Tuesday, April 23, 2024

ఆఫర్‌ లెటర్‌ ఇచ్చారు.. ఉద్యోగమే ఇవ్వడంలేదు

దేశంలో ఉన్న ఐటీ సంస్థలు కొత్త ఎంపికలపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఉన్న ఉద్యోగులనే చాలా సంస్థలు ఏదో పేరుతో తొలగిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక పరిస్థితుల మూలంగా ఇప్పటికే ఐటీ కంపెనీలు లక్షల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ క్రమంలోనే చాలా పెద్ద ఐటీ కంపెనీలు కూడా క్యాంపస్‌లో ఎంపిక చేసుకున్న ఫ్రెషర్స్‌కు ఆఫర్‌ లెటర్స్‌ ఇచ్చి 6 నెలలు అవుతున్నా వారికి ఉద్యోగంలోకి తీసుకోవడంలేదు. దాదాపు అన్ని సంస్థలు వేచి చూసే దోరణిలోనే ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.

ప్రత్యేక నైపుణ్యం అవసరమైన ప్రాజెక్ట్‌లు వస్తే, ఆయా నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను ఐటీ సంస్థలు తీసుకుంటున్నాయి. సాధారణ నైపుణ్యాలు ఉన్న వారిపై, ఫ్రెష్‌గా ఇంజినీరింగ్‌ పాసైన వారిని తీసుకునేందుకు ఐటీ సంస్థలు ఆసక్తి చూపించడంలేదు. ఒక్క టీసీఎస్‌ మాత్రమే తాము ఆఫర్‌ లెటర్‌ ఇచ్చిన అందరినీ 4వ త్రైమాసికంలో ఉద్యోగంలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. మిగిలిన ఏ సంస్థ కూడా లెటర్లు ఇచ్చినప్పటికీ, ఆ విషయాన్ని విస్మరించాయి. విప్రో సంస్థ ఫ్రెషర్స్‌ను ట్రైనింగ్‌కు తీసుకుని టెస్ట్‌ పేరుతో దాదాపు అందరినీ వెనక్కి పంపించింది.

- Advertisement -

అమెజాన్‌ ఇండియాలోనూ…

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా కూడా క్యాంపస్‌లో ఎంపిక చేసుకున్న వారిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోకూడదని నిర్ణయించింది. ఇప్పటికే ఈ సంస్థ 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఇలా తొలగింపుకు గురైన వారిలో ఇండియాలో పని చేస్తున్నవారు ఉన్నారు. టాప్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో అమెజాన్‌ క్యాంపస్‌ ఎంపికలు చేసుకుంది. ఎంపిక చేసుకున్న విద్యార్ధులకు ఇంతవరకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. సంస్థ ఆర్ధిక పరిస్థతి బాగలేకపోవడం వల్ల వీరికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నట్లు అమెజాన్‌ ఇండియా చెబుతున్నది. మరో 6 నెలల పాటు జాప్యం తప్పదని స్పష్టం చేస్తోంది. అప్పటికి కూడా ఉద్యోగంలోకి తీసుకుంటారన్న భరోసా మాత్రం లేదు. 2023-24 ఆర్ధిక సంవత్సరం మొత్తం ఆర్ధిక అనిశ్చితి ఇలానే కొనసాగుతుందని అమెజాన్‌ భావిస్తోంది.

వ్యయ నియంత్రణ పేరుతో ఉన్న వారిలోనే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంస్థ కొత్త వారిని తీసుకునే అవకాశం లేదని మార్కెట్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రిలయన్స్‌జియో మార్ట్‌లోనూ ఇటీవల 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. మెట్రో ఇండియాను రిలయన్స్‌ జియో మార్ట్‌ కొనుగోలు చేసింది. దాంతో ఆ ఉద్యోగులు కూడా చేరడంతో ఒకేతరహా పని చేసే వారి సంఖ్య పెరిగిందని, దీని వల్ల తప్పనిసరిగా కొందరిని తొలగించాల్సి వచ్చిందని జియో మార్ట్‌ తెలిపింది. అందు వల్ల జియో రిటైల్‌ సంస్థలోనూ కొత్తగా ఎంపిక చేసుకున్న వారికి ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశం లేదు.

ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటాలోనూ 10 వేల మందికి పైగా తొలగించారు. మెటా ఇండియా కార్యాలయాల్లో పని చేస్తున్న వారు కూడా ఉద్వాసనకు గురయ్యారు. అందువల్ల ఇండియాలో ప్రత్యేకంగా కొత్త వారిని ఉద్యోగాల్లోకి తీసుకునే పరస్థితి లేదు.
ఉద్యోగాలు కోత భారీగా జరుగుతున్నందున క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకునే పరిస్థితులు లేవని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆఫర్‌ లెటర్‌ చేతిలో ఉన్నందున చాలా మంది ఇప్పటి వరకు ధీమాగా ఉన్నారు. అయితే పరిస్థితులు ఏ మాత్రం బాగోలేకపోవడం వల్ల ఇలాంటి వారు ప్రత్యామ్నాయలను చూసుకోవాలని ఐటీ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది విద్యార్ధులు ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతున్నారు. వీరిలో చాలా మంది ఎంటెక్‌, ఎంబీఏ వంటి కోర్సులు చేసేందుకు విదేశాలకు వెళ్తుతున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్ధులు తమ నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల ముందుముందు మంచి ఉద్యోగాల్లోకి వెళ్లేందుకు అర్హతలను పెంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎంటెక్‌, ఎంబీఏ పూర్తి చేసుకోవడం మంచిదని, అంతర్జాతీయంగా ఆర్ధిక పరిస్థితులు వచ్చే రెండు సంవత్సరాల్లో కుదుటపడితే తిరిగి పెద్ద సంఖ్యలోనే టెక్‌ కంపెనీలు ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని వీరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement