని సహించని కొందరు చేస్తున్న కువిమర్శలు మన సినిమా స్థాయిని మరింత పెంచుతాయి కానీ తగ్గించవు అని సినీ ప్రముఖులు అభిప్రాయపడు తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement