Friday, March 29, 2024

పైరసీ భూతం, మళ్లీ నిద్ర లేస్తోంది.. టికెట్ల రేట్లు పెంచడమే కారణమా?

ఓటీటీ వేదికలు రాకముందు, సినిమాల పైరసీ విచ్చలవిడిగా జరిగేది. దీనికి మూల కారణం సినిమా టిక్కెట్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉండటమే. ఎక్కువ మంది యువత వేలకు వేలు పోసి సినిమా హాళ్లలో సినిమా చూడలేక, 50 రూపాయలకు పైరసీ సీడీలు లభిస్తుండటం వల్ల వాటి వైపు మొగ్గు చూపారు. కొన్నాళ్లపాటు పైరసీ మాఫియా సినీ పరిశ్రమను వణికించిందంటే అతిశయోక్తి కాదు. ఎంతోమంది పెద్ద పెద్ద హీరోల చిత్రాలు, పెద్ద పెద్ద నిర్మాతల చిత్రాలు ఈ పైరసీ బారిన పడి నష్టాలు చవి చూసాయి. ఎప్పుడైతే ఓటీటీ వేదికల్లో చౌకగా సినిమాలు రావడం మొదలైందో అప్పటినుండి పైరసీ మాఫియా చాలావరకూ వెనకబడిందని చెప్పవచ్చు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఓటీటీల వైపు ఆకర్షితులు కావడం వల్ల పైరసీ సీడీలు కొనేవాళ్ళు బాగా తగ్గిపోయారు. పైరసీ సీడీల వ్యాపారం దాదాపు కనుమరుగయ్యే పరిస్థితులలో ఓటిటి వేదికల్లో చందాలు కట్టిన వారికి కూడా కొన్ని సినిమాలు చూడాలంటే మళ్లి టిక్కెట్లు విడిగా కొనుక్కోవాలని పాత పద్ధతినే కొంతమంది బడా నిర్మాతలు కొనసాగించాలని చూస్తుండటంతో మళ్ళీ కథ మొదటికి వచ్చి పైరసీ భూతాన్ని చేజేతులా నిద్ర లేపిన వాళ్లవుతారేమో అని అనిపిస్తోంది.

ఇటీవల ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను నియంత్రించిన విషయం అందరికీ తెలిసిందే. దీనిమీద రాజకీయ సినీ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, సామాన్య ప్రజలు మాత్రం టికెట్‌ ధరలు తగ్గటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలు పెంచడంతో ప్రేక్షకుల నుండి వ్యతిరేకత వ్యక్తమయయింది. ఈ మధ్యలో కొంతమంది సినీ మేధావులని చెప్పుకునే వాళ్లు సినీ ప్రేక్షకుల చేత, తమ అభిమాన హీరో సినిమాను వెయ్యి రూపాయలు పెట్టైనా చూస్తామని, సినిమా టికెట్ల వ్యవహారంలో ప్రభుతానికి ఏం పని అని సామాజిక మాధ్య మాలలో కారుకూతలు కూయించారు. కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు అన్నట్టు, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అపవాదులు రావడంతో, ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహిరించడం మొదలుపెట్టింది.

ఇదే అదనుగా భావించి కొంతమంది నిర్మాతలు పెద్ద హీరోల సినిమాలకు ఎక్కువ రేటు పెట్టి తమ సినిమాలను విడుదల చేశారు. 100 నుండి 200 రూపాయలు అమ్మాల్సిన సినిమా టిక్కెట్లను 400 నుండి వెయ్యి రూపాయల వరకు రేట్లు పెంచి అమ్మారు. అసలే కూరగాయలు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటడం ప్రారంభమైందో అంతంత రేట్లు పెట్టి సినిమా టిక్కెట్లు కొనలేక మధ్య తరగతి ప్రేక్షకులు ముఖం చాటేశారు. ఆ దెబ్బతో పెద్ద పెద్ద హీరోల సినిమాలు సైతం నష్టాల బారిన పడటం మొదలు పెట్టాయి. అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలు అరకొర లాభాలతో సరిపెట్టుకోగా, కొన్ని చిత్రాలు రెండు మూడు రోజులకే ప్రేక్షకులు లేక జెండా పీకేసి అత్యధిక నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఎప్పుడైతే టీవీ ఛానళ్లలో ఎడతెరిపి లేకుండా సీరియళ్ళ ప్రవాహం మొదలైందో అప్పటినుండి మహిళలు సినిమాలకు దూరం అయ్యారనే చెప్పొచ్చు. నేడు సినిమాలను పోషిస్తోంది కేవలం యువత మాత్రమే. 14-15 సంవత్సరాల నుండి23-24 సంవత్సరాల మధ్య ఉన్న యువత ఇప్పుడు సినిమాలకు మహారాజ పోషకులు. పదవ తరగతి నుండి డిగ్రీ వరకు చదివే ఈ యువకులు పరిపక్వత లేక సినిమా పిచ్చితో, తమ అభిమాన హీరోల మీద ఉన్న వెర్రి అభిమానంతో ఫస్ట డే ఫ‌స్ట షో సినిమా చూడటానికి ఖర్చుకు వెనకాడకుండా ఎంత రేటు పెట్టినా సరే సినిమా టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఎప్పుడైతే సినిమా టికెట్‌ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయో అప్పటినుండి కుర్రకారు పైరసీ సీడీలను కొని చూడటం మొదలుపెట్టారు. ఓటీటీ వేదికల ద్వారా అతి తక్కువ ఖర్చులో నాణ్యమైన సినిమాలు చూడటానికి అవకాశం ఏర్పడటంతో వీళ్ళందరూ పైరసీ సీడీలను పక్కనపెట్టి ఓటీల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు.

ఏ వస్తువు పైన అయినా తయారీదారుడికే హక్కులుంటాయని ఆ వస్తువుపై ఎమ్మార్పీ ధరలు నిర్ణయించే హక్కు కూడా తయారీ దారుడికే ఉంటుందని, దాన్ని నియంత్రించే హక్కు ప్రభుత్వానికి ఉండదని మరో సినీ మేధావి మరో కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చాడు. నిజంగానే ఏ వస్తువు పైన అయినా ఎమ్మార్పీ ధర నిర్ణయించే హక్కు ఆ తయారీదారుడికే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మార్కెట్లో డిమాండ్ను బట్టి ఆ వస్తువు రేటు మారకూడదు. ప్రజల అవసరాలను బట్టి, ప్రజల బలహీనతలను బట్టి వస్తువుల రేటు మారుతూ ఉంటే అది బ్లాక్‌ మార్కెటింగ్‌ కిందకు వస్తుంది. అటువంటి బ్లాక్‌ మార్కెటింగ్‌ విధానాలను నియంత్రించడానికి ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉంటుంది.

- Advertisement -

ఏ దేశంలోనైనా సరే ఏ వ్యాపారం చేసినా వాటి మీద నియంత్రణ అక్కడ ప్రభుత్వాలకు ఉంటుందన్న చిన్న విషయం కూడా ఈ మేధావులకు తెలియకపోవటం అత్యంత ఆశ్చర్యకరం సినిమా టికెట్ల రేట్లను నియంత్రించే హక్కు ప్రభుత్వాలకు లేనప్పుడు, పైరసీని నియంత్రించే బాధ్యత ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిలోని మంచిచెడ్డలను లోతుగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి. ఇకనైనా సినిమా పెద్దలు, మేధావులు, అధికారులు అందరూ కలిసి లోతుగా విశ్లేషించి సినిమా టికెట్ల ధరలపై సరైన నిర్ణయం తీసుకుంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు పైరసీ భూతం వైపు వెళ్ళకుండా వుంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement