Friday, March 29, 2024

Big story : ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండబోమన్న టీసీఎస్‌.. మూన్‌లైటింగ్‌కు నో

ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించబోమని టీసీఎస్‌ తెలిపింది. మూన్‌లైటింగ్‌ చేసే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల చిన్న వయస్సులోనే వారి ఉద్యోగ జీవితం నాశనం అవుతుందని టీసీఎస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎన్‌.గణపతి సుబ్రమణియమ్‌ అభిప్రాయపడ్డారు. మూన్‌లైటింగ్‌ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడం. నియామక ఒప్పంద పత్రంలోని షరతుల ప్రకారం ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. అయితే అప్పుడే ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టిన యువత విషయంలో ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

మూన్‌లైటింగ్‌ పేరుతో చర్యలు తీసుకోవడం వల్ల ఆ వ్యక్తి ఉద్యోగ జీవితానికి ముప్పుు ఏర్పడుతుందని చెప్పారు. మరో చోట ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పుడు గత ఉద్యోగం నుంచి తొలగించడానికి కారణాలు, కొత్త ఉద్యోగం రాకుండా అడ్డుకుంటాయన్నారు. అందుకే ఇలాంటి వారిపై దయ చూపాలని ఆయన కోరారు. ప్రతి ఉద్యోగిని కంపెనీ తన కుటుంబ సభ్యుడిగా అనుకుంటుందని, అందువల్ల ఏమైనా చర్యలు తీసుకుంటే, ఆ కుటుంబ సభ్యడి ఉద్యోగ జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయాన్ని కూడా కంపెనీ దృష్టి సారిస్తుందని చెప్పారు.

- Advertisement -

కొన్ని ఐటీ కంపెనీలు ఫ్రీల్యాన్సర్స్‌తో కలిసి పని చేస్తుంటాయని, టీసీఎస్‌ అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తుందని ఆయన చెప్పారు. అందువల్ల వినియోగదారుల డేటా భద్రతకు టీసీఎస్‌ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని
టీసీఎస్‌ మూన్‌లైటింగ్‌ లాంటి కార్యకలాపాలను కొనసాగించడానికి అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు ఇలాంటి ఉద్యోగులకు చిన్న వయస్సులోనే శిక్ష వేయాలని తాము అనుకోవడం లేదన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం వల్ల ఉద్యోగులకు కొంత వెసులుబాటు సమయం లభించడం వల్లే వారు ఆ సమయంలో మరో కంపెనీకి పని చేయడం ప్రారంభించారని ఆయన చెప్పారు. ఇలాంటి వారి పరిస్థితిని అర్దం చేసుకోవాలని, ఉద్యోగం నుంచి తొలగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
పరీక్ష పాసైతే వేతనం పెంపు

ప్రారంభ స్థాయి ఉద్యోగులకు ఎక్కువ కాలం పాటు ఒకే స్థాయిలో వేతన ప్యాకేజీని కొనసాగించడంపై సుబ్రమణియమ్‌ స్పందించారు. కొత్త వారికి ప్యాకేజీ సరిపోతుందని కంపెనీ భావిస్తోందని చెప్పారు. కొన్ని పరీక్షలు పాసైతే ఏడాదిలోగా వారి వేతనం రెట్టింపయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. ఉద్యోగిని నియమించినప్పుడు 6 నెలల పాటు శిక్షణ కోసం కంపెనీ ఖర్చు చేసి ఒక ప్రాజెక్ట్‌లో భాగం చేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా సుమారు 20-30 శాతం మంది ఉద్యోగులు పరీక్షల్లో పాసై వేతనాలను రెట్టింపు చేసుకున్నారని ఆయన వివరించారు. ఆఫీస్‌లో మెంటార్‌షిప్‌ ద్వారా ఉద్యోగులు నేర్చుకునే వీలుంటుందని చెప్పారు. ఉన్నత స్థాయి నైపుణ్యాలను కూడా పెంచుకోవచ్చన్నారు.

2025 నాటికి 25శాతం ఆఫీస్‌లకు
ఇంటి వద్ద నుంచి పని చేయడం వల్ల నైపుణ్యాలను పెంచుకోవడం సాధ్యంకాదన్నారు. 2025 నాటికి కేవలం 25 శాతం మంది మాత్రమే ఆఫీస్‌లకు వచ్చి పనిచేసేలా టీసీఎస్‌ దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్ధేశించుకుందని ఆయన వివరించారు. దీనికంటే ముందు ఆఫీస్‌ల నుంచి పని చేసే ఉద్యోగుల సంఖ్యను 75 శాతానికి పెంచుకోవాలని కంపెనీ భావిస్తోందని చెప్పారు. ఆఫీస్‌కు వచ్చి పని చేయడానికి ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఆలోచిస్తున్నారని , వారిని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. మరికొంత మంది ఇంటి వద్ద నుంచి పని చేసే నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడటంలేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement