Wednesday, April 24, 2024

తెరపైకి సహారా సంస్థ చైర్మన్ సుబ్రతా రాయ్ బయోపిక్..!

ఎప్పటికప్పుడూ కొత్త బయోపిక్ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తోన్న బీ-టౌన్ ఫిల్మ్ మేకర్స్, తాజాగా, సహారా సంస్థ చైర్మన్ సుబ్రతా రాయ్ జీవితంపై దృష్టి పెట్టారు. సహారా ఎయిర్ లైన్స్, లండన్ , న్యూ యార్క్ లో విలాసవంతమైన హోటల్స్, ఫార్ములా వన్ టీమ్, క్రికెట్ టీమ్… ఇలా పలు రకాల వ్యాపారాలతో ఓ వెలుగు వెలిగిన సుబ్రతా రాయ్ 2012 తరువాత కోర్టులు, జైలు జీవితంతో వివాదాలపాలయ్యాడు. ఆయనపై సెబీ ఆర్దిక నేరాల్ని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లింది. దాంతో రెండేళ్లు తీహార్ జైల్లో ఉన్నాడు రాయ్.

సుబ్రతా రాయ్ జీవితం, ఆర్దిక పరమైన వివాదాలు, ఆరోపణల మీద ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ పేరుతో డాక్యుసిరీస్ స్ట్రీమింగ్ చేసిన నెట్ ఫ్లిక్స్ సహారా అధినేత మీద కూడా ఓ డాక్యుమెంటరీ సమర్పించింది. అయితే, అది మొత్తం దురుద్దేశంతో తీశారని సహారా సంస్థ స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో చూపినవన్నీ తప్పులని ఖండించింది. జూన్ 10న ఆయన 73వ జన్మదినం సందర్భంగా మూవీ అనౌన్స్ చేయనున్నారట. అయితే, బాలీవుడ్ లో ఈ టాక్ వినిపిస్తున్నప్పటికీ… దర్శకనిర్మాతలు ఎవరు? నటీనటుల వివరాలేంటి? మొదలైన అంశాలేవీ ఇంకా బయటకు రావటం లేదు. జూన్ 10వ తేదీనే సమాచారం మొత్తం వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం పెరోల్ మీద బయట ఉన్న ఆయన సహారా సంస్థకి చైర్మన్ గా కొనసాగుతున్నాడు. మరి బోలెడంత గ్లామర్, గ్లిట్టర్ అండ్ కాంట్రవర్సీ ఉన్న సుబ్రతా రాయ్ జీవితం బాలీవుడ్ ఎలా చిత్రీకరిస్తుందో… చూడాలి!

Advertisement

తాజా వార్తలు

Advertisement