Thursday, April 18, 2024

పెరిగిన వ్యయాలు, తగ్గుతున్న అప్పుల శాతం.. ఆర్థిక పురోగతిపై కాగ్‌ సమీక్షలో తెలంగాణ పురోగతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆర్ధిక క్రమశిక్షణతో మెలుగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు, అద్భుత పురోగతి మంచి బలాన్నిస్తోంది. సంపద పెంచి ప్రజలకు పంచేలా తెలంగాణ సర్కార్‌ చేస్తున్న ధీర్ఘకాలిక వ్యూహాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పెట్టుబడులకు అప్పులు చేస్తూ, వాటిని ఉత్పాదక రంగాలకు వెచ్చించడం, సంపద సృష్టించడంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ దృష్టిని ఆకర్శిస్తోంది. జీఎస్‌డీలో అప్పుల శాతం 25కు పెంచుతూ అనుమతులు ఇచ్చినట్లే ఇచ్చిన కేంద్రం తిరిగి నియంత్రణలతో కట్టడి చేసింది. అయినప్పటికీ కేంద్రం అనుమతించిన నిబంధనలకు లోబడే రుణాలు సేకరించడమే కాకుండా అతి తక్కువ వడ్డీలకు అప్పుల సేకరణ తెలంగాణకే చెల్లుతోంది. 2019-20 వార్షిక ఏడాదిలో 21శాతానికి రుణాలను పరిమితం చేయగా, ఈ ఏడాదిలో ఇవి 17శాతంలోనే ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ ఇప్పటికే ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలకు, ఇతర నిర్మాణాత్మక రంగాలకు రుణాలను తీసుకొస్తున్నది. అయితే వీటిని వృధా రంగాలకు కాకుండా ఉత్పత్తి రంగాలకు, సంపద సృష్టికి వినియోగిస్తున్నది. దీంతో రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని రీతిలో వ్యవసాయ రంగం వృద్ధికి చేరింది. తద్వారా రాష్ట్ర సంపద పెరుగుతూ ప్రజల జీవన ప్రమాణం మెరుగవుతున్నది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులను తిరిగి చెల్లించేందుకు 25ఏళ్లకుపైగా సమయం ఉండగా, కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలతో ఇబ్బందుల పాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

జీఎస్‌డీపిలో ద్రవ్యలోటు 3నుంచి 4.5 శాతంగా ఉండొచ్చని నిబంధనలుండగా, దీనిని 2.53 శాతానికే తెలంగాణ పరిమితం చేసుకుంది. 2016-17లో రాష్ట్రం తీసుకున్న అప్పు రూ. 131531కోట్లుకాగా, జీఎస్‌డీపీ 659033 ఉండగా జీఎస్‌డీపీలో అప్పుల శాతం 20.04గా నమోదైంది. 2017-18లో అప్పు రూ. 1,52,180కోట్లుకగా, జీఎస్‌డీపీ 753811గా ఉంటూ జీఎస్‌డీపీలో అప్పుల శాతం 20.23గా ఉంది. 2018-19లో 1,79,795 తీసుకోగా, జీఎస్‌డీపీ 865688గా ఉంటూ ఇందులో అప్పుల శాతం 20.77గా ఉంది. ఇక 2019-20లో రూ. 2,03,730కోట్ల అప్పుతో జీఎస్‌డీపీ 9,50,000ల అంచనాతో జీఎస్‌డీపీలో 17శాతంగా అప్పులు నమోదయ్యాయి. 2022-23లో అంటే ఈ ఏడాది అప్పుల శాతం తగ్గింది. మరోవైపు ప్రభుత్వ పెట్టుబడులు, ముందుచూపుతో ప్రజల సంపద, స్వశక్తి అభివృద్ధి చెందుతోంది.

తెలంగాణ ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయన్న వాదన నిజంకాకపోగా, మరోవైపు రెవెన్యూ వసూళ్లకంటే వడ్డీ చెల్లింపులు మించరాదన్న పరిమితిని ఏనాడూ దాటకుండా నేర్పుగా ముందుకు వెళుతున్నది. ఏ రాష్ట్రమైనా తన పన్నుల రాబడికంటే 10శాతానికి మించి రుణాలపై వడ్డీలకు చెల్లింపులు చేయరాదని ఎప్‌ఆర్‌బీఎం చట్టం చెబుతున్నట్లుగా, తెలంగాణ రాష్ట్రం స్థిర ఆర్ధిక వృద్ధిరేటును సాధిస్తున్నట్లుగా ఈ నిబంధనతో స్పష్టమవుతోంది. జీఎస్‌డీపీలో 3.5 శాతానికి మించి అప్పులు చేయరాదని షరతు ఉంది. రెవెన్యూ మిగులు అధికంగా ఉన్న తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాలకు మాత్రం 3.5 శాతం రుణ సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. మిగులు రాష్ట్రాలుగా ఘనతను సాధించడంతో ఈ మేరకు కేంద్రం ఈ వెసులుబాటును వర్తింపజేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర మొత్తం అప్పులపై వడ్డీలకు చెల్లింపులు రాబడుల్లో 10శాతంలోపే ఉండాలన్న షరతును పక్కాగా అమలు చేయడంతో భవిష్యత్‌ అప్పులపై ఢోకా లేకుండా పోయింది. అప్పుల తిరిగి చెల్లింపులకు 25 ఏళ్లపాటు సమయం చిక్కి, వడ్డీల భారం కూడా తగ్గింది. 2015-16లో రూ.7942 కోట్లుగా ఉన్న వడ్డీల భారం తాజాగా 10శాతం లోపుగానే నమోదవుతున్నది. రాష్ట్ర ఆదాయ స్థితిగతులకు కీలకమైన పన్నుల రాబడి, పన్నేతర ఆదాయం, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లను భారీగా నిర్ధేశించుకుని అంచనాలు వేసుకోగా జీఎస్టీ మినహా మిగతా రాబడులు అనుకూలంగానే ఉన్నాయి.

ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20వేల కోట్ల అప్పులను సమీకరించుకున్నది. గడచిన ఐదు నెలల్లో పన్ను రాబడి 40వాతానికి చేరుకోగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు 10శాతం కూడా కేంద్రం విడుదల చేయలేదు. బడ్జెట్‌ ప్రతిపాదనా అంచనాల్లో అప్పులు 34శాతంగా నమోదయ్యాయి. ఏప్రిల్‌లో పన్ను రాబడి రూ. 9219కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 189కోట్లుగా వచ్చింది. మే నెలలో పన్ను రాబడి రూ. 9459కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 411కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూ. 101కోట్లు, జూన్‌లో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఆదాయం రూ. 1134కోట్లు, పన్నుల ఆదాయం రూ. 10461కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 557కోట్లు, ఆగష్టులో పన్ను ఆదాయం రూ. 10463కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 407కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూ. 2022కోట్లుగా సమకూరింది. ఈ ఏడాది గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూ. 40వేల కోట్లు అంచనాల్లో ఇప్పటివరకు రూ. 4వేల కోట్లే వచ్చాయి. ఈ ఏడాది వ్యయం ఎక్కువగా నమోదుకాగా, అప్పులు గగేడాదికంటే భారీగా తగ్గాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement